మోహరిస్తున్న యూఎస్ సైన్యం
యురేనియం శుద్ధి మొదలుపెడితే దాడి : ట్రంప్
మా వేలు ట్రిగ్గర్‌పైనే : ఇరాన్
ఇరాన్ యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభిస్తే సైనిక దాడి తప్పదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికతో మధ్యప్రాచ్యం తీవ్ర ఉద్రిక్తతలోకి జారింది. గల్ఫ్ ప్రాంతం వైపు భారీగా అమెరికా యుద్ధనౌకలు కదులుతున్నాయన్న ప్రకటన యుద్ధం ఊహ కాదని, సమీపిస్తున్న వాస్తవమని భావింపజేస్తోంది. దీనికి ప్రతిగా ‘మా వేలు ట్రిగ్గర్ పైనే ఉంది’ అంటూ ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించడంతో మాటల యుద్ధం సైనిక ఘర్షణ అంచుకు చేరింది. ఇది కేవలం అమెరికా-ఇరాన ల మధ్య ఘర్షణ మాత్రమే కాదు.
ఇజ్రాయిల్ భద్రత, గల్ఫ్ చమురు మార్గాలు, ప్రపంచ ఇంధన ధరలు ఈ ఉద్రిక్తతతో నేరుగా ముడిపడి ఉన్నాయి. అణు ఒప్పందం నుంచి ఏకపక్షంగా తప్పుకున్న అమెరికానే ఈ సంక్షోభానికి మూలమని ఇరాన్ ఆరోపిస్తుండగా, అణ్వస్త్రాల ముప్పు పేరుతో ఒత్తిడి పెడుతున్న అమెరికా వైఖరి వెనుక ప్రాంతీయ ఆధిపత్య రాజకీయాలున్నాయనే విమర్శలు పెరుగుతున్నాయి. యుద్ధనౌకల మోహరింపు, పరస్పర హెచ్చరికలు కలిసి రాజనీతికి అవకాశం లేకుండా చేసి బలప్రయోగాన్ని ముందుకు నెడుతున్న వేళ, ఒకసారి యుద్ధం మొదలైతే అది ఇరాన్‌తో మాత్రమే ఆగదన్న భయం ప్రపంచాన్ని వెంటాడుతోంది.
టెహ్రాన్ : మధ్యప్రాచ్యంలో యుద్ధ ఛాయలు అలుముకుంటున్నాయి. వెనిజులాపై దురాక్రమణకు పాల్పడటమే కాదు. ఆ దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేసిన ట్రంప్ తన ఆధిపత్యం చెలాయించటానికి సిద్ధ మవుతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. వెనిజులా డ్రగ్స్ సరఫరా చేస్తున్నదంటూ..అక్కడి చమురు నిక్షేపాలపై కన్నేసిన అమెరికా అధ్యక్షుడు..ఇపుడు ఇరాన్ యురేనియం శుద్ధి మొదలుపెడితే దాడి చేస్తామని బెదిరింపులకు గురిచేస్తున్నారు. దీంతో అమెరికా – ఇరాన్‌ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. పెద్దసంఖ్యలో అమెరికా యుద్ధ నౌకలు ఇరాన్ దిశగా కదులుతున్నాయని ప్రెసిడెంట్ ట్రంప్ వెల్లడించగా, తమ వేలు ట్రిగ్గర్‌పైనే ఉందని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్ జీసీ) హెచ్చరించింది. ఇరాన్‌పై సైనిక చర్యను చేపట్టే ఆప్షన్ కూడా తమ ఎదుట ఉందని ట్రంప్ మొదటి నుంచే చెబుతున్నారు. ఈనేపథ్యంలో ఇప్పుడు మరోసారి ఇరుదేశాలు పరస్పర హెచ్చరికలు చేసుకున్నాయి. దీంతో మళ్లీ అమెరికా – ఇరాన్, ఇరాన్ – ఇజ్రాయిల్ సైనిక ఘర్షణ జరుగుతుందనే ప్రచారానికి బలం చేకూరుతోంది.
ఇరాన్ వైపుగా పెద్దసంఖ్యలో మా యుద్ధనౌకలు : ట్రంప్
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సదస్సుకు హాజరైన అమెరికా అధ్యక్షుడు అక్కడి నుంచి అమెరికాకు బయలుదేరే ముందు మీడియాకు కీలక వివరాలను వెల్లడించారు. అమెరికా సైన్యం పెద్దసంఖ్యలో యుద్ధ నౌకలపై గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ వైపుగా కదులుతోందని అన్నారు. ఏమీ జరగకుండా ఆపడమే తనకు ఇష్టమని, తాము ఇరాన్‌ను చాలా నిశితంగా పరిశీలిస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులను చంపడాన్ని ఇక ఆపాలని ఆయన ఇరాన్‌ను మరోసారి హెచ్చరించారు. అణ్వస్త్ర కార్యక్రమాన్ని మళ్లీ మొదలుపెట్టాలనే ఆలోచనను కూడా పక్కనపెట్టాలని ఇరాన్‌కు ట్రంప్ హితవు పలికారు.
ఇరాన్‌ను కట్టడి చేయడానికే ఈ మోహరింపు తప్ప, సైనిక చర్య కోసం కాదని స్పష్టం చేశారు. ఒకవేళ యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని ఇరాన్ మళ్లీ మొదలుపెడితే, అమెరికా తప్పక స్పందిస్తుందని ఆయన తేల్చి చెప్పారు. ఇరాన్‌లోని ఏ ప్రదేశంలో యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించినా, అక్కడికి వెళ్లి దాడి చేస్తామన్నారు. తన హెచ్చరికల తర్వాత దాదాపు 840 మంది నిరసన కారులను ఉరి తీయడాన్ని ఇరాన్ ఆపిందన్నారు. ఒకవేళ ఆ నిరసనకారులను ఇరాన్ ఉరితీస్తే, మును పెన్నడూ జరగనంత తీవ్రదాడిని ఇరాన్‌పై చేస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని చిన్నాభిన్నం చేసేలా తమ దాడి ఉంటుందన్నారు.
అమెరికా సైనిక స్థావరాల రక్షణ కోసమే
ట్రంప్ తాజా ప్రకటనను అమెరికా అధికార వర్గాలు సైతం ధ్రువీకరించాయి. యుద్ధ విమానాలతో కూడిన యూఎస్ అబ్రహం లింకన్ యుద్ధ నౌక, పలు గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయర్లు త్వరలోనే పశ్చిమాసియా ప్రాంతంలోకి చేరుకుంటాయని వెల్లడించాయి. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఉన్న అమెరికా సైనిక స్థావరాలు, సైనిక దళాల రక్షణ కోసం గల్ఫ్ సముద్ర జలాల్లో ఈ అదనపు గగనతల రక్షణ వ్యవస్థలను అమెరికా మోహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ సైనిక ఘర్షణ మొదలైతే, ఇరాన్ క్షిపణి దాడుల నుంచి తమ సైనిక స్థావరాలకు రక్షణ కల్పించేందుకే ఈ ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.
అమెరికా దాడి చేస్తే, మా ప్రతిదాడి ధర్మబద్ధమైందే
”ఈసారి మా దేశంపై అమెరికా దాడి చేస్తే ఊరుకోం. పశ్చిమాసియా ప్రాంతంలో ఉన్న అన్ని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేస్తాం. అమెరికా ప్రభావం కలిగిన అన్ని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటాం. అమెరికా విషయంలో మా ప్రతిదాడిని ధర్మబద్ధమైందిగా, సక్రమమైందిగా పరిగణించాల్సి ఉంటుంది. అమెరికా ఆచితూచి స్పందిస్తే మంచిది” అని ఇరాన్‌కు చెందిన హై ర్యాంకింగ్ మిలిటరీ అధికారి జనరల్ అలీ అబ్దుల్లాహీ ఆలియాబాదీ హెచ్చరించారు.
నిరసనకారుల్లో 2,427 మంది అమరులు : ఇరాన్
ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై ఇరాన్ సర్కారు తాజాగా అధికారిక వివరాలను విడుదల చేసింది. దీని ప్రకారం నిరసనల్లో దాదాపు 3,117 మంది చనిపోయారు. వారిలో 2,427 మంది అమరులు అని ఇరాన్ ప్రభుత్వానికి చెందిన ఫౌండేషన్ ఫర్ మార్టైర్స్ అండ్ వెటరన్స్ వెల్లడించింది. అమరుల కేటగిరీలో ఇరాన్ భద్రతా బలగాల సభ్యులు, అమాయక ప్రజలు ఉన్నారని తెలిపింది.
ఈసారి దాడి చేస్తే తీవ్ర పర్యవసానాలు : ఇరాన్
అమెరికాకు ఇరాన్ కీలక హెచ్చరిక చేసింది. గల్ఫ్ సముద్ర జలాల్లో అమెరికా సైనిక మోహరింపులను నిశితంగా పరిశీలిస్తున్నామని వెల్లడించింది. తమ వేలు ట్రిగ్గర్‌పైనే ఉందని ఇరాన్ ఐఆర్‌జీసీ కమాండర్ మహ్మద్ పక్పౌర్ వార్నింగ్ ఇచ్చారు. తప్పుడు అంచనాలతో ఇరాన్‌పై దాడులు చేస్తే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా, ఇజ్రాయిల్‌లు తెలుసుకోవాలన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ నుంచి ఆదేశాలు అందిన మరుక్షణమే తాము శత్రువులపై విరుచుకుపడతామని తేల్చి చెప్పారు. మునుపెన్నడూ లేని రీతిలో ఈసారి తాము సైనిక ఘర్షణకు సిద్ధంగా ఉన్నామని మహ్మద్ పక్పౌర్ తెలిపారు.
ట్రంప్ చెప్పేదంతా అబద్ధం : ఇరాన్
నా వల్లే ఇరాన్‌లో 800లకు పైగా నిరసకారుల మరణశిక్షలు ఆగాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ న్యాయవ్యవస్థకు చెందిన ప్రముఖ ప్రాసిక్యూటర్ మొహమ్మద్ మొవాహెది స్పందించారు. అవన్నీ అబద్ధాలని తెలిపారు. నిరసనకారులకు సామూహిక మరణ శిక్ష విధించాలనే నిర్ణయాన్నే తమ ప్రభుత్వం తీసుకోలేదన్నారు. ఎవరికీ ఉరిశిక్షలు విధించలేదని తెలిపారు. అరెస్టు చేసిన వారి సంఖ్య కూడా అంత మొత్తంలో లేదన్నారు. దీనిపై తప్పుడు వార్తలు, ప్రకటనలను ప్రచారం చేయొద్దని అంతర్జాతీయ మీడియా వర్గాలకు సూచించారు.



