Thursday, November 20, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుమహిళా ఉత్పత్తులకు అమెజాన్‌ మార్కెటింగ్‌

మహిళా ఉత్పత్తులకు అమెజాన్‌ మార్కెటింగ్‌

- Advertisement -

ఆ సంస్థతో చర్చలు
శిల్పారామంలో మూడెకరాల్లో ప్రత్యేక స్టాల్స్‌ ఏర్పాటు
కోటిమంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేయడమే లక్ష్యం
‘మహిళల ఉన్నతి- తెలంగాణ ప్రగతి’పేరుతో ఇందిరమ్మ చీరల పంపిణీ
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం ఏ రేవంత్‌రెడ్డి
నెక్లెస్‌రోడ్‌లో ఇందిరమ్మ విగ్రహానికి నివాళులు

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
‘మహిళల ఉన్నతి-తెలంగాణ ప్రగతి’ పేరుతో రాష్ట్రంలోని కోటిమంది స్వయం సహాయక బృందాల్లోని మహిళలకు నాణ్యమైన ఇందిరమ్మ చీరల్ని ఆడపడుచు లాంఛనంగా ప్రభుత్వం తరఫున అందిస్తున్నామని సీఎం ఏ రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా బుధవారంనా డిక్కడి నెక్లెస్‌ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడే లాంఛనంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో ఇందిరమ్మ చీరల పంపిణీ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, మహిళా స్వయం సహాయక బృందాలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఆడబిడ్డలకు సారె, చీర పెట్టడం తెలంగాణ సంప్రదాయమనీ, దానిలో భాగంగానే వారికి ఇందిరమ్మ చీరలను పంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా చీరల పంపిణీ ప్రక్రియకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఒక నోడల్‌ అధికారిని నియమించాలనీ, స్థానిక ప్రజాప్రతినిధుల్ని భాగస్వాములు చేయాలని సూచించారు. నియోజకవర్గాల్లోని అన్ని మండల కేంద్రాల్లో విడతల వారీగా ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు కట్టుబడి ఉందనీ, వచ్చే మూడేండ్లలో కోటిమంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేయడమే లక్ష్యంగా విధాన నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. దానిలో భాగంగానే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడంతో పాటు, వారికే ఆర్టీసీ అద్దె బస్సుల్ని కూడా అందచేసి, బస్సు యజమానుల్ని చేస్తున్నామని తెలిపారు.

స్కూల్స్‌లో యూనిఫారం కుట్టే కుట్టుపని బాధ్యత మహిళా సంఘాలకే అప్పగించామనీ, ఇందిరమ్మ క్యాంటీన్లు, శిల్పారామంలో మూడు ఎకరాల్లో ఇందిరా మహిళా శక్తి బజార్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ మహిళలు తమ ఉత్పత్తుల్ని మార్కెటింగ్‌ చేసుకొనే అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. దానితో పాటు స్వయం సహాయక బృందాల ఉత్పత్తులకు ఆన్‌లైన్‌ మార్కెట్‌ కోసం ‘అమెజాన’్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. దీనివల్ల జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు అందేలా అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలనీ, గ్రామీణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం బుధవారం (ఈనెల 19వ తేదీ) నుంచి డిసెంబర్‌ 9 వరకు జరుగుతుందని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మార్చి 1 నుంచి 8 వరకు ఉంటుందన్నారు.

ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలనీ, జిల్లా కలెక్టర్ల వద్ద ఇప్పటికే జనగణన వివరాలు ఉన్నాయనీ, ఆ డేటాను వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో మహిళలకు ఇప్పటి వరకు రూ. 27 వేల కోట్లు వడ్డీలేని రుణాలు ఇచ్చామనీ, పెట్రోల్‌ బంకులు, సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు, పాడి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వంటి అనేక అవకాశాలు సృష్టిస్తున్నామని సీఎం తెలిపారు. వివాదాలు లేకుండా ఉండటం కోసం ఇందిరమ్మ చీరలు ఇచ్చే కార్యక్రమంలో లబ్దిదారుల ఫేస్‌ రికగ్నైజేషన్‌, ఆధార్‌నెంబర్‌ తీసుకోవాలని ఆదేశించారు. ఈ డేటాను భవిష్యత్‌లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమల్లో భాగంగా మహిళలకు లబ్ది చేకూర్చే విధంగా మార్పులు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకాటి శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -