యుద్ధ ప్రభావం మన దేశంపై తీవ్ర ప్రభావం
నోరు మెదపని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు
నవతెలంగాణ – బోనకల్
ప్రపంచంలో చమురుపై ఆధిపత్యం కోసమే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ పై దాడులు చేస్తున్నాయని, ఈ దాడులపై మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ నోరు మెదపకపోవడం విచిత్రమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు ఘాటుగా విమర్శించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం లోని బోనకల్ మండల కేంద్రంలో గల వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల భవనంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సమావేశం పిల్లలమర్రి వెంకట అప్పారావు అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరాన్ పై యుద్ధం వలన మన దేశంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. గ్యాస్ ధరను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పెంచిందన్నారు. యుద్ధము వలన తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ కొరత తీవ్రంగా ఏర్పడిందన్నారు. అనేక హోటల్లు మూతపడ్డాయన్నారు. వేలాది మది కార్మికులు జీవనోపాధి కోల్పోతున్నారన్నారు.
మన దేశానికి హర్మూర్ జలసంధి నుంచి నౌకల ద్వారా క్రూడ్ ఆయిల్ వస్తుందన్నారు. ఈ యుద్ధం వలన ఇరాన్ హర్మూర్ జలసందిని మూసివేసిందన్నారు. ఈ యుద్ధం వలన అమెరికాకే లాభం తప్ప ఏ దేశానికి లాభం లేదన్నారు. అమెరికా ఆదిపత్యం కోసమే ప్రపంచంలో చమురు దేశాల గలిగిన దేశాలపై యుద్ధానికి పాల్పడుతుందని విమర్శించారు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు చేయటం వలన అమెరికా ఇజ్రాయిల్ మిత్ర దేశాలపై ఇరాన్ దాడులు చేస్తుందని దీనివలన అమెరికా, ఇజ్రాయిల్ మిత్రదేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి అన్నారు. ఈ యుద్ధం వలన ప్రపంచంలో అన్ని దేశాలపై ప్రభావం చూపటంతో అనేక దేశాలు ఆందోళనలు చెందుతున్నాయి అన్నారు. ఈ యుద్ధం పై ప్రపంచంలో అనేక దేశాలు తమ వైఖరిని స్పష్టం చేస్తున్నప్పటికీ కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎటువంటి ప్రకటనలు చేయకపోవడం బాధాకరమన్నారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు లొంగి నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మనదేశ సార్వభౌమాధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి తాకట్టు పెడుతున్నాడని ఘాటుగా విమర్శించారు. మనదేశ నిర్ణయాలను సైతం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించడం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతగానితనానికి నిదర్శనం అన్నారు. మన దేశం ఏ దేశం నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవాలో డోనాల్డ్ ట్రంప్ నిర్ణయం చేస్తున్నారని, ఈ నిర్ణయం ప్రకారమే బిజెపి ప్రభుత్వం నడుస్తుందని ఘాటుగా విమర్శించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ(ఎం) నిరంతరం పోరాటాలు నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, చింతలచెరువు కోటేశ్వరరావు డివిజన కార్యదర్శి మడిపల్లి గోపాలరావు, మండల కార్యదర్శి కిలారి సురేష్, నాయకులు దొండపాటి సత్యనారాయణ, కొమ్మినేని నాగేశ్వరరావు, జొన్నలగడ్డ సునీత, గుడ్డురి ఉమ, పసుపులేటి నరేష్, నోముల పుల్లయ్య, తెల్లాకుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.



