గంటకు 15 వేల మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది
నాలుగు వేల మైళ్ల దూరంలోని లక్ష్యాన్నీ చేధిస్తుంది
30 సంవత్సరాల తర్వాత తొలిసారి ప్రయోగం
రష్యా, చైనాల కట్టడికేనంటున్న నిపుణులు
వాషింగ్టన్ : అణు పరీక్షలపై ఇటీవల చేసిన వ్యాఖ్యలతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చర్చకు తెర తీశారు. అణ్వాయుధాలను చురుకుగా పరీక్షిస్తున్న దేశాలలో పాకిస్తాన్ కూడా ఉన్నదని ఆయన చెప్పారు. అందుకే తాము కూడా తిరిగి అణు పరీక్షలను ప్రారంభించాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన తెలిపారు. రష్యా, చైనా, ఉత్తర కొరియా, పాకిస్తాన్ దేశాలు అణు పరీక్షలు జరుపుతున్నాయని, అమెరికా మాత్రమే ఆ పని చేయడం లేదని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా అమెరికా ప్రభుత్వం బుధవారం ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం) మినిట్‌మ్యాన్-3ని ప్రయోగాత్మకంగా పరీక్షించింది. ఈ క్షిపణి మానవ రహితమైనది. అయితే దీనికి అణ్వాయుధ సామర్ధ్యం ఉంది. దీనిని కాలిఫోర్నియాలోని వెండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ఎయిర్ ఫోర్స్ గ్లోబల్ స్ట్రైక్ కమాండ్ ప్రయోగించిందని న్యూయార్క్ పోస్ట్ పత్రిక తెలిపింది.
అణు దాడి జరిగినప్పుడే…
మార్షల్ దీవులలో సైనిక దళానికి చెందిన రోనాల్డ్ రీగన్ బాలిస్టిక్ క్షిపణి రక్షణ పరీక్షా కేంద్రానికి సమీపంలో ఈ మానవ రహిత క్షిపణి కిందపడింది. వాస్తవానికి ఈ పరీక్ష నెల రోజుల క్రితమే జరగాల్సి ఉంది. అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభించాలని ట్రంప్ ఆదేశించిన తర్వాత ఈ పరీక్ష జరగడం గమనార్హం. గత 30 సంవత్సరాల కాలంలో అమెరికా ఇలాంటి పరీక్షలు జరపలేదు. మినిట్‌మ్యాన్-3 క్షిపణి అమెరికా అణు నిరోధక దళంలో ఓ భాగం. శత్రు దేశం అణు దాడి జరిపినప్పుడే దీనిని ప్రయోగిస్తారు. ఈ క్షిపణి మాత్రమే కాదు…అమెరికా వద్ద అణ్వాయుధాలను మోసుకుపోయే జలాంతర్గాములు, వ్యూహాత్మక బాంబర్లు కూడా ఉన్నాయి. అమెరికా వద్ద ఉన్న ఎల్‌జీఎం-30జీ మినిట్‌మ్యాన్ ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం) కూడా వ్యూహాత్మక అణు నిరోధక దళంలో భాగంగా ఉంటోంది. వైమానిక దళానికి చెందిన గ్లోబల్ స్టైక్ కమాండ్‌లో దీనిని చేర్చారు.
ప్రత్యేకతలు ఇవే
ఖండాంతర మినిట్‌మ్యాన్-3 బాలిస్టిక్ క్షిపణి చాలా శక్తివంతమైనది. దీని వేగం గంటకు పదిహేను వేల మైళ్లు. పసిఫిక్ మహా సముద్రంలో 4,200 మైళ్ల దూరంలోని లక్ష్యాన్ని కూడా సులభంగా చేరుకోగలదు. దూరాన ఉన్న లక్ష్యాలను ఛేదించే సామర్ధ్యం దీని సొంతం. ప్రతి క్షిపణిలోనూ స్వతంత్రంగా లక్ష్యాలను ఛేదించి తిరిగి బేస్‌కు చేరుకోగలిగిన వాహనాలను మోహరించారు. ప్రతి వాహనం వేర్వేరు లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదిస్తుంది. ఈ క్షిపణిని ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తూ దాని సామర్ధ్యాన్ని పెంచుతున్నారు. అయినప్పటికీ మినిట్‌మ్యాన్-3ని క్రమేపీ పక్కన పెట్టి మరింత అత్యాధునిక ఎల్‌జీఎం-35ఏ సెంటినల్‌ను పూర్తి స్థాయిలో రంగంలోకి దింపాలని అమెరికా ఆలోచిస్తోంది.
అమెరికా వ్యూహాత్మక రక్షణ సామర్ధ్యానికి మినిట్‌మ్యాన్-3 పునాదిరాయిగా కొనసాగుతోంది. ఇది ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి ఆయుధం. అయినప్పటికీ 21వ శతాబ్దపు రక్షణ వ్యూహంలో ముఖ్య భూమిక పోషిస్తోంది. 1970వ దశకంలో రంగంలోకి దిగిన ఈ క్షిపణి అమెరికా భూ ఆధారిత అణ్వాయుధాలలో కీలక భాగంగా కొనసాగుతోంది. అణ్వాయుధ దేశాలైన రష్యా, చైనాలను కట్టడి చేసేందుకే అమెరికా ఈ క్షిపణి పరీక్ష జరిపిందని అణు నిపుణులు అభిప్రాయపడ్డారు.



