గతంలో వాణిజ్యం పేరుతో ఐరోపా సామ్రాజ్యవాద దేశాలైన బ్రిటన్, డచ్, పోర్చుగీసు, ఫ్రాన్సు వంటి దేశాలు ప్రపంచాన్ని ఆక్రమించుకున్నాయి. ఆక్రమంలో వాటి మధ్య యుద్ధాలు కూడా జరిగాయి. ఇప్పుడు తన భద్రతకు ముప్పు పేరుతో ప్రపంచాన్ని ఆక్రమించుకొనేందుకు అమెరికా పావులు కదుపుతోంది. మాదకద్రవ్యాలను సరఫరా చేసే ముఠాకు నాయకుడంటూ తప్పుడు ప్రచారం చేసి వెనెజులా అధ్యక్షుడిని అపహరించింది. ఇరాన్‌లో ప్రజాందోళలను అణచి వేస్తున్నందున జోక్యం చేసుకుం టామని బెదిరిస్తున్నది. ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు. ఆర్కిటిక్ సముద్రంలో ఉన్న డెన్మార్క్‌కు చెందిన స్వయం పాలిత ప్రాంతం గ్రీన్‌లాండ్ దీవి తన రక్షణకు అవసరమంటూ దాన్ని ఆక్రమించుకొనేందుకు పూనుకుంది. అన్ని ఖండాలలో 800కు పైగా చిన్నా, పెద్ద మిలిటరీ కేంద్రాలు, లక్షలాది మంది సైన్యాన్ని మోహరించిన అమెరికా ఏ దేశం మీదనైనా దాడికి దిగదలుచుకుంటే కొన్ని గంటల్లోనే సైన్యాన్ని దించగలదు. అలాంటిది చిన్న దేశమైన క్యూబా మొదలు పెద్దదేశమైన చైనా వరకు అన్నీ తన భద్రతకు ముప్పు తలపెట్టాయంటూ ఒక మైండ్ గేమ్(మానసిక క్రీడ) ఆడుతోంది. ఆ సాకుతో బెదిరింపులకు, ఆక్రమణలకు పాల్పడుతోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు చెప్పిన అనేక మధురమైన మాటలతో ఇంక పనిలేదు, అనుకున్న లక్ష్యాలు నెరవేరటం లేదంటూ కర్ర పుచ్చుకొని దందాకు పూనుకుంది. తనకు లొంగని వెనెజులా మీద దాడిచేసి అధ్యక్షుడు నికొలస్ మదురోను అపహరించి విచారణ తతంగం ప్రారంభించింది. ఆ దేశానికి తానే తాత్కాలిక అధ్యక్షుడనని ట్రంప్ ప్రకటించుకున్నాడు. తదుపరి లక్ష్యాలుగా కెనడా, గ్రీన్‌లాండ్, ఇరాన్, మెక్సికో, కొలంబియా ఇలా జాబితాను పెంచుకుంటూ పోతోంది.
ఇరాన్‌మీద గతేడాది భీకరదాడి జరిపినప్పటికీ అది సాధించిందేమీ లేదు. అణుస్థావరాలకు ఆవగింజంత నష్టం కూడా జరగలేదని తేలింది. అందువలన ఇప్పుడు మరోసారి దాడి జరగాలంటే అనేక అంశాలను మదింపు చేసుకోవాల్సి ఉంటుంది. అందువలన తొలుత గ్రీన్‌లాండ్‌తో ఆక్రమణ ప్రారంభం కావచ్చన్నది ఒక అభిప్రాయం. ఒక గుండా ముందుగా బలహీనులనే దాడికి ఎంచుకుంటాడు. దాని వలన రెండు ప్రయోజనాలు ఒకటి నా తడాఖా ఇట్లుంటది అని చూపుకోవచ్చు, మిగిలిన వారిని బెదిరించవచ్చు. గ్రీన్‌లాండ్‌ను తాను స్వాధీనం చేసుకోనట్లయితే రష్యా, చైనా ఆక్రమించు కుంటాయని అందువలన తానే ఆపని చేయనున్నట్లు ట్రంప్ ఒక అబద్దాన్ని చెప్పాడు. నిజానికి అలాంటి ఆరోపణలను ఏ దేశం లేదా వాటిని వ్యతిరేకించే మీడియా కూడా చేసేందుకు సాహసించలేదు. జనాలను తప్పుదారి పట్టించేందుకు ఒక పథకం ప్రకారం గోబెల్స్‌ను మించి ప్రచారాలు చేయటంలో అమెరికా పేరుమోసింది.ఆర్కిటిక్ సముద్రంలో అనేక దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి.ఎక్కడా దాపరికం లేదు, చైనా కూడా అదే చేస్తోంది. కానీ గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించు కొనేందుకే అని బీజింగ్ మీద కథనాలు రాస్తున్నారు. ఆర్కిటిక్ సముద్రంలో మంచుకరిగిపోతున్నదని గత మూడు దశాబ్దాలుగా అనేకమంది చెబుతున్నారు, దాని పరిణామాలు, పర్యవసానాల గురించి పరిశోధనలు చేయటం ఆ ప్రాంత దేశాలైన నార్వే, డెన్మార్క్, స్వీడన్,ఐస్‌లాండ్, కెనడా, అమెరికా, రష్యా, ఫిన్లాండ్ దేశాలకే కాదు, యావత్ మానవాళికి అవసరం.అయితే అవి అంగీకరించిన అంతర్జాతీయ చట్టాలు, నిబంధనల మేరకు జరగాలి. ప్రస్తుతం వార్తలోకి ఎక్కిన గ్రీన్‌లాండ్ దీవి డెన్మార్క్‌లోని స్వయం పాలిత ప్రాంతం. అది డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్‌కు అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసికి మధ్యలో రెండు దేశాలకు 3,200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రష్యాకు ఐదువేలు, చైనాకు ఎనిమిది, మనదేశానికి తొమ్మిదివేల కిలోమీటర్లు ఉంటుంది.గ్రీన్‌లాండ్ రాజధాని నుక్ పట్టణం డెన్మార్క్ రాజధానికి 3,500 కిలోమీటర్ల దూరంలో ఉంటే అమెరికా నగరం న్యూయార్క్‌కు 2,900కి.మీ దూరంలో ఉంది. దక్షిణ చైనా సముద్రంలో స్వేచ్చగా నౌకా రవాణా జరగాలని చెబుతున్న అమెరికా, ఆర్కిటిక్ సర్కిల్ ప్రాంతంలో అంతర్జాతీయ ప్రాంతంలో పరిశోధనలు చేసే హక్కు చైనాతో సహా ఏ దేశానికైనా ఉంటుందా లేదా! ప్రచ్చన్న యుద్ధ కాలంలో ఈ ప్రాంతంలో అమెరికా, సోవియట్ యూనియన్ కూడా అణు జలాంతర్గాములను మోహరించాయి. ఇప్పుడు మరోసారి ఆ ప్రాంతాన్ని ఒక యుద్ధ కార్యక్షేత్రంగా మార్చేందుకు అమెరికా పూనుకుంది. ఇప్పటికే గ్రీన్‌లాండ్‌లో ఉన్న తన మిలిటరీ కేంద్రాన్ని మరింత పటిష్ట పరిచేందుకు తనకు ఆ దీవి పూర్తిగా కావాలని, మర్యాదగా ఇస్తే సరి, లేకుంటే బలప్రయోగం చేయాల్సి వస్తుందని బెదిరింపులకు దిగింది. రష్యా, చైనా నుంచి ఆర్కిటిక్ ప్రాంతానికి ముప్పు వచ్చిందని 2024లోనే అమెరికా ప్రచారం ప్రారంభించింది.
గ్రీన్‌లాండ్ ప్రాంతంపై అమెరికా కన్ను ఎందుకు? ఆర్కిటిక్ ప్రాంతంలో విలువైన ఖనిజాలు ఉన్నాయి, అక్కడి సర్వేలో తేలిన 34 రకాల్లో 25 విలువైన ఖనిజ జాబితాలో ఉన్నాయి. నౌకా రవాణా మార్గంగా ఉండటం, మిలిటరీ రీత్యా కీలక ప్రాంతం కావటంతో దాన్ని తన ఆధిపత్యంలోకి తెచ్చుకోవాలని, చైనా, రష్యాలను మరింతగా ఇబ్బంది పెట్టాలన్నది అసలు లక్ష్యం.ఇదే జరిగితే ఐరోపా భద్రత, ప్రపంచ రాజకీయాల మీద ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. గ్రీన్ లాండ్ భౌగోళికంగా ఉత్తర అమెరికాలో ఉంది, ఐరోపాలోని డెన్మార్క్‌లో భాగం అయినప్పటికీ స్వయం పాలిత ప్రాంతంగా ఉన్న ప్రపంచంలోని పెద్ద దీవి. జనాభా కేవలం అరవై వేలలోపే, వారు కూడా ఎక్కువగా చేపలవేట మీదే ఆధారపడుతున్నారు. ఈ ప్రాంతంలో మిలిటరీ కార్యకలాపాల నిర్వహణకు డెన్మార్క్‌తో అమెరికా రక్షణ ఒప్పందాలు చేసుకుంది. పర్యావరణ మార్పులతో మంచు కరిగిపోతుండటంతో నూతన నౌకా మార్గాలు ఏర్పడ్డాయి.ప్రయాణ దూరం తగ్గింది,ముడి చమురు, గ్యాస్, విలువైన ఖనిజాల వంటి లక్షల కోట్ల డాలర్ల విలువగల సహజవనరుల వెలికితీతకు మార్గం ఏర్పడింది.మిలిటరీ నిఘా కూడా పెరిగింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ ఆక్రమణను నిరోధించేందుకు అమెరికా ప్రవేశానికి డెన్మార్క్ అనుమతించింది.ఈ ప్రాంతాన్ని తమకు అమ్మాలని 1946లోనే వాషింగ్టన్ ప్రతిపాదించినప్పటికీ అంగీకరించలేదు.
ఉత్తర అమెరికా, ఐరోపా, ఆసియాలను దగ్గర చేసేందుకు సూయజ్ కాలువ మీదుగా కంటే ఆర్కిటిక్ ప్రాంతం అనువుగా ఉండటం, దూరం తగ్గటం, సమయం, ఖర్చు కూడా తగ్గుతుం డటంతో ఇటీవలి కాలంలో నౌకా రవాణా పెరిగింది. చైనా, రష్యా నౌకలు సంచరిస్తున్నాయి. రష్యా నుంచి చైనాకు చమురు రవాణాకు ప్రత్యామ్నాయ నౌకా మార్గంగా ఈ ప్రాంతాన్ని ఎంచుకోవాలని చూస్తున్నారు. ఆ నౌకల మీద నిఘాపెంచాలంటే అమెరికన్లకు ఈ దీవి ఎంతో అనువుగా ఉంటుంది.దీనితో పాటు ఉపగ్రహాలకూ అనువైన ప్రాంతం. ప్రస్తుతం కొన్ని రంగాలకు చమురు, బంగారం కంటే విలువైన ఖనిజాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. చైనా వీటిపై తొంభైశాతం అదుపు కలిగి ఉంది, ఎవరు తోక ఝాడించినా వాటి ఎగుమతులు నిలిపివేసి ప్రతీకారం తీర్చుకుంటున్నది.అమెరికా కూడా దాని మీద ఆధారపడి ఉండటంతో ఎక్కడ అలాంటి వనరులుంటే వాటిని సొంతం చేసుకొనేందుకు అమెరికా పూనుకుంది. లిథియం, కోబాల్ట్, చమురు, గ్యాస్ పుష్కలంగా ఉన్నాయి.
నిజంగా గ్రీన్‌లాండ్ ఆక్రమణకు పూనుకుంటే ఐరోపా ఎలా స్పందిస్తున్న అంశాన్ని ఇప్పుడు అమెరికా మదింపు వేస్తున్నది. నాటో ప్రారంభ దేశాలలో డెన్మార్క్ ఒకటి. ఇప్పుడు దాని స్వయం పాలిత ప్రాంతాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకోవటం అంటే నిబంధనలకు విరుద్దం. నాటో దేశాలన్నీ దాన్ని ఎదుర్కోవాలని నిబంధన ఉంది. అయితే గతంలో టర్కీ-గ్రీస్ మధ్య తలెత్తిన వివాదంలో నాటో నాయకత్వం చేసిందేమీ లేదు. ఇప్పుడు కూడా అదే పునరావృతం అవుతుందా? ఆదివారంబ్రిటన్,జర్మనీ నాయకత్వంలో కొన్ని దేశాల ప్రతినిధులు సమావేశమై ఆర్కిటిక్ ప్రాంత భద్రత గురించి మరింత సమన్వయంతో పని చేయాలని నిర్ణయించినట్లు వార్తలు. ఒక దేశసార్వభౌమత్వానికి వ్యతిరేకంగా అమెరికా చేసిన వ్యాఖ్యల పూర్వరంగంలో అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని కెనడా కూడా కోరింది. అయితే ముసుగులో కుమ్ములాట మాదిరి తప్ప నేరుగా అమెరికాను విమర్శించటానికి ఇంకా ముందుకు రావటం లేదు. తాము అమెరికన్లుగా మారటానికి సిద్ధంగా లేమని గ్రీన్‌లాండ్ ప్రధాని జేన్స్ ఫ్రెడరిక్ నీల్సెన్‌తో సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక ప్రకటన చేశాయి. తమ భవిష్యత్‌ను తామే నిర్ణయించుకుంటామని స్పష్టం చేశాయి.ఆర్కిటిక్ ప్రాంతంలో తమ వ్యతిరేకులను అడ్డుకోవటానికి ప్రాధాన్యత ఇస్తామని అమెరికా అధ్యక్ష భవనం కొద్ది రోజుల క్రితం ప్రకటించింది.అంతకు ముందు జనవరి నాలుగున ట్రంప్ స్వయంగా మాట్లాడుతూ గ్రీన్‌లాండ్ ప్రాంతంలో రష్యా, చైనా నౌకలు తిరుగుతున్నందున తమ జాతీయ భద్రతా అవసరాల రీత్యా ఆ ప్రాంతం తమకు కావాలని చెప్పాడు. ఎలా స్వాధీనం చేసుకోవాలా అన్నది అధ్యక్షుడు తన బృం దంతో చర్చిస్తున్నాడని, మిలిటరీ వినియోగ అవకాశం ఎప్పుడూ ఉంటుందని అధ్యక్ష భవన ప్రకటన తేటతెల్లం చేసింది. 1979 నుంచి గ్రీన్‌లాండ్ డెన్మార్క్‌లో స్వయంపాలిత ప్రాంతంగా ఉంది, ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత స్వాతంత్య్రం ప్రకటించుకొనే అవకాశం కూడా 2009 నుంచి దానికి వచ్చింది. అయితే ఇంతవరకు అలాంటి నిర్ణయం తీసుకోలేదు.నిజానికి ట్రంప్ 2019లోనే గ్రీన్‌లాండ్ స్వాధీనం గురించి చెప్పాడు. ట్రంప్ వ్యాఖ్యలు వెలువడిన జనవరి నాలుగునే డెన్మార్క్ ప్రధాని మెటీ ఫ్రెడరిక్సన్ ఖండించారు. డెన్మార్క్ రాజరికంలోని మూడు ప్రాంతాలలో ఏ ఒక్కదానిని విలీనం చేసుకొనే హక్కు అమెరికా లేదని ఆమె పేర్కొన్నారు. ఫారో దీవి కూడా గ్రీన్‌లాండ్ వంటిదే అన్నారు, మరో దేశంగానే గాక చారిత్రకంగా సన్నిహితంగా ఉన్న దేశం మీద అమెరికా ఇలాంటి కోరికలను వెలిబుచ్చటం తగదన్నారు.
అమెరికా విస్తరణ కాంక్ష ఒక్క గ్రీన్‌లాండ్‌కే పరిమితం కాదు. కెనడా తమ 51వ రాష్ట్రం కావాలని గతంలోనే ట్రంప్ కోరిన సంగతి తెలిసిందే. అందువలన కెనడియన్లు కూడా అప్రమత్తం కావాలని అనేక మంది హెచ్చరిస్తున్నారు. గ్రీన్‌లాండ్‌తో పోల్చితే కెనడా పక్కనే ఉంటుంది, అక్కడ కూడా సహజ సంపదలు పుష్కలంగానే ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచంలో అధిక చమురు నిల్వలున్న దేశాల్లో నాలుగవదిగా ఉంది. బ్రిటన్ నుంచి రెండు దేశాలూ స్వాతంత్య్రం పొందినవే. గత రెండువందల సంవత్సరాల్లో లాటిన్ అమెరికాలో అమెరికన్లు జరపని కుట్ర లేదు, అనేక ప్రభుత్వాలను కూల్చివేశారు, అనేక మందిని హత్య చేయించారు. మొత్తం పశ్చిమార్ధగోళం తమకిందే ఉండాలని పదే పదే చెబుతున్న సంగతి తెలిసిందే. చరిత్రలోకి చూస్తే కెనడాను ఆక్రమించుకొనేందుకు అమెరికా 1812లోనే ప్రయత్నిం చింది.1939వరకు కెనడాను ఆక్రమించాలనే మిలిటరీ వ్యూహాన్ని కొనసాగించి తర్వాత ఉపసంహరించుకుంది, ట్రంప్‌కు ఆ గతం గుర్తుకు వచ్చి ఉంటుంది. కెనడా వర్తమాన చరిత్రను చూస్తే అన్ని అంశాల్లోనూ అమెరికాతో కలసి అనేక దాడుల్లో భాగస్వామిగా ఉంది.నాటో కూటమిలో కూడా చేరింది.అయితే కొన్ని సందర్భాలలో అమెరికా వైఖరితో విబేధించింది. అణ్వాయుధాల మోహరింపుకు అంగీకరించలేదు, వియత్నాంపై యుద్ధాన్ని అంగీకరించలేదు. క్యూబా విషయంలో కూడాసానుకూలంగా ఉంది.చివరికి తన ప్రయోజనాలను ఫణంగా పెట్టి అమెరికా రుద్దిన ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో మెక్సికోతో కలసి భాగస్వామి అయింది.గల్ఫ్‌వార్‌లో అమెరికాతో కలసి పనిచేసింది.వీటితో పాటు కొన్ని మిత్రబేధాలు ఉన్నాయి. అందుకే తాజా పన్ను ఉగ్రవాదాన్ని ట్రంప్ కెనడాకూ విస్తరించాడు.ఈ పూర్వరంగంలో చూసినపుడు గ్రీన్ లాండ్‌ను ఆక్రమించుకుంటే ఐరోపా,మిగతా ప్రపంచం ఎలా స్పందిస్తుందో చూసిన తర్వాత కెనడాను కూడా తనదారికి తెచ్చుకుంటుందా? చూద్దాం!
ఎం కోటేశ్వరరావు 8331013288



