నిత్యం ఎక్కడో ఒక దగ్గర ఉద్రిక్తతలను రెచ్చగొట్టి ఆయుధాలను అమ్ముకొని సొమ్ము చేసుకుంటే తప్ప అమెరికాకు రోజు గడవదు. అందులో భాగంగానే దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నది. ఇటీవల రెండుసార్లు తమ విమానాల రాడార్లపై చైనా ఆయుధాలను గురిపెట్టిందని జపాన్ ఆరోపించింది. మిలిటరీ పరిభాషలో లాక్ ఆన్ అంటే ఒక దేశానికి చెందిన మిలిటరీ విమానాలు మరోదేశానికి చెందిన విమానాలపై రాడార్ల ద్వారా నిఘావేసి సంకేతాలు పంపటమే. ఇదికొన్ని సందర్భాల్లో కూల్చివేతలకు కూడా దారితీయవచ్చు. నిఘా అవసరాలకూ వినియోగించవచ్చు. దేనికి అలా చేశారన్నది ఆయా దేశాలు చెప్పే భాష్యాలు వివాదమవుతున్నాయి. దొంగే దొంగ అని అరచినట్లుగా జపాన్ నిఘా విమానాలను తమపై కేంద్రీకరించి తామేదో చేసినట్లు గుండెలు బాదుకుంటూ ప్రపంచాన్ని నమ్మింప చూస్తున్నదని చైనా విమర్శించింది. అయితే ఎటువైపు నుంచి ఎలాంటి అవాంఛనీయ ఉదంతాలు చోటు చేసుకోలేదు గానీ గత దశాబ్దికాలంలో ఎన్నడూలేని విధంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. లాక్ ఆన్ ప్రచారం జపాన్ ప్రారంభించిన ఆయుధీకరణకు ఒక ముసుగు మాత్రమే. రెండవ ప్రపంచ యుద్ధంలో కేవలం ఆత్మరక్షణకు అవసరమైన మిలిటరీ మాత్రమే జపాన్‌కు ఉండాలని ఒప్పందం కుదిరింది. అయితే 2015 ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చి తమకే గాక మిత్రదేశాలకు ఆపద వచ్చినపుడు కూడా జోక్యం చేసుకోవచ్చని కొత్త నిబంధన చేర్చారు.నిజానికి తైవాన్ ఒక దేశం అని ఐరాస గుర్తించలేదు, అక్టోబరులో బాధ్యతలు స్వీకరించిన ప్రధాని సానాయి టకాయిచి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆమె ఇటీవల మాట్లాడుతూ బలవంతంగా తైవాన్ ప్రాంతాన్ని చైనా స్వాధీనం చేసుకుంటే తమ దేశభద్రతకు ముప్పు వచ్చినట్లే అని దాన్ని తాము అంగీకరించేది లేదని ప్రకటించారు.
చైనాలో అంతర్భాగమైన తైవాన్ ప్రస్తుతం ఒక తిరుగుబాటు రాష్ట్రంగా ఉంది.శాంతియుత పద్ధతుల్లో తిరిగి ప్రధాన భూభాగంతో అనుసంధానం చేసేందుకు చూస్తామని,అవసరమైతే మిలిటరీచర్యతో అయినా ఆ పని చేస్తామని చైనా పదే పదే ప్రకటించింది. హాంకాంగ్, మకావో దీవుల విలీనం మాదిరి ఒక దేశం రెండు వ్యవస్థల విధానం కింది తైవాన్‌లో ఉన్న వ్యవస్థను 2049 వరకు ఎలాంటి మార్పులు చేయబోమని కూడా స్పష్టం చేసింది, అంటే అప్పటి వరకు స్వయం పాలనకు అవకాశమివ్వటమేగాక అక్కడ ఉన్న పెట్టుబడులకు రక్షణ కల్పించటమే. అయితే ఒక వైపు తైవాన్ ప్రాంతం చైనా అంతర్భాగమే అని అంగీకరిస్తూనే అమెరికా, జపాన్ ఇతర పశ్చిమ దేశాలు బలవంతంగా స్వాధీనం చేసుకోవటాన్ని తాము అంగీకరించేది లేదని వితండ వాదనకు దిగుతున్నాయి. స్వాతంత్య్రం ప్రకటించుకున్న తైవాన్‌లోని వేర్పాటువాద శక్తులకు అన్ని రకాలుగా మద్దతిస్తున్నాయి. ఒక దేశం మాదిరి అక్కడ మిలిటరీని ఏర్పాటు చేసేందుకు, వాటికి యుద్ధ విమానాలతో సహా అన్ని రకాల ఆయుధాలను అందచేస్తున్నాయి. అమెరికా కవ్వింపులను గమనించిన చైనా ఆచితూచి వ్యవహరిస్తున్నది, ఎప్పటికప్పుడు తన అధికారాన్ని అది పునరుద్ఘాటిస్తున్నది. తెగేదాకా లాగితే ఏం జరుగుతుందో చూడండి అంటూ తరచూ తైవాన్ చుట్టూ మిలిటరీ విన్యాసాలను కూడా నిర్వహిస్తున్నది. వాటిని చూపి ఇంకేముంది చైనా బలప్రయోగానికి పూనుకుందంటూ అమెరికా కూటమి దేశాలు నానా యాగీ చేస్తున్నాయి.
క్లుప్తంగా తైవాన్ సమస్య గురించి చూద్దాం.చైనా స్వాతంత్య్రం కోసం కొమింటాంగ్ పార్టీ ఏర్పడింది.సన్ యెట్ సేన్ నాయకత్వంలో 1912లో చైనా స్వాతంత్రం ప్రకటించుకొని రిపబ్లిక్‌గా అవతరించింది. తర్వాత జరిగిన కొన్ని పరిణా మాలలో అధికారానికి దూరమైన సన్ మరోసారి అధికారానికి వచ్చి కమ్యూనిస్టులతో కలసి తొలి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన మరణం తర్వాత 1925లో అధికారానికి వచ్చిన ఛాంగ్‌కై షేక్ కొమింటాంగ్ పార్టీలో కమ్యూ నిస్టులతో సయోధ్యను కోరుకొనే వారిని పక్కన పెట్టి కమ్యూనిస్టు వ్యతిరేకిగా మారాడు. మావో నాయకత్వాన కమ్యూనిస్టులు 1949లో అధికారానికి వచ్చిన సమయంలో భారీ సంఖ్యలో మిలిటరీ, ఆయుధాలను తీసుకొని చాంగ్‌కై షేక్ తైవాన్ దీవికి పారిపోయి అక్కడి నుంచి కమ్యూనిస్టులను ప్రతిఘటించాడు. ప్రధాన భూభాగంలో అధికారాన్ని సుస్థిరం చేసుకోవటం ముఖ్యమని భావించిన కమ్యూనిస్టులు దాని మీద కేంద్రీకరించారు. రెండవ ప్రపంచయుద్ధం తర్వాత ఏర్పడిన ఐరాసలో అప్పుడు అధికారంలో ఉన్న చాంగ్‌కై షేక్ నియమించిన ప్రతినిధులనే గుర్తించారు. కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తర్వాత చైనా అంటే తైవాన్‌లో తిష్టవేసిన కొమింటాంగ్ పార్టీయే చైనా ప్రతినిధి అని 1970దశకం వరకు పరిగణించారు. ఎట్టకేలకు కమ్యూనిస్టు చైనాను గుర్తించకతప్పని పరిస్థితి ఏర్పడింది. 1971 అక్టోబరులో జరిగిన 26వ సమావేశంలో 2,758 తీర్మానం ద్వారా కమ్యూనిస్టుల నాయకత్వంలో ప్రధాన భూభాగంలో ఉన్న జనచైనా(పిఆర్‌సి) అసలైన ప్రతినిధి అని గుర్తించారు. నాటి నుంచి తైవాన్‌లో ఉన్న పాలకులు నియమించిన వారికి గుర్తింపు రద్దు చేశారు. చైనాలో తైవాన్ అంతర్భాగమని అందరూ అంగీకరించారు. అయితే అప్పుడు జరిగిన చర్చలో దీర్ఘకాలం విడిగా ఉన్నందున బలవంతపు విలీనం జరగకూడదని పలుదేశాలు చెప్పిన అభిప్రాయాన్ని చైనా నాయకత్వం కూడా అంగీకరించింది. నాటి చర్చను సాకుగా తీసుకొని తర్వాత ఎప్పుడు విలీన యత్నం చేసినా తగిన పరిస్థితి ఏర్పడలేదని పశ్చిమ దేశాలు పాటపాడుతున్నాయి. ఇప్పటికీ అదే సాకు చెబుతూ విలీనాన్ని అడ్డుకుంటున్నాయి. తన పౌరులపై బలప్రయోగం అంటే రక్తపాతమే గనుక చైనా అందుకు పూనుకోవటం లేదు, దాని సహనాన్ని పదే పదే రెచ్చగొడుతున్నారు. దానిలో భాగమే తైవాన్ విలీనం తమ దేశానికి ముప్పు అని జపాన్ చెబుతున్న కుంటిసాకు. ప్రస్తుతం తైవాన్ వేరుగా ఉన్నందున చైనాకు వచ్చిన ముప్పేమీ లేదు గనుక ఉపేక్షిస్తున్నది. అది చెబుతున్న 2049 గడువులోగా దారికి వస్తే సరే, రాకుంటే అప్పుడేం జరుగుతుందో ఇప్పుడు ఊహించి చెప్పలేము. ఒక్కటి మాత్రం స్పష్టం. తైవాన్ వ్యవహారాల్లో మరోదేశం జోక్యం చేసుకోవటం, భిన్నంగా మాట్లాడటం అంటే తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం, తమ సార్వభౌమత్వం, రాజ్యాంగం, అంతర్జాతీయ న్యాయసూత్రాలను ఉల్లంఘించటమే అని చైనా చెబుతున్నది. ఇదే అంశాన్ని సోమవారం నాడు జర్మనీ విదేశాంగ మంత్రితో మాట్లాడిన చైనా విదేశాంగ మంత్రి, కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూర్ సభ్యుడు వాంగ్ ఇ స్పష్టం చేశారు. తైవాన్ గురించి అనేక అంశాలను వివరించాడు. ఈ ప్రాంతాన్ని జపాన్ అర్ధశతాబ్దం పాటు ఆక్రమించుకొని వలసగా చేసుకున్నదని, తమ పౌరుల మీద లెక్కలేనని అత్యాచారాలు చేసిందని కూడా చెప్పాడు.
చైనా బూచిని చూపుతూ జపనీయులను రెచ్చగొడుతున్న అక్కడి పాలకులు మిలటరీ బడ్జెట్‌ను పెంచేందుకు సాకులు వెతుకుతున్నారు.ఇదంతా అమెరికా ఆడిస్తున్న క్రీడ తప్ప మరొకటి కాదు. తాను నేరుగా దిగితే చైనాతో సమస్య లొస్తాయని తెలుసు గనుక ట్రంప్ యంత్రాంగం జపాన్‌నుఎగదోస్తున్నది. తైవాన్ దీవికి నూటపది కిలోమీటర్ల దూరంలో ఉన్న తన చివరి దీవుల సముదాయం,( ఇది చైనాకూ అంతే దూరం) జనాభా పెద్దగా లేని యంగునీ దీవుల సముదాయంలో దీర్ఘశ్రేణి క్షిపణులను మోహరించేందుకు పూనుకుంది. అక్కడ రాడార్ కేంద్రాలు, మందుగుండు గిడ్డంగులు, అమెరికా అందచేసిన ఎఫ్-35 విమానాల మోహరింపు, ఇతర మిలిటరీ నిర్మాణాలకు పూనుకుంది. ఇప్పటికే సిబ్బంది నివాసాలకు కొన్ని భవనాల నిర్మాణం పూర్తి చేసింది. కొద్ది రోజుల క్రితం ఆ దీవుల్లో ఉన్న పౌరులు కొంత మందితో సమావేశం జరిపి చైనాపై నిఘా, దాని ఎలక్ట్రానిక్ పరికరాలనుంచి వెలువడే అయస్కాంత తరంగాలను స్తంభింప చేసేందుకు మిలిటరీ నిర్మాణాలు అవసరమని తేల్చి చెప్పింది. ఇది చైనాను కవ్వించటం తప్ప మరొకటి కాదు. ఒక వేళ రెండు దేశాల మధ్య యుద్ధమంటూ వస్తే అది జపాన్ వైపు నుంచే మొదలు కావాలి తప్ప చైనా నుంచి జరగదు. ఒక వేళ జరిగితే అమెరికా తమను ఆదుకొనే పరిస్థితి లేదని గతంలో ప్రభుత్వ విశ్లేషకురాలిగా ఉండి, ప్రస్తుతం నిగాటా విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న ఒక మహిళా ప్రొఫెసర్ చెప్పారు. ప్రభుత్వ మిలిటరీ, క్షిపణుల మోహరింపు గురించి అక్కడి కమ్యూనిస్టు పార్టీ పార్లమెంటరీచర్చలో వ్యతిరేకతను వెల్లడించింది. ఇతర దేశాల మాదిరే జపాన్ కూడా చేస్తున్నదని రక్షణ మంత్రి సమర్ధించాడు.
గత వారంలో విమర్శలకు దారితీసిన ఉదంతం జపాన్‌లో అమెరికా మిలిటరీ కేంద్రం ఉన్న ఒకినావా దీవి సమీపంలో జరిగింది. చైనా తమ విమానాలను లక్ష్యంగా చేసుకున్నదని తప్ప గగనతలాన్ని అతిక్రమించినట్లు జపాన్ ఇంతవరకు చెప్పలేదు.ముందుగా అంతర్జాతీయ జలాల్లో ఉన్న తమ విమానవాహక యుద్ధ నౌక సమీపానికి ప్రమాదకరంగా జపాన్ యుద్ధ విమానాలే వచ్చాయని, తమవైపు నుంచి అనివార్యమైన ప్రతిస్పందన ఉందని బీజింగ్ చెబుతున్నది.చైనా విమానవాహక యుద్ద నౌక లియావోనింగ్ వైపు జపాన్ యుద్ధ విమానాలు సమీపంలోకి వచ్చినపుడు చైనా విమానాలు అడ్డుకొని హద్దు మీరితే అంతే సంగతులని హెచ్చరించినట్లు, అవి పూర్తిగా సమర్దనీయమే అని చైనా నిపుణులు చెబుతున్నారు. జపాన్ సమీపంలో చైనా విమానవాహక నౌక కార్యకలాపాలు నిర్వహించటం ఇదే మొదటిసారి అని జపాన్ వార్తా సంస్థ కొయోడో పేర్కొన్నది. తూర్పు ఆసియా సముద్రంలో చైనా నౌకాదళానికి చెందిన వివిధ రకాల వంద నౌకలు పాల్గొన్నట్లు రాయిటర్స్ వార్త ఆరోపించింది. తమ నౌకలు పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో ఇలాంటి విన్యాసాలు జరపటం సాధారణమని అయితే ప్రతిసారీ జపాన్ తమకు చైనా నుంచి ముప్పు ఉందని చెప్పేందుకు, తన మిలిటరీ శక్తిని పెంచుకొనేందుకు వాటిని బూతద్దంలో చూపుతున్నదని, అంతర్జాతీయ సూత్రాలకు అనుగుణంగానే తాము జరుపుతున్నట్లు, జపాన్ ఆత్మరక్షణ రాజ్యాంగం నుంచి పక్కకు జరుగుతున్నదని చైనా నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.వాటి మీద అతిగా స్పందించటం, విపరీత భాష్యాలు ఎవరూ చెప్పకూడదని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి లిన్‌జియాన్ చెప్పాడు.అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా జరుపుతున్న తమ విన్యాసాల గురించి గుండెలు బాదుకుంటున్న జపాన్ అదే పని అమెరికా చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నదని చైనా ప్రశ్నిస్తోంది.
తైవాన్ సమస్యపై రెచ్చగొడుతున్న జపాన్ తీరును చూస్తే అమెరికా పన్నిన వ్యూహంగా కనిపిస్తోంది. ఈ వివాదం చెలరేగిన సమయంలోనే తైవాన్ సమస్యపై తక్షణమే చైనాతో యుద్ధం రాకుండా చూసుకోవాలని ఒక పథకం రూపొం దించినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. ముందుగా అమెరికా, దాని మిత్రదేశాలు మిలిటరీ బలాన్నిపెంచుకోవాలని, చైనా వైపునుంచి తైవాన్, జపాన్ మీద వత్తిడి పెరుగుతున్నదని డిసెంబరు ఐదున ప్రచురించిన ఒక పత్రంలో అమెరికా జాతీయ వ్యూహకర్తలు పేర్కొన్నారు.2017లో ప్రచురించిన పత్రంలో ఒక వాక్యంలో మూడుసార్లు తైవాన్ ప్రస్తావన చేయగా తాజా పత్రంలో మూడు పేరాల్లో ఎనిమిదిసార్లు ఉన్నట్లు రాయిటర్స్ తెలిపింది. వాణిజ్య యుద్ధాలు జరుగుతున్న, సెమికండక్టర్ల ఉత్పత్తిలో ఆధిపత్యం వహిస్తున్న ప్రాంతంలో తైవాన్ గురించి సరిగానే కేంద్రీకరించినట్లు, జపాన్ నుంచి ఆగేయాసియా వరకు ఏ దీవి మీద కూడా ఎక్కడా దురాక్రమణ జరగకుండా అమెరికా మిలిటరీ సామర్ధ్యాన్ని పెంచుకోవాలని ఆ పత్రం పేర్కొన్నది. ఇదే సమయంలో అమెరికా ఒక్కటే చేయలేదని, చేయకూడదని, మిత్రదేశాలు మిలిటరీ ఖర్చు పెంచుకోవాలని, ఉమ్మడిగా రక్షణకు పని చేయాలని హితవు పలికింది.ఈ బలం తైవాన్ ఆక్రమణ యత్నాలు మానుకొనే స్థాయికి పెరగాలని కోరింది. ఈ వ్యూహం, ఎత్తుగడల్లో భాగంగానే ఆత్మరక్షణ యుద్ధం నుంచి ఎదురుదాడులు చేసే విధంగా ఆయుధాలను పెంచుకోవాలని జపాన్ చూస్తున్నది, దానికి సాకుగా చైనా బూచిని చూపుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది!
ఎం కోటేశ్వరరావు
8331013288



