నౌకపై మళ్లీ దాడి నలుగురు మృతి
చమురు విషయంలో వెనిజులాపై ఆరోపణలు
వాషింగ్టన్, కారకాస్ : వెనిజులా లక్ష్యంగా అమెరికా మళ్లీ కవ్వింపు చర్యలకు దిగింది. తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో మాదకద్రవ్యాలు రవాణా చేస్తున్నదన్న ఆరోపణలతో ఒక పడవపై అమెరికా సైన్యం ప్రాణాంతక దాడికి దిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్‌సెత్ తెలిపారు. డ్రగ్ సరఫరాపై దాడుల పేరుతో అమెరికా పలుమార్లు ఇలాంటి చర్య లకు పాల్పడుతున్నది. సెప్టెంబర్ నుంచి అమెరికా ప్రారంభించిన ఇలాంటి దాడుల్లో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 99కి చేరుకున్నది.ఈ దాడి నేపథ్యంలో అమెరికా- వెనిజులా మధ్య సంబంధాలు మరింత ఉద్రితక్తంగా మారాయని అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారు. కాగా చమురు విష యంలో వెనిజులాపై అమెరికా ఆరోపణలు చేసింది. ఆ దేశం అమెరికా చమురును అక్రమంగా స్వాధీనం చేసుకుంటు న్నదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. వెని జులాకు వెళ్లే, అక్కడి నుంచి బయలుదేరే ఆంక్షలు విధించిన చమురు ట్యాంకర్లపై ప్రభుత్వం నిర్బంధం విధించినట్టు ఆయన అన్నారు. ఈ చర్య వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోపై ఒత్తిడి పెంచేందుకు చేపట్టినదిగా విశ్లేషకులు చెప్తున్నారు. ఈ చర్యలు మాదకద్రవ్యాల రవాణాను అడ్డుకోవడానికేనని అమెరికా ప్రభుత్వం చెప్తున్నది.
బెదిరింపులకు భయపడం : వెనిజులా
వెనిజులా.. అమెరికా ఆరోపణలను ఖండించింది. ఈ మేరకు ప్రభుత్వ చమురు సంస్థ పీడీవీఎస్‌ఏ ఒక ప్రకటనను విడుదల చేసింది. ”చమురు, ఉప ఉత్పత్తుల ఎగుమతులు ఎలాంటి అంతరా యమూ లేకుండా కొనసాగు తున్నాయి. మా ట్యాంకర్లు పూర్తిస్థాయి భద్రతతో ప్రయాణిస్తున్నాయి” అని వివరిం చింది. అమెరికా బెదిరింపులకు లొంగేది లేదని వెనిజులా స్పష్టం చేసింది. కాగా పరిస్థితి తీవ్రత దృష్ట్యా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో.. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌తో ఫోన్‌లో చర్చలు జరిపారు. అమెరికా చర్యలు ప్రాంతీయ శాంతికి ముప్పుగా మారవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వెనిజులా చమురుకు ప్రధాన మార్కెట్ అయిన చైనా కూడా కార కాస్‌కు మద్దతుగా నిలిచింది. ”ఏకపక్ష దౌర్జన్యాన్ని చైనా వ్యతిరేకిస్తుంది. ప్రతి దేశమూ తన సార్వభౌమాధికారాన్ని రక్షించుకునే హక్కు కలిగి ఉంది” అని చైనా విదేశాంగ మంత్రి పేర్కొన్నారు.



