Saturday, January 10, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఆధిపత్యం కోసమే అమెరికా దురాగతాలు!

ఆధిపత్యం కోసమే అమెరికా దురాగతాలు!

- Advertisement -

లాటిన్‌ అమెరికాలోని వెనెజులా రాజధాని కారకాస్‌పై జనవరి మూడవ తేదీన దాడిచేసిన అమెరికా, నిద్రలో ఉన్న అధ్యక్షుడు మదురో, ఆయన సతీమణి సిసిలీ ఫ్లోర్స్‌ను కిడ్నాప్‌ చేసి తీసుకుపోయిన విషయం తెలిసిందే. నార్కో టెర్రరిస్టుగా అభియోగం మోపి న్యూయార్క్‌ కోర్టులో ప్రవేశపెట్టగా తాను ఎలాంటి నేరం చేయలేదని కోర్టులో మదురో చెప్పాడు. తదుపరి పరిణామాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా తామే వెనెజులాను నడిపిస్తామని ట్రంప్‌ ప్రకటిం చాడు. ఏ న్యాయశాస్త్రంలోనూ ఒక దేశాన్ని నడిపించటం గురించి మనకు కనపడదు. ఉపాధ్యక్షురాలిగా ఉన్న డెల్సీ రోడ్రిగజ్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. తమకు సహకరించకపోతే మదురో కంటే ఎక్కువగా అనుభవించాల్సి వస్తుందని ట్రంప్‌ ఆమెను బెదిరించాడు. ఆర్థిక, రాజకీయ ”సంస్కరణలు” చేపట్టాలని, అందుకు వెనెజులా పూర్తిగా సహకరిస్తుందంటూ విదేశాంగ మంత్రి మార్కో రూబియోను ట్రంప్‌ ఆదేశించాడు. ఒక పెద్ద బృందం అక్కడికి వెళ్లనుందని సలహాదారు స్టీఫెన్‌ మిలర్‌ చెప్పాడు. అమెరికా చర్యను ఐరాస ఖండించినా ఈ దురాగ తాలకు కళ్లెం వేసే పరిస్థితి లేదు. ఇదిలా ఉండగా, మదురో అరెస్టుపై ప్రపంచదేశాల్లో నిరసనలు జ్వాలలు చెలరేగాయి. అమెరికాలోనూ ప్రదర్శనలు సాగాయి.

చరిత్రను చూస్తే ప్రజాస్వామ్యం, మానవహక్కుల గురించి ప్రపంచానికి నిత్యం నీతి సూత్రాలను బోధించే అమెరికా అడుగడుగునా వాటిని ఉల్లంఘించిన ఉదంతాలు కోకొల్లలు. అది సమర్ధించని నియంతలు లేరు, మారణకాండ లేదు. తమదారికి రాని వారిని ఏం చేస్తామో ఇది ప్రారంభం మాత్రమే అని మదురో అపహరణ తర్వాత ట్రంప్‌ చెప్పాడంటే రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో, ప్రపంచానికి ఎలాంటి ముప్పురానుందో ! రెండో ప్రపంచ యుద్ధానికి ముందు జర్మన్‌ హిట్లర్‌, యూదుల మారణకాండకు పాల్పడినా, అనేక దేశాలను ఆక్రమించుకోవటం ప్రారంభించినా ”ప్రజాస్వామిక ముసుగు” వేసుకున్న దేశాలేవీ అడ్డుకోలేదు, వాడికి అమెరికా ఆయుధాలు కూడా అందించింది. సోవియట్‌ కమ్యూనిస్టుల మీదకు వెళ్లినపుడు సోషలిస్టు వ్యవస్థను అంతం చేస్తాడని కమ్యూనిస్టు వ్యతిరేకులందరూ ఆనందించారు. ఉక్కుమనిషి స్టాలిన్‌ నాయకత్వంలో ప్రతిఘటించి చుక్కలు చూపించిన తర్వాత హిట్లర్‌ ఆత్మహత్య చేసుకొని దిక్కులేని చావు చచ్చాడు. ఇప్పుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రూపంలో ఉన్న అమెరికన్‌ ఫాసిస్టు శక్తిని నిలువరించేది ఎవరు?

అంతర్యుద్ధాలకు ఆజ్యం
తదుపరి లక్ష్యం మెక్సికో, కొలంబియా, క్యూబా అని కూడా ట్రంప్‌ చెప్పాడు. అది అక్కడితోనే ఆగదు. రెండవ ప్రపంచ యుద్ధంతో భౌతిక వలసలు సాధ్యం కాదని గ్రహించిన సామ్రాజ్యవాదులు ప్రపంచీకరణ పేరుతో మార్కెట్‌లను స్వాధీనం చేసుకొనేందుకు చూశారు. అది కూడా సాధ్యం కాదని ఎనభైయేండ్ల అనుభవం తేల్చింది. అందుకు గాను అంతకు ముందునాటి ఆక్రమణలు మినహా మరో మార్గం లేదని, గతంలో తమ పెరటితోటగా పరిగణించిన లాటిన్‌ అమెరికాతోనే ప్రారంభం అని వెనెజులా ఉదంతం స్పష్టం చేసింది. అంతకు ముందు డెన్మార్క్‌ స్వయంపాలిత గ్రీన్‌ లాండ్‌ తమకు కావాలని చెప్పిన సంగతి తెలిసిందే. ఏది కావాలంటే దాన్ని స్వాధీనం చేసుకొనే ట్రంప్‌ తరహా సామ్రాజ్య వాదంగా చరిత్రలో నమోదైంది. ప్రస్తుతం ప్రపంచంలో అస్థిరపరిస్థితి రోజురోజుకూ పెరుగుతు న్నట్లుగా ఉంది. ఉక్రెయిన్‌, పాలస్తీనా లోని గాజా, పశ్చిమగట్టు, కాంగో, సూడాన్‌లో దాడులు, అంతర్యుద్ధాలు, రష్యా, ఇరాన్‌, వెనెజు లాలపై ఆంక్షలు, ఐరాస ప్రసంగాల వేదికగా మారి చేష్టలుడిగి చూస్తున్నదిగా మారటం, సోవియట్‌తో ప్రచ్చన్న యుద్ధం ముగిసిన తర్వాత అమెరికా అనేక దేశాల మీద దాడులకు పూనుకోవటం, సిరియా, లిబియాల్లో జోక్యం, గాజాలో ఇజ్రాయిల్‌ మారణకాండకు మద్దతు, ఇరాన్‌పై దాడి, ఇరాక్‌, ఆఫ్ఘ్‌నిస్తాన్‌లో పరాభవం. మొత్తమ్మీద ప్రపంచంలో విలువైన వనరులను చేజిక్కించు కొనేందుకు అడ్డగోలు చర్యలకు పాల్పడుతున్న అమెరికా తీరు ఇటీవలి కాలంలో మరింతగా ప్రపంచానికి తేటతెల్లమైంది.
వెనెజులాలో జరిగిన దుర్మార్గానికి అమెరికా, ఐరోపా, ఇతర అమెరికా అనుకూల దేశాల్లోని మీడియా ”ప్రజాస్వామ్యం, చట్టబద్దమైన పాలన నెలకొల్పే చర్య”గా వర్ణించి జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నాయి. అమెరికా చెప్పిన కట్టుకథలనే వల్లిస్తున్నాయి.ఒక పథకం ప్రకారం వెనెజులాలో తన తొత్తు మరియా కొరీనా మచాడోకు నోబెల్‌ బహుమతి ఇప్పించిన అమెరికా ఇప్పుడు ఆమెతో చిలుకపలుకులు పలికిస్తున్నది. వాటిని పట్టుకుని పశ్చిమదేశాల మీడియా వేదవాక్కులుగా చెబుతున్నది. వెనెజులా మాదక ద్రవ్యాల కేంద్రంగా ఉన్నట్లు చివరికి అమెరికా సంస్థలు కూడా చెప్పలేదు.డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ అడ్మినిస్ట్రేషన్‌ (డిఇఏ) తాజా నివేదికలో ఒక పేరాలో మాత్రమే పేర్కొన్నది. ఐరాస వందపేజీల నివేదికలో ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. ఐరోపా సమాఖ్య నివేదికలో కూడా అంతే. అయినా సరే పశ్చిమ దేశాల మీడియాకు అవేవీ పట్టలేదు. మదురో నియంత అంటూ రోతపాటలను పాడుతున్నాయి.

కొరకరానికి కొయ్యగా వెనెజులా
మెక్సికో వంటి అనేక దేశాల్లో మాదకద్రవ్యాల ముఠాలు ఎలా చెలరేగుతున్నాయో అందరికీ తెలుసు, ‘మెక్సికోలో నిజమైన పాలకులు అవే’ అని స్వయంగా ట్రంప్‌ తాజాగా చెప్పాడు. పక్కనే సరిహద్దు నుంచి పెంటానిల్‌ అనే డ్రగ్‌ సరఫరా అవుతున్నదని కూడా గతంలో చెప్పాడు.మరి దానిమీద ఎందుకు దాడి చేయలేదన్న ప్రశ్నకు సమాధానం ఉండదు. అసలు కారణమేమిటంటే గత పాతికేండ్లుగా వెనెజులా కొరకరాని కొయ్యగా తయారైంది.క్యూబా చమురు అవసరాలు తీరుస్తున్నది, పెద్ద మొత్తంలో చైనాకు సరఫరా చేస్తున్నది, ఒక్క వీటికే కాదు, ఎవరు వస్తే వారికి విక్రయిస్తున్నది. మనదేశం 2024లో 140 కోట్ల డాలర్ల మేర చమురు దిగుమతి చేసుకుంది. ట్రంప్‌ బెదిరించటంతో 2025లో 81 శాతం తగ్గించింది. తెగించినవాడికి తెడ్డె లింగం అన్నట్లుగా ట్రంప్‌ ఎలాంటి శషభిషలు లేకుండా తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. కట్టుకథలు చెప్పినా నమ్మేస్థితిలో ప్రపంచం లేదు, శాసించేదిగా అమెరికా లేదు. ఇప్పటికీ బలమైన శక్తిగా ఉన్నప్పటికీ అదుపు చేసే శక్తి దానికి లేదు. ఇంకా ఆలస్యం చేస్తే ఉన్న పట్టు కూడా జారిపోయేట్లు ఉన్నదని భావించి అమెరికా తెగింపునకు దిగింది. భద్రతా మండలిలో ఒక శాశ్వత రాజ్యంగా ఉండి మరో సర్వసత్తాక దేశ అధ్యక్షుడిని కిడ్నాప్‌ చేసిందంటే ఐరాస ఉండీ లేనట్లే. తాను భాగస్వామిగా ఉండి నెలకొల్పిన అనేక సంస్థలు అనివార్యమై తనకే అడ్డు పడుతుండటంతో క్రమంగా అమెరికా నాశనం చేస్తున్నది. వెనెజులాను ఆక్రమించటం దాని బలహీనతకు చిహ్నం. రష్యాను శాసించలేదని ఉక్రెయిన్‌ సంక్షోభం వెల్లడించింది. చైనా మిలిటరీ రీత్యా కూడా బలపడుతున్నది.ఈ రెండూ కలిసి వాషింగ్టన్‌ను సవాలు చేస్తున్నాయి.

మౌనం దాల్చిన ‘విశ్వగురు’
అమెరికా ఎత్తుగడల గురించి రకరకాల అభిప్రాయాలు వెలువడుతున్నాయి. మదురోను పట్టుకోవటం కాదని, అసలు లక్ష్యం చైనా అన్నది వాటిలో ఒకటి. చైనాను దెబ్బతీసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, చిప్స్‌ అందకుండా ఇప్పటికే ఒక వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ప్రపంచంలో చమురు దిగుమతి చేసుకొనే దేశాల్లో చైనా అగ్రస్థానంలో ఉంది. వెనెజులా ఒక ప్రధాన సరఫరాదారు, అక్కడ చైనా పెట్టుబడులు కూడా ఉన్నాయి. అక్కడి చమురును స్వాధీనం చేసుకుంటే చైనాకు సరఫరా నిలిపివేయవచ్చు.మరో ప్రధాన సరఫరాదారు ఇరాన్‌ మీద కూడా మిలిటరీ చర్య ద్వారా దాన్ని ఆక్రమించుకొనేందుకు అమెరికా చూస్తున్నది. ఇదే సమయంలో మరో ప్రధాన వనరుగా ఉన్న రష్యాను కూడా చైనా నుంచి దూరం చేయాలనే ఎత్తుగడ ఉంది. దానిలో భాగంగానే ఉక్రెయిన్‌లో కోరిన ప్రాంతాలను అప్పగించేందుకు కూడా సిద్ధపడుతున్నట్లు ట్రంప్‌ తీరుతెన్నులు ఉన్నాయి.అయితే అది జరగాలంటే అనేక చిక్కుముడులు ఉన్నాయి. అమెరికా చెలగాటం తమకు ప్రాణగండంగా ఐరోపా భావిస్తే ప్రపంచ రాజకీయాలే మరోమలుపు తిరుగుతాయి. మొత్తమ్మీద చెప్పాలంటే చైనాకు చమురు దొరకకుండా చేయాలనే ఎత్తుగడలో అమెరికా ఉంది. ప్రపంచ ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి వంటిది భారత్‌ అని చెబుతున్న మన ‘విశ్వగురు’ నరేంద్రమోడీ మధురో అరెస్టును ఖండించకుండా మౌనముద్ర దాల్చారు. తాను భారత్‌ పట్ల సంతోషంగా లేనని ఇటీవల ట్రంప్‌ ప్రకటించాడు. అతగాడిని ”సంతుష్టీకరిం చేందుకే” మౌన దౌత్యమా! మొత్తానికి ప్రధానిని అమెరికా ఇరకాటంలో పెట్టింది. చమురుకోసమే అన్నది అందరికీ అర్థమైన అంశం.ఇప్పటికే ఆపరేషన్‌ సింధూర్‌ను తానే ఆపివేయించానని పదేపదే చెప్పిన ట్రంప్‌ వాణిజ్య ఒప్పందం గురించి ఇంకా పట్టుబడుతూనే ఉన్నాడు. ఒక వైపు పాకిస్తాన్‌ మరో వైపు నుంచి బంగ్లాదేశ్‌ను మన మీదకు ఉసిగొల్పుతున్నాడు.

అమెరికా దురాగతాలు
అమెరికా ఒక దేశాధ్యక్షుడిని పదవినుంచి కూల్చివేయటం నికోలస్‌ మదురోతోనే ప్రారంభం కాలేదు. పనామాలో స్వయంగా మిలిటరీ నియంత మాన్యుయల్‌ నోరిగాను గద్దెనెక్కించింది అమెరికా. సంబంధాలు చెడిన తర్వాత మాదకద్రవ్యాల నిరోధం పేరుతో అదే ఆ మూడు వందల విమానాలు, 27వేల మంది సైనికులతో పనామా మీద దాడి చేసి అతగాడిని పట్టుకుని అమెరికాలో విచారించి నలభైయేండ్ల జైలు శిక్ష వేసింది. మానవాళికి ముప్పు తెచ్చే ఆయుధాలను గుట్టలుగా నిల్వచేశాడంటూ ఇరాక్‌ మీద దాడిచేసి అధ్యక్షుడు సద్దామ్‌ హుస్సేన్‌ను పట్టుకొని తర్వాత ఉరితీసి చంపింది.హైతీ అధ్యక్షుడు జీన్‌ బెట్రాండ్‌ అరిస్డైడ్‌ను కిడ్నాప్‌ చేసి పదవి నుంచి తొలగించింది. హొండూరాస్‌ అధ్యక్షుడు జువాన్‌ ఆర్లాండో హెర్నాండెస్‌ను అరెస్టు చేసి అమెరికా కోర్టులో మాదక ద్రవ్యాల కేసులో 45ఏండ్ల శిక్షవేసింది. ట్రంప్‌ అతగాడిని క్షమించి జైలునుంచి ఇటీవలనే విడుదల చేశాడు. ఇరాన్‌లో అమెరికా, ఇతర ఐరోపా దేశాల చమురు కంపెనీలను జాతీ యం చేసినందుకు ప్రధాని మహమ్మద్‌ మొసాదిక్‌ను తొలగించి నియంతషాను గద్దెనెక్కించింది. గౌతమాలాలో కమ్యూనిజాన్ని వ్యతిరేకించే పేరుతో జాకబ్‌ ఆర్బెంజ్‌ను తొలగించింది. అతనికీ కమ్యూనిజానికి సంబంధం లేదు. పశ్చిమదేశాలను వ్యతిరేకించే వామపక్ష అనుకూలుడైన అధ్యక్షుడు అబ్దుల్‌ కరీం ఖాశింను ఇరాక్‌లో హత్య చేయించింది. దక్షిణ వియత్నాంలో తామే గద్దె నెక్కించిన నియంత నగో దిన్‌ డైమ్‌ కమ్యూనిస్టులను అణచటంలో విఫలమయ్యాడని మిలిటరీ తిరుగుబాటులో తొలగించింది. కమ్యూనిస్టుల మీద నెపాన్ని నెట్టింది.గ్రెనడాలో హడ్సన్‌ ఆస్టిన్‌ను తొలగించింది. లిబియాలో గడాఫీని కూలదోయించి హత్య చేయించింది. ఈ దురాగతాలన్నీ అమెరికా అధిపత్యం కోసమేనన్నది చరిత్ర చెబుతున్న సత్యం. వీటిని నిలువరించాలంటే ప్రజా ఉద్యమాలే శరణ్యం.

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -