Friday, January 2, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఓడలపై అమెరికా దాడి

ఓడలపై అమెరికా దాడి

- Advertisement -

ఎనిమిది మంది మృతి
మాదక ద్రవ్యాల రవాణా జరుగుతోందని ఆరోపణ

వాషింగ్టన్‌ : పసిఫిక్‌ సముద్రంలో మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్నాయన్న అనుమానంతో ఓడలపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో ఎనిమిది మంది మరణించారు. సజీవంగా బయటపడ్డ వారి ఆచూకీ కోసం కోస్ట్‌ గార్డ్‌ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో తమ దళాలు మూడు ఓడలపై దాడి చేశాయని అమెరికా సైనిక దక్షిణ కమాండ్‌ తెలిపింది. ‘తొలి దాడిలో ఓ ఓడపై దాడి చేశాం. మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్న ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు. మిగిలివారు రెండు ఓడలను వదిలేసి సముద్రంలో దూకి దూరంగా వెళ్లిపోయారు. మా సైన్యం ఆ ఓడలను సముద్రంలో ముంచేసింది’ అని దక్షిణ కమాండ్‌ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో తెలియజేసింది. ఆ తర్వాత దక్షిణ కమాండ్‌ మరో ప్రకటన విడుదల చేస్తూ రెండు ఓడలపై దాడులు చేశామని తెలిపింది. మొత్తంగా తాము జరిపిన దాడుల్లో ఐదుగురు చనిపోయారని చెప్పింది. ఈ దాడుల నుంచి బతికి బయటపడిన వారి కోసం గాలింపు జరుపుతున్నామని పేర్కొంది.

కాగా రాయిటర్స్‌ వార్తా సంస్థ కథనం ప్రకారం ఎనిమిది మంది సముద్రంలో దూకేశారని తెలుస్తోంది. వారి ఆచూకీ తెలుసుకునేందుకు కోస్ట్‌ గార్డ్‌ సిబ్బంది సీ-130 యుద్ధ విమానాన్ని రంగంలోకి దింపింది. తాను జరుపుతున్న దాడుల నుంచి కొంతమంది తప్పించుకుంటున్నారని ట్రంప్‌ ప్రభుత్వం చెప్పడం ఇది మొదటిసారి కాదు. గత అక్టోబరులో అమెరికా సైన్యం జరిపిన దాడి నుంచి ఇద్దరు తప్పించుకున్నారు. ఆ తర్వాత వారి ఆచూకీని తెలుసుకొని స్వదేశాలకు పంపారు. అదే నెలలో మెక్సికో అధికారులు కూడా విడిగా గాలింపు చర్యలు చేపట్టారు. ఒక వ్యక్తి నీటిలో మునిగి పోయాడని గుర్తించినప్పటికీ అతని ఆచూకీ తెలియరాలేదు.మాదక ద్రవ్యాల రవాణాపై నిఘా వేస్తున్నామన్న పేరుతో అమెరికా ఇటీవలి కాలంలో ఓడలపై ముమ్మరంగా దాడులు చేస్తోది. గత సెప్టెంబర్‌ నుంచి కరేబియన్‌, పసిఫిక్‌ జలాలలో 30 దాడులు జరిగాయి. కనీసం 110 మంది చనిపోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -