Tuesday, March 17, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఅమెరికా యుద్ధోన్మాదాన్ని ఆపాలి

అమెరికా యుద్ధోన్మాదాన్ని ఆపాలి

- Advertisement -

మోడీ అసమర్థతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
నారాయణగూడ నుంచి వైఎంసీఏ వరకు వామపక్షాల నిరసన ప్రదర్శన
ట్రంప్‌, నెతన్యాహు ఫొటోల దహనం
బీవీ. రాఘవులు, జాన్‌వెస్లీ, నారాయణ, కూనంనేని హాజరు

నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రపంచ దేశాలపై ఆధిపత్యమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షులు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌పై తలపెట్టిన యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలని వామపక్షాలు డిమాండ్‌ చేశాయి. ఈ విషయం లో భారత ప్రధాని మోడీ అమెరికాకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేయాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండ్‌ చేశారు. 140 కోట్ల మంది ప్రజలకు ప్రతినిధిగా ఉన్న ప్రధాని అసమర్థత కారణంగా ప్రజలందరూ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడులు, ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చెలాయించేందుకు ఆ దేశం యుద్ధోన్మాద ధోరణిని నిరసిస్తూ వామపక్ష పార్టీలు సోమవారం హైదరాబాద్‌లో భారీ నిరసన ర్యాలీ నిర్వహించాయి.

నారాయణగూడ చౌరస్తా నుంచి వైఎంసీఎ వరకు జరిగిన ఈ ప్రదర్శనలో సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ తదితర వామపక్షాల నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శనను ఉద్దేశించి సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, సీపీఐ జాతీయ కంట్రోల్‌ కమిషన్‌ చైర్మెన్‌ డాక్టర్‌ కె.నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ.టి.నరసింహా తదితరులు ప్రసంగించారు. అంతకుముందు ట్రంప్‌, నెతన్యాహు ఫొటోలను దహనం చేశారు.

ప్రధాని మోడీ వైఖరి బానిసత్వం : జాన్‌వెస్లీ
అమెరికా సామ్రాజ్యవాదానికి మోడీ సర్కారు దాసోహమవడం దేశ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. భగత్‌సింగ్‌ వంటి వీరులు సాధించిన స్వాతంత్య్రాన్ని, దేశ ఆత్మగౌరవాన్ని మోడీ ప్రభుత్వం తాకట్టు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధాలకు మద్దతివ్వడం మానేసి, ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని డిమాండ్‌ చేశారు.

డాలర్‌ పెత్తనం కోసమే యుద్ధాలు : కూనంనేని సాంబశివరావు
ప్రపంచవ్యాప్తంగా డాలర్‌ పెత్తనం కొనసాగాలనే దురుద్దేశంతోనే అమెరికా నిరంతరం యుద్ధాలను ప్రేరేపిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇది అప్రకటిత మూడో ప్రపంచ యుద్ధంగా మారుతోందని, ప్రధాని మోడీ మౌనం వీడి అమెరికాకు వ్యతిరేకంగా గళం విప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ యుద్ధంపై శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో చర్చించాలని బీఏసీలో ప్రస్తావించినట్టు తెలిపారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దాడి : డాక్టర్‌ కె.నారాయణ
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్వాధీనం చేసుకునేందుకే అమెరికా ఈ యుద్ధాన్ని తలపెట్టిందని సీపీఐ జాతీయ కంట్రోల్‌ కమిషన్‌ చైర్మెన్‌ డాక్టర్‌ కె.నారాయణ విమర్శించారు. ఈ యుద్ధం వల్ల రైతులు, వ్యాపారులు, విదేశాల్లో ఉన్న భారతీయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ సమయంలో ప్రధాని మోడీ ఏమీ పట్టనట్టు వ్యవహరించడం సరికాదని, అమెరికాపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

యుద్ధం ముందస్తు ప్లాన్‌
బీవీ. రాఘవులు
ఇరాన్‌పై అబద్ధపు ప్రచారాలతో అమెరికా యుద్ధాన్ని ప్రారంభించిందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు అన్నారు. అణ్వాయుధాల సాకుతో ఇరాన్‌ను అణచివేయడమే అమెరికా లక్ష్యంగా పెట్టు కుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉద్రిక్తతల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలా కుతలమవుతోందని, పెట్రోల్‌, గ్యాస్‌ కొరత వల్ల ధరల పెంపు ద్వారా సామాన్యులపై భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాస్‌ కొరతతో దేశ ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూస్తున్నామని అన్నారు. విదేశీ శక్తుల ముందు మోకరి ల్లకుండా, భారతదేశం తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కాపాడుకోవాలని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -