Friday, December 26, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఆయుధీకరణకు అమెరికా సాకులు!

ఆయుధీకరణకు అమెరికా సాకులు!

- Advertisement -

మిలిటరీ అవసరాలకు గాను ప్రపంచంలో పద్నాలుగు దేశాల వద్ద మొత్తం 51 విమానవాహక, హెలికాప్టర్‌ వాహక నౌకలు ఉన్నాయి. వాటిలో ఒక్క అమెరికా నౌకా దళంలోనే 20 ఉన్నాయి. అలాంటి మిలిటరీ శక్తి రక్షణ శాఖ పెంటగన్‌ మంగళవారం నాడు విడుదల చేసిన వార్షిక నివేదికలో చైనా గురించి గుండెలు బాదుకుంది, అధారాలు లేని ఆరోపణలు చేసింది. అవేమిటంటే రానున్న పదేండ్లలో మరో ఆరు విమానవాహక యుద్ధనౌకల నిర్మాణానికి చైనా పూనుకుంది. మంగోలియా సరిహద్దులో మరో మూడు భూగర్భ ఖండాంతర క్షిపణుల కేంద్రాలను ఏర్పాటు చేసి మరో వంద క్షిపణులను మోహరించేందుకు పూనుకుందని ఆరోపించింది. పనిలో పనిగా భారత్‌ – చైనా మధ్య తంపులు పెట్టేందుకు, అనుమానాలను పెంచేందుకు అరుణాచల్‌ప్రదేశ్‌ గురించి కూడా ప్రస్తావించింది. ఇదంతా ఎందుకు అంటే యావత్‌ ప్రపంచాన్ని బెదిరించేందుకు తమ మిలిటరీ శక్తితో పూనుకున్న యాంకీలు మరింతగా పెంచుకొనేందుకు ఇతర దేశాల మీద సాకులకు పూనుకన్నారు. ఇప్పటికే బలమైన నౌకాదళం ఉన్న చైనా చర్యలతో అమెరికా భద్రతకు ముప్పు వచ్చిందంటూ అమెరికన్లనూ భయపెట్టేందుకు పూనుకుంది.

‘మాఇంటికి మీ ఇల్లు ఎంతదూరమో మీ ఇంటికి మాఇల్లు కూడా అంతే దూరం’ అన్నట్లుగా అమెరికా యుద్ధ నౌకలు కూడా చైనాకు ముప్పే కదా! అమెరికా వద్ద 11 విమాన వాహక యుద్ధనౌకలుండగా చైనా 3, భారత్‌, బ్రిటన్‌, ఇటలీ రెండేసి చొప్పున, ఫ్రాన్సు, రష్యా ఒక్కొక్కటి కలిగి ఉన్నాయి. మొత్తం 22 విమాన వాహక నౌకల్లో సగం అమెరికా వద్ద ఉన్నాయంటే సప్త సముద్రాల్లోనూ ఒకటికంటే ఎక్కువ మోహరించి యావత్‌ ప్రపంచం మీద అమెరికా దాడి చేసేందుకు సన్నాహాలు చేసుకున్నట్లే భావించాలి మరి. పరస్పరం ఏ దేశమూ మరోదాన్ని నమ్మే స్థితిలేనపుడు, ఎవరినీ నియంత్రించే శక్తి ఐరాసకు లేదని తేలిపోయినందున ఎవరి జాగ్రత్తలో వారుండటం తప్పేమీ కాదు. అందుకే మనదేశం అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పిటి) మీద సంతకం చేయలేదు, ఈ వైఖరిని అందరం సమర్ధిస్తున్నాం. క్వాడ్‌ పేరుతో అమెరికా, జపాన్‌, భారత్‌, ఆస్ట్రేలియా కూటమి కట్టాయి, ఆస్ట్రేలియా, బ్రిటన్‌, అమెరికా (అకుస్‌) పేరుతో మరో కూటమి ఉంది.

ఇవన్నీ నాటో మాదిరి మిలిటరీ కూటములు కాకపోయినా స్వేచ్ఛాయుత నౌకా రవాణా, భద్రతా అంశాల సంప్రదింపులు మరొక పేరుతో తమను లక్ష్యంగా చేసుకున్నవే అని చైనా అనుమానిస్తున్నది.అందుకే పెంటగన్‌ నివేదికలో ఆరోపించినట్లుగా ఆరు విమానవాహక యుద్ధ నౌకలను నిర్మిస్తున్నదీ లేనిదీ స్పష్టంగా చెప్పకుండా అలాంటి పథకాలు తమ జాతీయ భద్రత అవసరాలకు అనుగుణంగా ఉంటాయని అమెరికాలో చైనా రాయబారి లీ పెంగ్‌యు వ్యాఖ్యానించాడు. తెలివితేటలు ఏ ఒక్కరిసొత్తూ కాదు, ఎవరి దౌత్యం వారిది. తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ ప్రాంతం చైనాలో అంతర్భాగమని అన్ని దేశాలూ ఐరాసలో గుర్తించాయి. కానీ దాన్ని విలీనం చేసుకుంటామని బీజింగ్‌ చెబుతుంటే అవసరమైతే మిలిటరీని దించి అడ్డుకుంటామని అమెరికా, జపాన్‌ బెదిరిస్తున్నాయి. ఒకవేళ పాక్‌ ఆక్రమిత కాశ్మీరును స్వాధీనం చేసుకుంటామని మనదేశం చెప్పినా ఈ దేశాలు పాకిస్తాన్‌కే వత్తాసు పలుకుతాయన్నది స్పష్టం. రెండవ ప్రపంచయుద్ధంలో విడదీసిన ఉత్తర, దక్షిణ వియత్నాంలు ఒకటౌతామంటే జపాన్‌, ఫ్రాన్సు, అమెరికా మూడూ కూడా దాదాపు మూడు దశాబ్దాల పాటు ఉత్తర వియత్నాం మీద అమానుషదాడులు చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పటికీ ఉత్తర-దక్షిణ కొరియాల విలీనానికి అడ్డుపడుతున్నది ఎవరంటే ఈ దేశాలే. దక్షిణ కొరియా, జపాన్‌లలో అమెరికా పెద్ద సైనిక స్థావరాలను కలిగి ఉంది. ఏమిటంటే ఆ దేశాల రక్షణతో పాటు తమ భద్రతకు అని చెబుతున్నది. బంగ్లాదేశ్‌ విముక్తి ఉద్యమం సందర్భంగా మనదేశం అక్కడి పౌరులకు మద్దతుగా సైన్యాన్ని పంపితే మనలను బెదిరించేందుకు అమెరికా తన సప్తమ నౌకాదళాన్ని బంగాళా ఖాతంలోకి రప్పించిన సంగతి మనం మరువగలమా? మనకు మద్దతుగా సోవియట్‌ రంగంలోకి దిగటంతో అమెరికా తోకముడిచింది. మూడు విమానవాహక యుద్ధనౌకలు, 370 ఇతర యుద్ధ నౌకలతో చైనా నేడు ప్రపంచంలో ప్రపంచంలో పెద్ద నౌకాదళం కలిగిన దేశంగా అవతరించింది. ఒక దేశం మిలిటరీ సత్తాను కొలిచేందుకు ఎన్ని విమానవాహక యుద్ధ నౌకలున్నాయన్నది ఒక కొలమానంగా చూస్తున్నారు. అటువంటపుడు చైనా నిజంగా పదేండ్లలో ఆరు నౌకలను నిర్మిస్తుందో లేదో తెలియదు గానీ సమకూర్చుకొనే హక్కు దానికి ఉంది, అప్పుడే అమెరికా అదుపులో ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -