నవతెలంగాణ – కంఠేశ్వర్
మున్సిపల్ రిజర్వేషన్లలో జరిగిన అస్పష్టతను తొలగించాలని సీపీఐ(ఎం) నాయకులు డిమాండ్ చేశారు. శనివారం నగరంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ నిర్ణయం మేరకు శనివారం మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ల రిజర్వేషన్లతో పాటు వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీల సమావేశంలో వార్డుల రిజర్వేషన్ల నిర్ణయంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయని తెలిపారు. ప్రధానంగా ఆయా వార్డుల్లో ఎస్సీ రిజర్వేషన్ ఖరారు చేసిన వార్డుల కన్నా ఇతర వార్డుల్లో అధికంగా ఎస్సీ జనాభా ఉన్నప్పటికీ అ వార్డులను ఎస్సీలకు కేటాయించకుండా జనరల్ కేటగిరీలో నిర్ణయించారని అదేవిధంగా బీసీల రిజర్వేషన్ ఖరారు లో కూడా సరైన నిర్ణయం జరగలేదని, ఖరారు అనంతరం సీపీఐ(ఎం) కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు తెలిపారు.
ఈ అస్పష్టత నిర్ణయం మూలంగా ఆయా వార్డుల్లో పోటీ చేయాలని కుతూహలంతో ఉన్న అనేకమంది అభ్యర్థులకు నిరాశ మిగులుతుందని, గత ఎన్నికల్లో మహిళలకు నిర్ణయించిన వార్డులనే తిరిగి వారికే కేటాయించటం మూలంగా పురుషులు నిరాశ చెందే పరిస్థితి వచ్చిందని రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లను మారుస్తామని చెప్పి మహిళలకు అవే కేటాయించటం సరైనది కాదని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా రిజర్వేషన్ల నిర్ణయంలో జరిగిన అస్పష్టతను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
అదేవిధంగా ఈ ఎన్నికల్లో ప్రజలను కులము ,మతము ఆధారంగా భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని కొన్ని వర్గాలు రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయని వీటిని ప్రజలు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. తమ సమస్యలను పట్టించుకోని పని చేసే వారిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నగర కార్యదర్శి బి. సుజాత నగర నాయకులు అంజయ్య, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



