సామ్రాజ్యవాద దేశానికి మోకరిల్లుతున్న మోడీ సర్కారు
కార్పొరేట్ల ఊడిగం కోసమే లేబర్ కోడ్‌లు, విద్యుత్ సవరణ బిల్లు
మార్చి 1 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
హామీలు నెరవేర్చడంలో రాష్ట్ర కాంగ్రెస్ విఫలం
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికా సామ్రాజ్యవాదానికి మోకరిల్లుతూ, దేశ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మండిపడ్డారు. గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల హక్కులను రక్షించాల్సిన పార్లమెంటు సాక్షిగా.. మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. ఏండ్ల తరబడి పోరాడి సాధించుకున్న 40కి పైగా లేబర్ చట్టాలను రద్దు చేసి, యజమానులకు ఊడిగం చేసేలా నాలుగు కోడ్‌లుగా మార్చారని జాన్‌వెస్లీ అన్నారు. సాగు రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించే కుట్రలో భాగంగానే ఎరువులపై రాయితీలు ఎత్తివేస్తున్నారని, విత్తన బిల్లుల పేరుతో ధరలు పెంచుతూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే విద్యుత్ సవరణ బిల్లును రైతాంగం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
అడవులపై ‘ఆపరేషన్ కగార్’ కుట్ర
దేశ పౌరులైన మావోయిస్టులను ఏరివేసే నెపంతో ‘ఆపరేషన్ కగార్’ పేరుతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, ప్రధాని మోడీ అటవిక రాజ్యాన్ని సాగిస్తున్నారని జాన్‌వెస్లీ అన్నారు. అసలు లక్ష్యం అడవుల్లో ఉన్న ఖనిజ సంపదను దోచుకోవడమేనని అన్నారు. అడవులను వదిలి జన స్రవంతిలోకి వస్తున్న మావోయిస్టుల్లో శ్రామిక వర్గం కోసం పోరాడే వారికి వామపక్షాలు అండగా ఉంటాయని, లౌకిక పార్టీలతో కలిసి వారు పనిచేయవచ్చని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు – మతోన్మాదంపై విమర్శలు
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది దాటినా 2 లక్షల ఉద్యోగాల హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. కుల, మతోన్మాద శక్తులు పెచ్చుమీరుతున్నాయని, కుమ్మెర ఘటనలే ఇందుకు నిదర్శనమని అన్నారు. రాష్ట్రం నుంచి గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు నిధులు తేవడంలో విఫలమై, కేవలం మత ఘర్షణలు ప్రేరేపించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో మూసి ప్రక్షాళన పేరుతో 50 వేల ఇళ్లను, ఖమ్మంలో పేదల నివాసాలను కూల్చివేయడాన్ని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని జాన్‌వెస్లీ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మార్చి 1 నుండి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా మండల స్థాయి నుంచి ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించనున్నట్టు ఆయన ప్రకటించారు.
పార్టీ జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ కరీంనగర్‌లో బీజేపీకి మేయర్ పీఠం ఇస్తే డంపింగ్‌యార్డ్‌ను తరలిస్తామని చెప్పిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ పదేండ్లలో ఎందుకు తరలించలేదని ప్రశ్నించారు. కనీసం ఈఎస్‌ఐ ఆస్పత్రి, త్రిబుల్‌ఐటీ గానీ, ఏ ఒక్క ప్రాజెక్టు తీసుకురాలేని సంజయ్ రెండుమార్లు ఎంపీగా విఫలమయ్యారని అన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు పాలడుగు భాస్కర్, ఎస్.రమ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వర్ణవెంకటరెడ్డి, గీట్ల ముకుందరెడ్డి, గుడికందుల సత్యం, జీ.బీమాసాహెబ్ పాల్గొన్నారు.



