Saturday, July 26, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఅమెరికా బెదిరింపుల బిల్లు వెనక్కు!

అమెరికా బెదిరింపుల బిల్లు వెనక్కు!

- Advertisement -

భారత్‌, బ్రెజిల్‌, చైనా, రష్యాలను బెదిరించే ఆంక్షలు, పన్నుల బిల్లును పక్కన పెట్టాలని అమెరికా నిర్ణయించింది. పార్లమెంటు ఎగువసభ వందమంది ఉండే సెనెట్‌లో ఉన్న రిపబ్లికన్లు, వారితో చేతులు కలిపిన ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన వారితో సహా 85 మంది దీన్ని ప్రవేశపెట్టారు.తాను అధికారానికి వచ్చిన 24 గంటల్లోపు ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని పరిష్కరిస్తానని ప్రగల్భాలు పలికిన డోనాల్ట్‌ ట్రంప్‌ చేతగాక వెల్లకిలా పడ్డాడు. నిజానికి దాన్ని సృష్టించిందే అమెరికా, దానికి తానతందాన అనే పశ్చిమదేశాల వారన్నది జగమెరిగిన సత్యం.నిజంగానే పోరు ముగించేందుకు ట్రంప్‌ తన పలుకుబడిని వినియోగిస్తాడని నమ్మినవారు కూడా లేకపోలేదు. ఈ క్రమంలో ట్రంప్‌ వేసిన అనేక పిల్లిమొగ్గల్లో 500శాతం పన్ను విధిస్తానన్న బిల్లు ఒకటి. మిలిటరీ చర్య నిలిపివేయా లంటూ జూలై 14న డోనాల్డ్‌ ట్రంప్‌ రష్యాకు యాభై రోజుల గడువు విధించిన సంగతి తెలిసిందే. ఆ వ్యవధి ముగిసే వరకు వేచి చూడాలనే సాకుతో ముందుకు పోరా దని నిర్ణయించినట్లు చెప్పినప్పటికీ పరువుపోవటం తప్ప సదరు ఆంక్షలను ఎవరూ ఖాతరు చేయరని అవగతం కావటమే వెనుక ఉన్న అసలు కారణం.

దిక్కుతోచని స్థితిలో ఏం చేయాలో పాలుపోక 50రోజుల గడువు ముగిసేలోగా మరో కొత్త ఎత్తువేసేందుకు తాత్కాలికంగా బిల్లును పక్కన పెట్టారని చెప్పవచ్చు. పదే పదే హెచ్చరికలు చేస్తే నిజం చెప్పినా నమ్మని స్థితి ఏర్పడింది. అందుకే తన బదులు నాటో ప్రధాన కార్యదర్శి మార్క్‌ రూటే, తాజాగా బిల్లు ప్రధాన రూపకర్త, తన అనుచరుడు సెనెటర్‌ లిండ్సే గ్రాహమ్‌ను ట్రంప్‌ రంగంలోకి దించాడు. ‘మా నేతతో పెట్టుకుని స్వయంగా పెద్ద ఆపదకొని తెచ్చుకున్నావ్‌, మీ ఆర్థిక వ్యవస్థను నలిపేస్తాం, ఉక్రెయిన్‌కు ఆయుధాలను అందచేస్తున్నాం, మీ అంతం చూస్తాం’ అంటూ పుతిన్‌ను ఉద్దేశించి ఒక టీవీ సంభాషణలో గ్రాహమ్‌ వ్యాఖ్యానించాడు. మొగుడు ఏదో అంటే చివరికి ముష్టివాడు కూడా అదే అన్నాడన్న సామెత మాదిరి చివరికి గ్రాహమ్‌ కూడా చైనా, భారత్‌, బ్రెజిల్‌ను బెదిరించేందుకు పూనుకున్నాడు. తమ అధ్యక్షుడు చెప్పినట్లు వినకపోతే మూడు దేశాల ఆర్థిక వ్యవస్థలను నలిపివేస్తామంటూ చిందులు వేశాడు, రష్యాతో సంబంధాలు వదులుకోకపోతే వంద, అంతకంటే ఎక్కువ శాతం పన్నులు వేస్తామని బెదిరించాడు. మనకు మిత్రుడిగా నటించే ట్రంప్‌ అండదండలు, కనుసైగలు లేకుండా ఒక సెనెటర్‌ అలా బరితెగిస్తాడని అనుకోలేము.ట్రంప్‌ అన్నమాటలనే ఖండించేందుకు నోరురాని మన బలహీనత చివరికి ఒక పార్లమెంటు సభ్యుడిని కూడా విమర్శించలేని స్థితిలోకి నెట్టేసింది.

ఉక్రెయిన్‌ సంక్షోభం గురించి రష్యా వేసుకున్న అంచనాలు ఒకటైతే పశ్చిమదేశాల అంచనాలు మరొకటి. తనకున్న అస్త్రశస్త్రాలతో ఉక్రెయిన్‌ను కొద్ది రోజుల్లోనే దారికి తేవచ్చు అనుకున్న పుతిన్‌ పశ్చిమదేశాలు అందించే నిఘా సమాచారం, ఆధునిక ఆయుధాలు, ఆర్థిక సాయం గురించి వేసిన అంచనాలు తప్పాయి. తమ ఆయుధాలతో రష్యాను వెనక్కు కొట్టవచ్చన్న పశ్చిమదేశాల అంచనా కూడా తప్పింది. పంథా మార్చిన పుతిన్‌ మిలిటరీ చర్యను కొనసాగిస్తూ మెల్లమెల్లగా ఉక్రెయిన్‌ ప్రాంతాలను అదుపులోకి తెచ్చుకుంటున్నాడు. కొరకరాని కొయ్యగా మారాడు. ఆగస్టు ఒకటవ తేదీలోగా తాము చెప్పినట్లు తమతో వాణిజ్య ఒప్పందాలకు రావాలని ట్రంప్‌ ప్రపంచాన్ని రెండవసారి బెదిరించినా నాటి నుంచి ఎలాంటి స్పందన లేదు. బ్రిక్స్‌లో ఉన్న మూడు నాలుగు ప్రధాన దేశాలను బెదిరిస్తే మిగతావి భయపడిపోతాయని ట్రంప్‌ ఊహించినట్లు ఉన్నాడు. చైనాతో ఒప్పందం కుదిరిందని చెప్పినప్పటికీ అమెరికా ఎంత వెనక్కు తగ్గితే చైనా కూడా అంతమేరకే ప్రతిస్పందిస్తోంది. మన దేశం మీద తీవ్రఒత్తిడి తీసుకువస్తున్నాడు, జూలై తొమ్మిది గడువు ముగిసింది, రెండవది కూడా సమీపిస్తున్నది. ఒప్పందం కోసం మన ప్రతినిధులు వెంపర్లాడుతూ ఒకటికి రెండుసార్లు బతిమిలాడుతూ వాషింగ్టన్‌ వెళ్లి రావటం తప్ప వాణిజ్యలోటులో ఉన్న అమెరికన్లు ఢిల్లీ రాలేదు. కారణాలు ఏవైనా రష్యా మీద ఆంక్షల పేరుతో ప్రవేశపె ట్టిన అమెరికా బెదిరింపుల బిల్లు వెనక్కుపోయింది. అంత మాత్రాన ట్రంప్‌ తగ్గుతాడని భావిస్తే పొరపాటే. కలసి ఉంటే కలదు సుఖం అన్నట్లుగా అతగాడి మెడలు వంచాలంటే చైనా, భారత్‌, రష్యా, బ్రెజిల్‌ కలసి వచ్చే ఇతరదేశాలతో ఉమ్మడిగా బుద్ధి చెప్పేందుకు ఆలోచించాలి.బలవంతుడైన సర్పము చలిచీమల చేతిలో చచ్చినట్లు అమెరికాకు బుద్ధి చెప్పాల్సిందే!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -