ఇలాంటి పచ్చి రక్తం తాగే గోముఖవ్యాఘ్రానికా నన్ను కట్టబెట్టమని కోరింది అంటూ నోబెల్ శాంతి బహుమతి విలవిల్లాడుతోంది. అనేక యుద్ధాలను నివారించిన తనకు శాంతి బహుమతి ఇవ్వలేదని అలిగిన ట్రంప్ నిజస్వరూపం ఇరాన్ అధినేత అయాతుల్లా అలీ ఖమేనీ హత్యతో లోకానికి బహిర్గతమైంది. అమెరికా వైట్‌హౌస్‌లో ఎవరున్నా ఎక్కడో అక్కడ రక్తంతో చేతులు తడుపుకున్నవారే. తమకు లొంగని లేదా నచ్చని విదేశీ నేతలను హతమార్చటంలో అమెరికాకు పెట్టింది పేరు. అది ఒక నిరంతర కార్యక్రమంగా పెట్టుకున్నారు. అడ్డుకొనేవారు లేకపోవటంతో ఒకదాని తరువాత ఒకటిగా కొనసాగిస్తున్నారు. న్యాయం తరఫున ఉంటామని రొమ్మువిరుచుకొని చెప్పుకొనే మన పాలకులు మదురో కిడ్నాప్‌ను తప్పనలేదు, ఖమేనీ హత్య అన్యాయమని చెప్పలేదు. ప్రపంచంలో నరేంద్రమోడీకి ఉన్నంత పలుకుబడి మరేనేతకు లేదని సర్వేలు చెబుతున్నాయంటారు. మరి యుద్ధాల నివారణకు దాన్ని ఉపయోగించరేం? శాంతియుతంగా పరిష్కరించుకోండనే బాబాల సూక్తులు ఎవరైనా చెబుతారు, అఫ్‌కోర్స్ అలాంటి వాటిని పూచికపుల్ల మాదిరిగా తీసివేస్తారనుకోండి. నరేంద్రమోడీ మాటలకూ అదే పరిస్థితి.
ప్రత్యర్ధులను కుట్రచేసి హతమార్చటం పురాతన కాలం నుంచీ ఉన్నదే. క్రీస్తు పూర్వం రోమన్ చక్రవర్తి, నియంత జూలియస్ సీజర్‌ను అతని అనుయాయులే కుట్ర చేసి హత్య చేశారు. నాటి నుంచి నేటి వరకు అధికారంలో ఉన్న అనేక మంది కుట్రలకు బలయ్యారు.వర్తమానానికి వస్తే గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచంలో అక్కడా ఇక్కడా అని లేకుండా ప్రతి ఖండంలో సిఐఏ ద్వారా దొంగచాటుగా లేదా అంతర్గతంగా మిలిటరీ తిరుగుబాట్లను ప్రోత్సహించి అనేక మందిని పొట్టనపెట్టుకున్న అమెరికా ఇటీవలి కాలంలో వాటితో పాటు బహిరంగంగా దాడులకు దిగి హతమారుస్తున్నది. పశ్చిమాసియాలో దాని తొత్తుగా ఉన్న ఇజ్రాయిల్ అమెరికా సిఐఏ మాదిరి మొసాద్ అనే సంస్థద్వారా పశ్చిమాసియా, మధ్య ప్రాచ్యంలో హత్యలకు చిరునామాగా మారింది. హత్యలు అమెరికా తన విదేశాంగ విధానంలో భాగంగా చేసుకున్నది. ఐక్యరాజ్యసమితి, ప్రజాస్వామ్యన్నా లెక్కలేదు, చివరికి స్వంతపౌరులు వ్యతిరేకిస్తున్నప్పటికీ అలాంటి దుర్మార్గాలను కొనసాగిస్తున్నది.
అనేక ఉదంతాలను చూసిన తర్వాత ఐరోపాలో నాటి సామ్రాజ్య వాదదేశాలు 1648లో వెస్ట్‌ఫాలియా ఒప్పందం చేసుకున్నాయి. దానిలో ఒక ముఖ్య అంశం ఇతర దేశాల వ్యవహా రాల్లో ఏ దేశమూ వేలు పెట్టకూడదు. ఆ మేరకు అంగీకారానికి వచ్చాయి గానీ తరువాత జరిగిన చరిత్ర అంతా దానికి విరుద్దమే. అందుకే అనేక యుద్ధాలు జరిగాయి. అదే మాదిరి అమెరికా కూడా స్వయంగా అనేక ఆంక్షలు విధించుకుంది. అయితే పాము తనపిల్లలను తానే తింటున్నట్లుగా అది కూడా వాటన్నింటికీ తిలోదకాలిచ్చింది.తన దారికి రాని, వ్యతిరేకించే అనేక మంది దేశాధినేతలను కుట్ర చేసి హత మార్చింది. అంతర్జాతీయంగా రక్షణ ఉన్న వారిని ఏ కారణంతోనైనా హత్య లేదా గాయపరచటం గానీ నేరపూరితంగా పరిగణిస్తూ 1973లో న్యూయార్క్ సదస్సు నిర్ణయించింది. దాని ప్రకారం తాజాగా ఇరాన్ అధినేత ఖమేనీ హత్యానేరంపై డోనాల్డ్ ట్రంప్, బెంజమిన్ నెతన్యాహు వారికి మద్దతిచ్చిన దేశాల నేతలను విచారించాల్సిందే.
న్యూయార్క్ సదస్సులో భాగస్వామిగా ఉన్న అమెరికా బాహాటంగా ఉల్లంఘించి ఇరాక్‌లో సద్దామ్ హుస్సేన్, లిబియాలో మహమ్మద్ గఢాఫీని హతమార్చింది. అమెరికా చెప్పే ప్రజాస్వామ్యం, మానవత్వం ఒక మేడిపండు. ప్రపంచ చరిత్రలో నిరాయుధులైన పిల్లలు, పెద్దలు ఎవరైనా మరొక దేశానికి హాని కలిగించిన ఉదంతం ఉందా? ఆత్మరక్షణ, సాయుధబృందాలను అడ్డుకొనేపేరుతో గాజాలో వేలాది మంది పిల్లలను ఊచకోత కోసినా, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, చివరికి ఐరాస సహాయ శిబిరాలను కూడా కూల్చివేసిన ఇజ్రాయిల్ దుర్మార్గాన్ని నిస్సిగ్గుగా సమర్ధించింది. కానీ, నివారించటానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు, భద్రతా మండలిలో దాని మారణకాండను కూడా మద్దతిచ్చింది. బ్రిటన్ వలసగా ఉన్న అమెరికా పోరాటంతోనే 1776లో విముక్తి పొందింది. దాని స్వాతంత్య్ర ప్రకటనలో వల్లించిన వాటన్నింటికీ తిలోదకాలిచ్చి ఇతర దేశాల స్వాతంత్య్రం, సార్వభౌమత్వాలను హరించే దుర్మార్గానికి పాల్పడుతున్నది.
ఇరాన్‌పై దాడికి తమ స్థావరాలను వినియోగించుకోవచ్చని బ్రిటన్ చెప్పిందంటే అమెరికా విదిల్చే ఎముకల కోసం నక్కలా అది ఎలా వెంపర్లాడుతోందో అర్ధమవుతోంది. ఇతర దేశాల నేతలను మట్టుబెట్టేందుకు సిఐఏ, ఎన్‌ఐఏ, ఎఫ్‌బిఐ, ఐఆర్‌ఎస్ వంటి సంస్థల దుర్వినియోగంపై విమర్శలు వెల్లువెత్తాయి. విధిలేక 1975లో సెనెటర్ ఫ్రాంక్ చర్చ్ అధ్యక్షతన ఒక కమిటీ వేశారు. ఇతర దేశాల నేతలను హత్య కావించటం అమెరికా విలువలకే వ్యతిరేకమని సదరు కమిటీ చెప్పింది.హత్యాకాండను అధ్యక్షుడు ఫోర్డ్ నిషేధించాడు. అయితే ఇప్పటికీ కాగితాల మీద అవన్నీ ఉన్నప్పటికీ ఏదో ఒకసాకుతో ఉల్లంఘిస్తున్నారు. ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేకులను అణచివేస్తున్నాడనే పేరుతో ఖమేనీని హత్య చేస్తామని, పాలకుడిగా తొలగిస్తామని ట్రంప్ చెప్పటం ఉల్లంఘనలో భాగమే. అందువలన ఏ విధంగా చూసినప్పటికీ ఖమేనీ హత్యను అందరూ నిరసించాలి. ఖండించని వారంతా అలాంటి దుర్మార్గాలను బలపరిచినట్లే. అది నరేంద్రమోడీ అయినా మరొకరైనా వర్తించేదదే!
అమెరికా రక్తచరిత్ర!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



