నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికాకు 17 లక్షల కోట్ల రూపాయలతో (175 బిలియన్ డాలర్లు) ‘గోల్డెన్ డోమ్’ను నిర్మిస్తున్నట్లు మంగళవారం ట్రంప్ ప్రకటించారు. రక్షణ వ్యవస్థ కోసం అంతరిక్షంలో (స్పేస్) ఆయుధాన్ని మోహరించే తొలి దేశంగా అమెరికా నిలుస్తుంది. ట్రంప్ పదవి పూర్తయ్యే లోపు అంటే మూడేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు. గోల్డెన్ డోమ్ అనేది అత్యాధునిక రక్షణ వ్యవస్థ. భూమిపైనే కాకుండా అంతరిక్షం (స్పేస్) లో ఏర్పాటు చేసిన షీల్డ్ (కవచం). మిస్సైల్స్, డ్రోన్స్ ను గుర్తించి వెంటనే టార్గెట్ చేసి కూల్చేసే సామర్థ్యం ఉంటుంది. అవి భూమిని చేరకముందే గాలిలోనే.. ఆకాశంలోనే కూల్చేస్తుంది ఈ డోమ్ డిఫెన్స్ సిస్టం.
మరోవైపు గోల్డెన్ డోమ్ నిర్మాణంపై ఇప్పటికే చైనా, రష్యా వ్యతిరేకిస్తున్నాయి. అమెరికా నిర్ణయం అంతరిక్షాన్ని కూడా యుద్ధక్షేత్రంగా మార్చేలా ఉందని మండిపడ్డాయి. స్పేస్ లో యుద్ధ విన్యాసాల వలన రానున్న రోజుల్లో చాలా నష్టాలు వచ్చే అవకాశం ఉందని.. దేశాల మధ్య పోటీతో అన్ని దేశాలు ఇలా నిర్మించుకుంటూ పోతే.. చివరికి ప్రపంచ వినాశనానికి దారితీసే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాయి.