Sunday, January 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅంబర్‌పేట్‌ ఎస్‌ఐ అరెస్ట్‌

అంబర్‌పేట్‌ ఎస్‌ఐ అరెస్ట్‌

- Advertisement -

చంచల్‌గూడ జైలుకు తరలింపు
చోరీ కేసులో రికవరీ సొమ్ము వాడుకోవడం, సర్వీస్‌ రివాల్వర్‌ మిస్సింగ్‌పై కేసు


నవతెలంగాణ-అంబర్‌పేట
చోరీ కేసులో రికవరీ చేసిన సొమ్మును వాడుకున్నందుకు హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ భాను ప్రకాశ్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకెళ్తే.. అంబర్‌పేట్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహించిన భాను ప్రకాశ్‌రెడ్డి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు అలవాటుపడి అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చేందుకు అడ్డదారులు తొక్కిన ఆయన ఓ కేసులో రికవరీ చేసిన ఐదు తులాల బంగారాన్ని సొంత అవసరాలకు వినియోగించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంపై గత ఏడాది నవంబర్‌లో విచారణ కొనసాగుతున్న సమయంలోనే ఆయన సర్వీస్‌ గన్‌ కనిపించకుండా పోవడం కలకలం రేపింది. రివాల్వర్‌ మాయంపై విచారణ సమయంలో ఎస్‌ఐ వేర్వేరు కథనాలు చెప్పినట్టు అధికారులు తెలిపారు.

ఒకసారి.. రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో రివాల్వర్‌ పోయిందని, మరోసారి విజయవాడలోని ఓ లాడ్జిలో పుస్తకాల దగ్గర పెట్టగా మాయం అయిందని పొంతన లేకుండా చెప్పాడు. అయితే, పోలీసుల విచారణలో ఈ వాదనలకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లభించలేదని అధికారులు స్పష్టం చేశారు. అధికారులు ఆరా తీయగా సదరు ఎస్‌ఐ తన రివాల్వర్‌ను తాకట్టు పెట్టాడని, అమ్మేశాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గన్‌ ప్రస్తుతం ఎక్కడ ఉందన్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఎస్‌ఐని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపర్చారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయనను రిమాండ్‌ నిమిత్తం చంచల్‌గూడ జైలుకు తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -