అమెరికా ప్రజాస్వామ్యం, మానవహక్కుల గురించి భ్రమల్లో ఉన్నవారికి డోనాల్డ్ ట్రంప్ దుర్మార్గ చర్య కనువిప్పు కలిగిందని భావించవచ్చా? వెనెజులా మీద దాడి చేసి నిద్రమంచం మీద ఉన్న అధ్యక్షుడు నికోలస్ మదురో, సతీమణి సిలియా ఫ్లోర్స్‌ను బంధించి అమెరికా తీసుకువెళ్లి తమ చట్టాల ప్రకారం విచారణ జరుపుతామం టున్నారు. ఈ తీరును సమర్దించేవారు, జరిగిన దుర్మార్గాన్ని చూసి కూడా మౌనముద్ర దాల్చిన అపర ప్రజాస్వామికవాదుల తీరు ఆందోళన కలిగిస్తున్నది. కొన్ని సమయాల్లో కొందరు మనుషులు అన్నట్లుగా పరీక్షా సమయంలో అసలు రంగు బయట పడుతుంది. ప్రజాస్వామ్యాన్ని ఏడు నిలువుల లోతున పాతిపెట్టిన ట్రంప్ దుర్మార్గాన్ని ఖండించటానికి ప్రజాస్వామ్య పుట్టినిల్లు అని చెప్పుకున్న వారికి నోటమాట రాకపోవటం చూసిన తర్వాత సామాన్యుల గురించి చెప్పేదేముంది. ఎవరి కైనా తమదాకా వస్తేగాని తత్వం బోధపడదని మన పెద్దలు ఊరికే చెప్పలేదు. మనల్ని కాదు గదా అనుకుంటే మనదాకా వచ్చిన తర్వాత అయ్యో పాపం అనే వారు ఉండరు. భద్రతా మండలి అమెరికా దుశ్చర్యను చర్చిస్తున్నది, అయితే అదేదో చేస్తుందని ఎవరూ భ్రమలు పెట్టుకోనవసరం లేదు. అమెరికా చర్య వెనెజులాతోనే ఆగదు, యావత్ మానవాళికి అది ముప్పుగా మారుతోంది.
ఒక సర్వసత్తాక దేశం మీద దాడిచేసే అధికారం అమెరికాకు ఎవరిచ్చారు? మాదక ద్రవ్యాలను తయారు చేసి అమెరికాకు రవాణా చేస్తున్న ముఠాకు మదురో నాయకుడని గత కొంతకాలంగా తప్పుడు ప్రచారం చేస్తున్నపుడే ఏదో దుర్మార్గానికి అమెరికా పాల్పడుతుందని కొందరు భావించారు.ఆంక్షలు ప్రకటించటంతో క్యూబా మాదిరి దిగ్బంధనానికి పూనుకుంటారేమో అనుకున్నారు గానీ కిడ్నాప్‌నకు పాల్పడతారని మదురో ఊహించి ఉంటే కథవేరుగా ఉండేది. మదురో మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నాడనేది పచ్చి అబద్దం. అసలు అమెరికాకు మాదకద్రవ్యాల సరఫరా కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతోంది. నికరాగువాలో వామపక్ష శాండినిస్టాలను గద్దె దించేందుకు కాంట్రాకు సిఐఏ స్వయంగా మాదకద్రవ్యాలతో వచ్చిన సొమ్మును అందచేసిన చరిత్రదాస్తే దాగేది కాదు. పన్నేండ్ల పైబడిన అమెరికన్లలో 51శాతం మంది ఎప్పుడో ఒకసారి అక్రమంగా దొరికే మాదకద్రవ్యాలను తీసుకున్నవారే అని సర్వేలో తేలింది. వారందరికీ వెనెజులా నుంచి సరఫరా చేస్తున్నారా? ఎన్నడైనా వాటి నిరోధం పేరుతో ఎవరిమీదనైనా అమెరికా దాడి చేసిందా?
ఒక కుక్కను చంపదలచుకొంటే పిచ్చిదని ప్రచారం చేయాలన్న దుర్మార్గ ఎత్తుగడ తెలిసిందే. మన కళ్ల ముందు పాలస్తీనా విముక్తి కోసం పోరాడిన నేత యాసర్ అరాఫత్‌ను అమెరికా ఉగ్రవాదిగా, పిఎల్‌ఓను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రచారం చేసింది. ఇరాక్‌లో బాత్‌పార్టీ నేత, అధ్యక్షుడు సద్దామ్ హుస్సేన్ మారణాయుధాలను గుట్టలుగా పోసి పశ్చిమాసియాకు ముప్పుతెచ్చాడని ప్రచారం చేసింది. చివరికి ఇరాక్‌ను ఆక్రమించి సద్దామ్‌ను ఉరితీసిన దుర్మార్గం తెలిసిందే. తర్వాత అదే అమెరికా అక్కడ ఎలాంటి మారణాయుధాలు లేవనీ ప్రకటించింది. లిబియాలో గడాఫీని చం పించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లను తయారు చేసి తిరుగుబాటు చేయించింది. సోవియట్ ఉపసంహరించుకున్న ఆ దేశాన్ని ఏకంగా ఆక్రమించుకొనేందుకు పూనుకుంటే ఆ తాలిబాన్లే అడ్డం తిరగాల్సి వచ్చింది.
రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు హిట్లర్ ఏదో ఒకసాకుతో ఐరోపా దేశాల ఆక్రమణకు పూనుకున్న దుర్మార్గాన్ని ఇప్పుడు ట్రంప్ తలపింపచేస్తున్నాడు. వెనెజులాలో కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకు తామే పరిపాలన చేస్తామని, చమురు సంపదలను వెలికితీస్తామని బరితెగించి మాట్లాడుతున్నాడు. అంతేకాదు, మెక్సికో, కొలంబియా, క్యూబాల సంగతి కూడా చూస్తామని ప్రకటించాడు. అమెరికా ఎందుకిలా తెగిస్తున్నది ? లాటిన్ అమెరికాను తన పెరటితోటగా, అవసరాలను తీర్చే దేశాలుగా చూస్తున్న తరుణంలో అక్కడి వామపక్ష శక్తుల ఆవిర్భావం, అధికారానికి రావటంతో అమెరికన్ల రంగుల కలచెదిరింది. వెనెజులాలో ఛావెజ్ అధికారానికి రావటమేగాక అప్పటివరకు అక్కడి చమురు సంపదలను కాజేస్తున్న అమెరికా కంపెనీలను జాతీయం చేశాడు, మదురో ఆ విధానాన్ని కొనసాగిస్తున్నాడు.
అంతేకాదు, క్యూబా ఇతర దేశాలకు చమురు సరఫరా చేయటం శ్వేతసౌధంలో ఎవరున్నప్పటికీ మింగుడుపడటం లేదు. వెనెజులా సోషలిస్టులను గద్దె దించేందుకు మితవాద శక్తులకు డాలర్లు ఇచ్చి రంగంలోకి దించినా ఛావెజ్, మదురో వమ్ము చేశారు. ఇక లాభం లేదని బరితెగించి మదురోను కిడ్నాప్ చేయించాడు. ఈ దుర్మార్గాన్ని చైనా, రష్యా, కొలంబియా, బ్రెజిల్ వంటి దేశాలు ఖండించాయి. ప్రపంచ ప్రజాస్వామ్యానికి తల్లివంటిది భారత్ అని చెబుతున్న నరేంద్రమోడీ సర్కార్ ట్రంప్ దుర్మార్గాన్ని ఖండించలేదు. ఇది తటస్తంగా ఉండాల్సిన తరుణమా అంటే కానే కాదు. యావత్ సామ్రాజ్యవాదవాద వ్యతిరేకశక్తులు గళమెత్తాలి, అమెరికా దుర్మార్గాన్ని అడుగడుగునా ఎండగట్టాలి.
అమెరికా అహంకారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



