Wednesday, July 16, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుభారత పాడిపై అమెరికా కన్ను..!

భారత పాడిపై అమెరికా కన్ను..!

- Advertisement -

– తమ దేశ పాల ఉత్పత్తులను అనుమతించాలని ట్రంప్‌ ఒత్తిడి
– జన్యుమార్పిడి పశుగ్రాసం కోసం పట్టు
– టారిఫ్‌లు తగ్గించాలని ప్రధాన డిమాండ్‌
– మన ఎగుమతులపై సుంకాలు యథాతధం
– ప్రమాదంలో 8 కోట్లమంది పాడి రైతుల జీవితాలు
– చితికిపోనున్న డెయిరీ సహకార సంఘాలు

చిట్యాల మధుకర్‌
భారత పాడి పరిశ్రమపై అమెరికా కన్ను వేసింది. తమ దేశం నుంచి పాలు, పాల ఉత్పత్తులను భారత్‌లోకి ఎలాంటి ఆంక్షలు లేకుండా, తక్కువ సుంకాలతో అనుమతించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పట్టుబడుతున్నారు. ప్రస్తుతం నాలుగు రోజుల పాటు ఇరు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చల్లో జీఎం విత్తనాలు సహా పాలు, పాల ఉత్పత్తులనూ అనుమతించాలని అమెరికా ప్రధానంగా డిమాండ్‌ చేస్తోంది. తమ ఉత్పత్తులపై అధిక సుంకాలను తగ్గించాలని ఒత్తిడి చేస్తోంది. ఈ చీకటి ఒప్పందంలో భారత్‌ ఏమాత్రం తలొగ్గినా భారత పాడి పరిశ్రమ దివాలా తీసే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇరు దేశాల మధ్య జరుగుతున్న టారిఫ్‌ చర్చల్లో అమెరికా తమ పాల ఉత్పత్తులకు భారత మార్కెట్‌లో అవకాశం కల్పించాలని కోరుతోంది. దీనిలో జన్యు మార్పిడి (జీఎం) పశుగ్రాసం కూడా ఉంది. తమ డిమాండ్లను అంగీకరించకపోవతే భారత ఉత్పత్తులపై అధిక సుంకాలను విధిస్తామని ట్రంప్‌ బెదిరింపులకు పాల్పడుతోన్న సంగతి తెలిసిందే.


ఇప్పటికే టారిఫ్‌లకు కోత..
దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ అమెరికాకు అనుకూలంగా వ్యవహారిస్తున్నారు. ఆ దేశానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమెరికా నుంచి పౌల్ట్రీ, గుడ్డు దిగుమతులపై ఉన్న నిషేధాన్ని మోడీ సర్కార్‌ 2023లో జరిగిన జీ-20 సమ్మిట్‌లో ఎత్తివేసింది. అదే విధంగా అతిపెద్ద హోటళ్లలో ఉపయోగించే బ్లూబెర్రీస్‌, క్రాన్‌బెర్రీస్‌, ఫ్రోజెన్‌ టర్కీ, ఫ్రోజెన్‌ డక్‌లపై టారిఫ్‌లను 30 శాతం నుంచి 5-10 శాతానికి తగ్గించింది. పెకాన్‌ నట్స్‌, బాదం, యాపిల్స్‌, చిక్‌పీస్‌, వాల్‌నట్‌లపై రిటాలియేటరీ టారిఫ్‌లను తొలగించింది. ఇది దిగుమతులను మరింత పెంచేలా చేసింది. గతేడాది 2024లో భారత్‌కు అమెరికా 1.5 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.13వేల కోట్లు) విలువ చేసే వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ఈ ఎగుమతులను బహుళ రెట్లు పెంచుకోవడానికి వీలుగా జిఎం విత్తనాలను, పాలు, పాల ఉత్పత్తులను అనుమతించాలని పట్టుబడుతోంది.


రూ.20 లక్షల కోట్ల మార్కెట్‌పై దృష్టి..
2022-23 నాటి గణంకాల ప్రకారం.. భారత్‌ 230 మిలియన్‌ టన్నుల పాల ఉత్పిత్తితో ప్రపంచంలో అతిపెద్ద పాల ఉత్పత్తి దేశంగా ఉంది. ఈ పాల పరిశ్రమ విలువ దాదాపు రూ.16-18 లక్షల కోట్లుగా ఉందని అంచనా. ప్రతీ ఏడాది 5-7 శాతం వరకు వృద్ధిని నమోదు చేస్తోంది. 2030 నాటికి ఈ పరిశ్రమ విలువ రూ.20-25 లక్షల కోట్లకు కోట్లకు చేరనుందని ఆ రంగం నిపుణుల అంచనా. ఈ రంగంపై ఎక్కువగా చిన్న, సన్నకారు రైతులు ఎక్కువగా ఆధారపడ్డారు. కాగా.. దాదాపు రూ.20 లక్షల కోట్ల విలువ చేసే భారత డెయిరీ రంగంలో తమ ఉనికిని చాటు కోవాలని అమెరికా ఎప్పటి నుంచో భావిస్తోంది. ఇక్కడి అనేక ప్రభుత్వ, ప్రయివేటు, రైతుల సహకార సంస్థలు స్థానిక రైతులకు మద్దతును అందిస్తున్నాయి. ఆర్గానిక్‌ (సేంద్రియ) పాల ఉత్పత్తులతో భారత మార్కెట్‌ పటిష్టంగా ఉంది. ఒక వేళ అమెరికా డైరీ ఉత్పత్తులపై సుంకాలను తగ్గిస్తే.. అవి చౌకగా మారి పాడి రైతులను సహకార సంఘాలను నిర్వీర్యం చేయనున్నాయి. ముఖ్యంగా ఈ రంగంపై ఆధారపడిన 8 కోట్ల మంది పాడి రైతుల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడనుంది.


ఒత్తిడికి తలొగ్గితే….
– అమెరికా ఉత్పత్తులతో ధరల పోటీని భారత రైతులు తట్టుకోలేరు.
– స్థానిక రైతుల మార్కెట్‌ వాటా తగ్గుతుంది.
– 8 కోట్ల పాడి రైతుల జీవనాదాయాలకు దెబ్బ
– జీఎం పశుగ్రాసంతో పశువులకు, రైతులకు ఆరోగ్య సమస్యలు.
– సహకార సంస్థల ఆర్థిక స్థిరత్వంపై ప్రతికూలత.
– గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలహీనం.


రైతుల దివాలా..!
పాల ఉత్పత్తిలో అమెరికా రెండో అతిపెద్ద దేశంగా ఉంది. అక్కడ అధిక ఆటోమేషన్‌, ఆధునిక సాంకేతికత, జన్యు మార్పిడి పశుగ్రాసం వాడకం వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ పాల ఉత్పత్తి జరుగుతుంది. అక్కడ సగటు లీటర్‌ ధర రూ.25-35 (0.30-0.40 డాలర్లు)గా ఉంది. దీంతో చీజ్‌, వెన్న, పాల పొడి వంటి ఉత్పత్తులు చౌకగా లభిస్తాయి. భారత్‌లో లీటర్‌ పాల సగటు ధర రూ.45-70గా ఉంది. దేశంలోని గేదెలు రోజుకు సగటున 8-12 లీటర్ల పాలను ఇస్తాయి. అమెరికాలో గేదెలకంటే ఆవులు ఎక్కువగా ఉంటాయి. అక్కడి అవులు రోజుకు ఏకంగా 25-40 లీటర్ల పాల దిగుబడిని కలిగి ఉన్నాయి.


గడ్డి కూడా కొనాలా..?
అమెరికాలో జన్యు మార్పిడి (జీఎం) పశు గ్రాసాలయిన సోయాబీన్‌ మీల్‌, డిస్టిలర్స్‌ డ్రైడ్‌ గ్రెయిన్స్‌ విత్‌ సోల్యూబుల్స్‌ (డీడీజీఎస్‌), జిఎం మొక్కజొన్న ఉపయోగిస్తున్నారు. వీటిని భారత్‌లోకి అనుమతించాలని డిమాండ్‌ చేస్తోంది. ఈ పశుగ్రాసాలనూ అనుమతించాలని డిమాండ్‌ చేస్తోంది. అయితే వీటికి సంబంధించిన విత్తనాలపై స్పష్టత లేదు. వీటిలో కొన్ని జీఎం ఉత్పత్తులను అనుమతించడానికి భారత్‌ సానుకూలంగా ఉందని రిపోర్టులు వస్తోన్నాయి. అయితే ఇది స్థానిక రైతుల జీవనాధారం, ఆరోగ్యంపై తీవ్ర దుష్పరిణామాలు చూపనుందనే ఆందోళనలు నెలకొన్నాయి. జీఎం పశుగ్రాసం వల్ల పశువుల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. గుజరాత్‌లో బీటీ పత్తి విత్తనాల వాడకం వల్ల అవుల సంతానోత్పత్తి సమస్యలు, మానవ ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావాలు చోటు చేసుకున్నాయనే ఆందోళనలు ఉన్నాయి.


అధిక సుంకాలతోనే రక్షణ..
– ప్రస్తుతం అమెరికా డెయిరీ ఉత్పత్తులపై 30-60 శాతం సుంకాలు అమల్లో ఉన్నాయి. ఇది అమెరికా ఉత్పత్తులను ఖరీదైనవిగా మార్చడంతో భారత్‌లో రాణించలేకపోతున్నాయి. ఈ అధిక సుంకాలు భారత రైతులకు రక్షణగా ఉన్నాయి. లేకుంటే అమెరికా ఉత్పత్తులతో పోటీ పడటం కష్టం, ఎందుకంటే అవి చౌకగా ఉంటాయి. సుంకాలు తగ్గితే స్థానిక రైతులు నష్టపోతారు.
అమెరికా పాలు, పాల ఉత్పత్తులపై 30-60 శాతం సుంకాలను కొనసాగించాలి.
– అవసరమైతే మరింత టారిఫ్‌లను పెంచాలి.
– భారత రైతులకు ఎక్కువ ఆర్థిక సహాయం అందించాలి.
– డెయిరీ రంగంలో ఆధునిక సాంకేతిక యంత్రాలు కల్పించాలి.
– క్రాస్‌బ్రీడ్‌ గేదెల వాడకం ద్వారా పాల దిగుబడిని పెంచాలి.
– సహకార సంస్థలను బలోపేతం చేయాలి.
– రైతులకు న్యాయమైన ధరలు, మార్కెట్‌ అవకాశాలను కల్పించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -