Monday, August 4, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికా వర్సెస్‌ రష్యా

అమెరికా వర్సెస్‌ రష్యా

- Advertisement -

– జలాంతర్గాముల్లో ఎవరిది పైచేయి?
– అణు జలాంతర్గాముల మోహరింపుపై అమెరికా, రష్యాల మధ్య మాటల యుద్ధం
మాస్కో:
రష్యా-అమెరికా మధ్య మాటల యుద్ధం ఊహించని పరిస్థితులకు ఆజ్యం పోసేలా ఉంది. రష్యా సమీపంలో అణు జలాంతర్గాముల్ని మోహరించాలన్న ట్రంప్‌ హెచ్చరికలకు రష్యా పార్లమెంటు సభ్యుడు విక్టర్‌ వోడోలాట్‌స్కీ తీవ్రంగా స్పందించారు. రష్యా వద్ద కూడా తగినన్నీ అణు జలాంతర్గాములు ఉన్నాయని ధీటుగా బదులిచ్చారు. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య అణు జలాంతర్గాముల బలాబలాలు తెలుసుకుందాం.

అణు జలాంతర్గాముల మోహరింపు
రష్యా మాజీ అధ్యక్షుడు డిమిత్రి మెద్వెదేవ్‌ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా రష్యా సమీపంలో 2 అణు జలాంతర్గాములను మోహరించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశించారు. అమెరికా హెచ్చరికలకు క్రెమ్లిన్‌ ఇప్పటివరకూ అధికారికంగా స్పందించలేదు. కానీ అమెరికాను ఎదుర్కొనేందుకు తమ వద్ద కూడా తగినన్నీ అణు జలాంతర్గాములు ఉన్నాయని రష్యా పార్లమెంటు సభ్యుడు విక్టర్‌ వోడోలాట్‌స్కీ వ్యాఖ్యానించారు. ఇంకా చెప్పాలంటే మహాసముద్రాల్లో అమెరికా జలాంతర్గాముల సంఖ్య కంటే రష్యా సంఖ్య చాలా ఎక్కువని తెలిపారు. అమెరికా మోహరించిన జలాంతర్గాములు తమ జలాంతర్గాముల నియంత్రణలో ఉన్నాయన్నారు. ట్రంప్‌ ప్రకటనలకు పెద్దగా ప్రతిస్పందించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ట్రంప్‌ హెచ్చరికలను ప్రస్తుతానికి తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదని గ్లోబల్‌ అఫైర్స్‌ మ్యాగజైన్‌ రష్యా ఎడిటర్‌ ఇన్‌చీఫ్‌ ఫ్యోడర్‌ లుక్యానోవ్‌ అన్నారు. అంతకుముందు రష్యా, అమెరికా మధ్య ప్రత్యక్ష సైనిక ఘర్షణలు జరగకూడదని యూఎస్‌ విదేశాంగ మంత్రి మార్కో రూబియో వాదనతో తాను ఏకీభవిస్తానని రష్యా విదేశాంగ మంత్రి సెర్గా లావ్‌రోవ్‌ పేర్కొన్నారు.

అమెరికా సబ్‌మెరైన్స్‌
రష్యా, అమెరికాకు చాలా శక్తిమంతమైన అణు జలాంతర్గాములు ఉన్నాయి. అందులో బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించే సబ్‌మెరైన్లు, ఫాస్ట్‌ ఆటాక్‌ సబ్‌మెరైన్లు ప్రధానమైనవి. అమెరికాకు చెందిన ఓహియో క్లాస్‌ అనే బాలిస్టిక్‌ క్షిపణి జలాంతర్గామి శత్రువులకు చిక్కకుండా రహస్యంగా యుద్ధంలో తన లక్ష్యాలను ఛేదిస్తుంది. ఈ జలాంతర్గాములు ప్రస్తుతం అమెరికా వద్ద 14 వరకూ ఉన్నాయి. ప్రధానంగా గస్తీ కోసం రూపొందించిన ఈ సబ్‌మెరైన్లు 15ఏండ్లపాటు పెద్దగా మరమ్మతులు లేకుండానే పనిచేస్తాయి. వీటికి 20 బాలిస్టిక్‌ క్షిపణుల వరకూ ప్రయోగించే సామర్థ్యం ఉంది. ప్రధానంగా ఒకేసారి మూడు క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం అమెరికన్‌ బాలిస్టిక్‌ క్షిపణి జలాంతర్గాములకు ఉంది. అటు అమెరికాకు ఉన్న ఫాస్ట్‌ ఆటాక్‌ సబ్‌మెరైన్లు కూడా అణుయుద్ధంలో కీలకమని చెప్పవచ్చు. వీటిలో ప్రధానంగా వర్జీనియా క్లాస్‌, సీవోల్ఫ్‌ క్లాస్‌, లాస్‌ ఏంజెల్స్‌ క్లాస్‌ అనే మూడు న్యూక్లియర్‌ సబ్‌మెరైన్లు ఉన్నాయి. అత్యాధునిక క్షిపణులు కలిగిన ఈ సబ్‌మెరైన్లు, శత్రు నౌకలను నామరూపాల్లేకుండా చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. నిఘావ్యవస్థ, పర్యవేక్షణ కార్యకలాపాలను సైతం సమర్థంగా నిర్వహించగలవు. ప్రత్యేక ఆపరేషన్లలోనూ దళాల కోసం లాక్‌ ఇన్‌, లాక్‌ ఔట్‌ ఛాంబర్లు ఈ అణు జలాంతర్గాముల్లో ఉన్నాయి. క్షిపణులను నిటారుగా ప్రయోగించే వ్యవస్థ సైతం వీటి సొంతం. సుమారు 50 ఆయుధాల నిల్వతో శత్రువులను ఎదుర్కొనే సత్తా అమెరికన్‌ ఫాస్ట్‌ ఆటాక్‌ సబ్‌మెరైన్లకు ఉంది.

రష్యా సబ్‌మెరైన్స్‌..
ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద జలాంతర్గామి నౌక దళాల్లో రష్యా ఒకటి. మాస్కోకు దాదాపు 64 శక్తిమంతమైన జలాంతర్గాములు ఉన్నాయి. వీటిలో రష్యా వ్యూహాత్మక యంత్రాంగం కేంద్రంగా బోరీ క్లాస్‌, డెల్టా ఫోర్‌ క్లాస్‌ సహా 14 బాలిస్టిక్‌ క్షిపణి సబ్‌మెరైన్లు ప్రధానంగా ఉన్నాయి. ఈ సబ్‌మెరైన్లు శత్రు నౌకలను ధ్వంసం చేయడమే కాకుండా ప్రత్యర్థి రాకెట్లు, బాటమ్‌ మైన్స్‌ లక్ష్యంగా దాడులు చేయగలవు. యుద్ధంలో ఇవి రష్యాకు వెన్నుముకగా పనిచేస్తాయి. రష్యాకూ ఫాస్ట్‌ ఆటాక్‌ సబ్‌మెరైన్లు ఉన్నాయి. అందులో యాసిన్‌ క్లాస్‌, అకులా క్లాస్‌ అణు యుద్ధంలో కీలకంగా చెబుతారు. ముఖ్యంగా వీటిని రష్యాకు సైలెంట్‌ క్లిలింగ్‌ ఆయుధాలుగా అభివర్ణిస్తారు. ఈ జలాంతర్గాములు అత్యాధునిక క్షిపణులతో సుదూర లక్ష్యాలను కూడా చేధించగలవు. యుద్ధక్షేత్రంలో రహస్యంగా శత్రు నౌకలను మట్టికరిపించే సామార్థ్యం రష్యన్‌ ఫాస్ట్‌ ఆటాక్‌ సబ్‌మెరైన్ల సొంతం. ఈ విధంగా చూస్తూ రెండూ ఢ అంటే ఢ అనే సత్తా కలిగి ఉన్నవే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -