యూఎస్ తనకు తాను జడ్జిగా వ్యవహరించరాదు : వెనిజులాపై సాయుధ దురాక్రమణను ఖండించిన భద్రతా మండలి
ఇదొక ప్రమాదకరమైన ఆనవాయితీ
సరిహద్దుల ఉల్లంఘన చర్చలకు అతీతమైనది
వెనిజులా అధ్యక్షడు నికోలస్ మదురోను బలవంతంగా కస్టడీలోకి తీసుకున్న ఘటన ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో అమెరికాను దౌత్యపరంగా పూర్తిగా ఒంటరిగా నిలబెట్టింది. ఒక స్వతంత్ర దేశాధ్యక్షుడి అపహరణను ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ పేరిట సమర్థించేందుకు వాషింగ్టన్ చేసిన ప్రయత్నాలు అక్కడ ఘోరంగా విఫలమయ్యాయి. ఈ చర్య అంతర్జాతీయ చట్టాలకు, దేశాల సార్వభౌమత్వానికి స్పష్టమైన ఉల్లంఘన అని అనేక దేశాలు ఏకగ్రీవంగా స్పష్టం చేయడంతో అమెరికా వాదనకు ఎలాంటి మద్దతూ లభించలేదు. ప్రపంచానికి నైతిక పాఠాలు చెప్పే అమెరికా విదేశాంగ విధానంలోని ద్వంద్వ వైఖరి మరోసారి బహిర్గతమై, సామ్రాజ్యవాద దౌర్జన్యానికి అంతర్జాతీయ వేదికపై గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లైంది.
న్యూయార్క్ : వెనిజులాలో అమెరికా చేపట్టిన సైనిక చర్యపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్త మైంది. అమెరికా వ్యతిరేకులే కాకుండా మిత్ర దేశాలు కూడా ఈ చర్యను ముక్తకంఠంతో ఖండిం చాయి. అన్ని వైపుల నుంచి విమర్శ నాస్త్రాలు తగలడంతో అగ్రరాజ్యం ఉక్కిరి బిక్కిరైంది. అదే సమయంలో వెనిజులాపై జరిపిన దాడిని నిస్సిగ్గుగా సమర్ధించుకుంది. వెనిజులా పరిణామాలపై చర్చించేందుకు ఐరాస భద్రతా మండలి సోమవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. దక్షిణ అమెరికా దేశమైన వెనిజులా వ్యవహారాలలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవడాన్ని పలు దేశాలు నిరసించాయి. మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్నాయన్న ఆరోపణతో కొలంబియా, మెక్సికోపై కూడా సైనిక చర్యకు దిగుతామంటూ ట్రంప్ ఇటీవల చేస్తున్న ప్రకటనలను గర్హించాయి. అమెరికా భద్రతా ప్రయోజనాల కోసం డెన్మార్క్‌లోని గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని కూడా ట్రంప్ హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే.
సరిహద్దుల ఉల్లంఘనపై చర్చలా : డెన్మార్క్
ఖనిజ వనరులు పుష్కలంగా ఉన్న గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ కన్నేయడాన్ని డెన్మార్క్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సరిహద్దుల ఉల్లంఘనపై చర్చలు జరపలేమని ఐరాసలో డెన్మార్క్ రాయబారి క్రిస్టీనా మార్కస్ లాసెన్ అన్నారు. వెనిజులా సార్వభౌమత్వాన్ని కూడా ఆమె సమర్ధించారు. బలప్రయోగం లేదా అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా ఉన్న చర్యల ద్వారా వెనిజులా రాజకీయాలను ప్రభావితం చేసేందుకు ఏ దేశమూ ప్రయత్నించకూడదని ఆమె చురక వేశారు.
తప్పుపట్టిన ఫ్రాన్స్, ఐరాస సెక్రెటరీ జనరల్
మిత్ర దేశాల నుంచి కూడా అమెరికా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. అమెరికా సహా ఐరాస భద్రతా మండలి శాశ్వత సభ్యదేశాలు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తే అది ప్రపంచ క్రమం యొక్క పునాదిని ధ్వంసం చేయడమే అవుతుందని ఐరాసలో ఫ్రాన్స్ ఉప రాయబారి జే ధర్మాధికారి అభిప్రాయపడ్డారు. కాగా అమెరికా రాయబారి మైక్ వాల్ట్ తమ చర్యను సమర్ధించుకుంటూ అది చట్టానికి లోబడే ఉన్నదని తెలిపారు. మదురోను అమెరికా లక్ష్యంగా చేసుకోవడంపై భద్రతా మండలి సభ్యులు చేసిన విమర్శలను తప్పుపట్టారు. అమెరికా సైనిక చర్య అంతర్జాతీయ చట్టంలోని నిబంధనలను గౌరవించకపోవడం తనను ఆందోళనకు గురిచేసిందని ఐరాస సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెర్రెస్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో వివిధ దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయనే దానికి అమెరికా తీసుకున్న తీవ్రమైన చర్య ఒక ఉదాహరణగా మారవచ్చునని చెప్పారు.
మదురో విడుదలకు డిమాండ్ చేయండి : వెనిజులా
కేవలం వ్యాఖ్యలు, ఖండనలకే పరిమితం కావద్దని, అవసరమైన చర్యలు తీసుకోవాలని వెనిజులా రాయబారి శామ్యూల్ మాంకాడా కోరారు. ‘ఒక దేశాధినేతను కిడ్నాప్ చేయడం, సార్వభౌమత్వ దేశంపై బాంబు దాడి చేయడం, మరింతగా సైనిక చర్యకు దిగుతానని బహిరంగంగా బెదిరించడం వంటి చర్యలను సహిస్తే లేదా తేలికగా తీసుకుంటే ప్రపంచానికి ఇచ్చే సందేశం దారుణంగా ఉంటుంది. చట్టం అనేది ఐచ్ఛికం…అంతర్జాతీయ సంబంధాలలో బలమే నిజమైన న్యాయ నిర్ణేత అనేదే ఆ సందేశం. మదురో, ఆయన భార్యను విడుదల చేయాల్సిందిగా అమెరికాను డిమాండ్ చేయండి’ అని విజ్ఞప్తి చేశారు. వెనిజులా పరిణామం నుంచి ఇతర దేశాలు దృష్టి మరల్చకూడదని ఆయన హెచ్చరించారు. అమెరికా తర్కాన్ని అంగీకరించడమంటే తీవ్ర అస్థిర ప్రపంచానికి తలుపులు తెరవడమే అవుతుందని చెప్పారు.
ఆటవిక చర్యలను అనుమతించొద్దు : రష్యా, చైనా
భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాలైన చైనా, రష్యా కూడా అమెరికా దుశ్చర్యపై ధ్వజమెత్తాయి. అమెరికా తిరిగి ‘ఆటవిక కాలం’లోకి వెళ్లిందని, దీనిని అనుమతించ వద్దని కోరాయి. ‘అంత ర్జాతీయ చట్టాన్ని, సార్వ భౌమత్వాన్ని, ఇతర దేశాల వ్యవహారాలలో జోక్యం చేసుకోరాదన్న సూత్రాన్ని గౌరవించకుండా ఏ దేశాన్నయినా ఆక్రమించడానికి, ఎవరినైనా దోషులుగా ముద్ర వేయడానికి, శిక్షలను అమలు చేయడానికి అత్యున్నత న్యాయ స్థానం జడ్జిగా తనకు అధికారం ఉన్నదని అమెరికా తనకు తానుగా ప్రకటించు కోవడాన్ని మేము అనుమతించం’ అంటూ రష్యా రాయబారి వాసిలీ నెబెంజియా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
హింసతో ప్రజాస్వామ్యాన్ని రక్షించలేం : కొలంబియా
వెనిజులాపై జరిగిన దాడిని పొరుగు దేశమైన కొలంబియా తీవ్రంగా ఖండించింది. గతంలో ఈ ప్రాంతంలో జరిగిన దారుణమైన జోక్యాన్ని తాజా దాడి గుర్తుకు తెస్తోందని వ్యాఖ్యానించింది. ‘హింస, బలప్రయోగం ద్వారా ప్రజాస్వామ్యాన్ని రక్షించలేము లేదా ప్రోత్సహించలేము. ఆర్థిక ప్రయోజనాల ద్వారా కూడా దానిని భర్తీ చేయలేము’ అని కొలంబియా రాయబారి లియోనర్ జలబాటా అన్నారు.
మదురోను పట్టుకోవడానికి 200మందికి పైగా అమెరికా సైనికులు వెల్లడించిన పెంటగాన్ చీఫ్
వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురోను పట్టుకోవడానికి దాదాపుగా 200మంది అమెరికా సైనికులు వెనిజులా రాజధాని కారకస్‌లో ప్రవేశించారని పెంటగన్ చీఫ్ పీటె హెగ్‌సాథ్ సోమవారం వెల్లడించారు. అమెరికా న్యాయ వ్యవస్థ కోరుకుంటున్న వ్యక్తిని పట్టుకు తీసుకువచ్చేందుకు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు మద్దతుగా దాదాపుగా 200మంది అమెరికన్ సైనికులు రంగంలోకి దిగి ఒక్క అమెరికన్ కూడా చనిపోకుండా పని పూర్తి చేసుకుని వచ్చారని హెగ్‌సాథ్ తెలిపారు. వర్జీనియాలో అమెరికా నావికులు, నౌకా నిర్మాణకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యావత్ ప్రపంచం నివ్వెరపోయేలా జరిగిన ఈ ఆపరేషన్‌లో కారకస్‌లోకి ప్రవేశించిన అమెరికా బలగాల సంఖ్య గురించి ఒక అమెరికా అధికారి వెల్లడించడం ఇదే తొలిసారి. ఈ ఆపరేషన్‌లో 150కి పైగా మిలటరీ హెలికాప్టర్లు వెనిజులా రక్షణ వ్యవస్థలపై దాడులతో సహా వివిధ కార్యకలాపాల్లో పాల్గొన్నాయి.



