డ్రగ్స్ పేరుతో చమురు కోసం దాడి
కారకస్ సహా పలు ప్రాంతాల్లో బాంబుల మోత
దేశంలో అత్యవసర పరిస్థితి
అమెరికా కస్టడీలో మదురో దంపతులు
తమ నేత ఆచూకీ చెప్పాలన్న వెనిజులా
అమెరికాది క్రిమినల్ చర్య అంటూ ఖండన
ట్రంప్ దూకుడును ఖండించిన దేశాలు
కారకస్ : మొత్తానికి అందరూ ఊహిస్తున్నదే జరిగింది. చమురుపై పెత్తనం కోసం తమకు పక్కలో బల్లెంలా నిలిచిన వెనిజులాపై అమెరికా దారుణంగా విరుచుకుపడింది. శనివారం తెల్లవారు జామున రాజధాని కారకస్ నగరంపై అమెరికా సైనిక బలగాలు పెద్ద ఎత్తున దాడులు జరిపాయి. అధ్యక్షుడు మదురోను, ఆయన భార్యను దేశం నుంచి తరలించాయి. వారిద్దరూ తమ అధీనంలోనే వున్నారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించిన ట్రంప్, అమెరికా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ బలగాల సహకారంతో పని పూర్తి చేశామన్నారు. మదురోపై క్రిమినల్ అభియోగాల విచారణ వుంటుందని చెప్పారు. వెనిజులాలోని పలు రాష్ట్రాల్లో కూడా దాడులు జరిగినట్లు వార్తలందాయి. శనివారం తెల్లవారు జాము నుంచి చాలా వేగంగా ఈ పరిణామాలన్నీ చోటు చేసుకున్నాయి.
వెనిజులా గగనతలాన్ని ఉపయోగించవద్దంటూ దాడులకు ముందుగానే అమెరికా విమానయాన సంస్థలకు హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు దేశంలోని పలు ప్రాంతాల్లో సైనిక స్థావరాలు, నివాస సముదాయాలే లక్ష్యంగా దాడులు జరిగాయని వెనిజులా ఉపాధ్యక్షురాలు డెల్సీ రొడ్రిగజ్ తెలిపారు. ప్రభుత్వ టీవీతో టెలిఫోన్‌లో మాట్లాడుతూ ఆమె, తమ అధ్యక్షుడు ఆయన భార్య జీవించి వున్నారా లేదా చెప్పాలని, ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. అమెరికా ఆర్మీలో అత్యున్నత మిషన్ యూనిట్ అయిన ఎలైట్ డెల్లా ఫోర్స్ సభ్యులు మదురో దంపతులను కస్టడీలోకి తీసుకున్నట్లు మీడియా వార్తలు పేర్కొన్నాయి. కాగా అమెరికా మిలటరీ చర్యను పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. అంతర్జాతీయంగా తీవ్ర నిరసనలు వ్యక్త మవుతున్నాయి. తొలుత శనివారం తెల్లవారు జామున రాజధాని నగరంలో ఏడు చోట్ల పేలుళ్ళు సంభవించాయి.
నగరంలో పలు చోట్ల దట్టమైన పొగ కమ్ముకున్న, ప్రజలు వీధుల్లో పరుగులు పెడుతున్న దృశ్యాలు కనిపించాయి. కారకస్ గగనతలంలో పలు అమెరికా చినూక్ మిలటరీ హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్న వీడియోతో సహా ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో పలు వీడియోలు బయటకు వచ్చాయి. బాంబు దాడుల కారణంగా కారకస్‌లోని మిలటరీ బేస్‌తో సహా పలు ప్రాంతాల్లో అంథకారం అలుముకుంది. తక్కువ ఎత్తులో ఎగురుతున్న విమానాల శబ్దాలు కూడా వినిపించాయని అధికారులు తెలిపారు. నెలల తరబడి తమపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నాలు సాగించిన ట్రంప్ చివరకు పౌర, సైనిక స్థావరాలపై దాడులకు తెగించారని మదురో ప్రభుత్వం విమర్శించింది.
దేశంలో అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రకటించింది. పెద్ద ఎత్తున సైనిక బలగాలను మోహరించినట్టు తెలిపింది. పదాతి, నావికా, వైమానిక బలగాలను అప్రమత్తం చేసినట్టు తెలిపింది. ‘మన గడ్డపై అమెరికా బలగాలు విచక్షణారహితంగా దాడులకు బరితెగించాయి. వారి యుద్ధ విమానాల నుంచి క్షిపణులు, రాకెట్లు మన ప్రజల ఆవాసాలపై విరుచుకుపడుతున్నాయి.” అని వెనిజులా రక్షణ మంత్రి వ్లాదిమిర్ పాడ్రినొ లోపెజ్ సోషల్ మీడియాలో వీడియో ప్రకటన చేశారు. దక్షిణ కారకస్‌లోని అతి పెద్ద మిలటరీ సముదాయంపై, మిరాండా, అరగ్వా, లా గుయిరా, రాష్ట్రాల్లో కూడా దాడులు జరిగాయని లోపెజ్ తెలిపారు. ఈ దాడులతో జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాలను అంచనా వేస్తున్నట్టు తెలిపారు.
ఆయిల్‌పైనే గురి..
గత కొంతకాలంగా వెనిజులాను అన్ని వైపుల నుండి అణచివేయడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యలు తీసుకుంటూనే వున్నారు. కరేబియా సముద్ర జలాల్లో ప్రధానంగా వెనిజులా తీరంలో మిలటరీ బలగాలను గణనీయంగా పెంచుతూ వచ్చారు. పైగా వెనిజులాపై తన చర్యలకు భిన్నమైన వాదనలు చెబుతూ వచ్చారు. డిసెంబరులో ఆమోదించిన అమెరికా జాతీయ భద్రతా వ్యూహంలో కూడా తన వైఖరిని చాలా స్పష్టంగా వెల్లడించారు. మదురో పదవి నుండి వైదొలగితే బాగుంటుందని లేకపోతే రోజులు లెక్కపెట్టుకోవాల్సిందేననంటూ హెచ్చరికలు కూడా చేశారు. మాదకద్రవ్యాల ముఠాలను కట్టడి చేయడం కోసమే ఇదంతా చేస్తున్నట్లు పైకి సాకులు చెబుతున్నా అమెరికా అసలు ఆంతర్యం వెనిజులా చమురుపై పట్టును సాధించడమేనని అందరికీ తెలిసిన విషయమే.



