ఓటర్ల జాబితాల్లో అవకతవకలపై చర్చ జరపాలని రాహుల్ డిమాండ్
ప్రతిపక్షాలపై హోం మంత్రి ఎదురుదాడి
నిరసనగా లోక్‌సభ నుంచి ప్రతిపక్షాల వాకౌట్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా కేంద్ర హౌం మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య ”ఓట్ చోరీ” ఆరోపణలపై తీవ్ర వాగ్వాదం జరిగింది. బుధవారం లోక్‌సభలో ఎన్నికల సంస్కరణలపై చర్చ సందర్భంగా అమిత్ షా ప్రసంగాన్ని రాహుల్ గాంధీ అడ్డుకున్నారు. ఓటర్ల జాబితా ల్లో జరిగిన అవకతవకలపై ముందుగా చర్చ జరపాలని డిమాండ్ చేశారు. దీంతో అమిత్ షా ఎదురుదాడికి దిగారు. సభలో తాను ఏం మాట్లాడాలి.. అన్న దానిని ఎవరూ నిర్దేశించలేరని అన్నారు. ఓటర్ల జాబితా నవీకరణ, అర్హత కలిగిన ఓటర్ల నిర్ధారణ లక్ష్యంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) జరుగుతుందని అమిత్ షా తెలిపారు. ప్రతిపక్షాలు దీనిపై కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయని విమర్శించారు.
‘మీరు గెలిచినప్పుడు ఓటర్ల జాబితాలు కచ్చితంగా ఉంటాయి. మీరు కొత్త బట్టలు ధరించి ప్రమాణం చేస్తారు. కానీ బీహార్‌లో లాగా మీరు ఓడిపోయినప్పుడు ఓటర్ల జాబితాలో సమస్య ఉందని అంటారు. ఈ ద్వంద్వ ప్రమాణాలు పని చేయవు’ అని హౌం మంత్రి అమిత్‌షా అన్నారు. మరోవైపు ఓటర్ల జాబితాపై రాహుల్ గాంధీ నిర్వహించిన మీడియా సమావేశాలు, ఓటు చోరీని ‘హైడ్రోజన్ బాంబు’గా పేర్కొనడంపై ఆయన మండి పడ్డారు. ప్రతిపక్షనాయకుడు ‘ఓటు చోరీ’ గురించి మాట్లాడారు. అయితే కొన్ని కుటుంబాలు తరతరాలుగా ‘ఓటు దొంగలు’అంటూ పరోక్షంగా నెహ్రూ, ఇందిరాగాంధీ కు టుంబాలను ఆయన విమర్శించారు. సర్‌పై ప్రతిపక్షాలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయన్న అమిత్‌షా ఆరోపణలకు రాహుల్‌గాంధీ ధీటైన సమాధానం ఇచ్చారు.
కేంద్రం చేతుల్లో ఎన్నికల కమిషనర్ల నియామకం : రాహుల్‌గాంధీ
ఈ సందర్భంగా ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ దేశ చరిత్రలో తొలిసారిగా ఎన్నికల కమిషనర్ల నియామకం కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోయిందని, దీని వెనుక ఉన్న ఆలోచనను తమకు చెప్పాలని డిమాండ్ చేశారు. హర్యానాలో ప్రభుత్వం ఓటర్లను మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో 19 మంది నకిలీ ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. హర్యానా లాంటి అనేక ఉదాహరణలు ఉన్నాయని, తాను విలేకరుల సమావేశంలో లేవనెత్తిన అంశాలపై చర్చకు రావాలని రాహుల్‌గాంధీ సవాల్ విసిరారు. హౌంమంత్రి అమిత్ షా ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా, ప్రతిపక్షాలపై ఆయన ఎదురుదాడి వ్యాఖ్యలు సరికాదని అన్నారు. మరోపక్క అమిత్ షా ఎదురుదాడిపై ప్రతిపక్షాలు లోక్‌సభను వాకౌట్ చేశాయి.
ఓటు హక్కు ప్రభుత్వ దయ కాదు : కేసీ వేణుగోపాల్
ఓటు హక్కు ప్రభుత్వం దయ కాదని, ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రమని కాంగ్రెస్ సీనియర్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అన్నారు. నిష్పాక్షిక ఎన్నికల కోసం ఈసీని తీసుకొచ్చారని, అది ఇప్పుడు రాజకీయ ఒత్తిడి కారణంగా బహిరంగంగా కూలి పక్షపాతంగా మారిపోయిందని తెలిపారు. ‘ఓటు చోరీ’ దేశ వ్యతిరేక చర్యని, దానిని ఎన్నికల కమిషన్ అనుమతిస్తోందని విమర్శించారు. బీహార్‌లో ఓటర్ల జాబితాలో నుంచి భారీ ఎత్తున ఓటర్లను తొలగించారని అన్నారు. దాదాపు 65 లక్షల మంది ఓటర్లను తొలగించారని, 80 నియోజకవర్గాల్లో రికార్డు స్థాయిలో యువ మరణాలు (50 ఏండ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు) జాబితాలో ఉన్నాయని తెలిపారు.
సర్ అనేది ఎన్నార్సీలా బ్యాక్‌డోర్ వెర్షన్ అని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ముస్లింలను శాసనసభ్యులుగా కాకుండా ఓటర్లుగా కుదించారన్నారు. ఇటీవల మరణించిన బీఎల్‌ఓల బంధువులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆజాద్ సమాజ్ పార్టీ ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ అన్నారు. అందరికీ ఓటు హక్కు ఇచ్చిన ప్రగతిశీల దేశా లలో మనది ఒకటని తెలిపారు. ఎస్‌ఏడీ ఎంపీ మాట్లా డుతూ దేశంలో స్వేచ్ఛాయుతమైన లేదా న్యాయమైన ప్రజాస్వామ్య ప్రక్రియ మిగిలి లేదన్నారు. ఎన్నికల వ్యవస్థ ను కింది నుంచి పైకి ప్రక్షాళన చేయకపోతే, మొత్తం ప్రక్రి య ఒక ప్రహసనమని పేర్కొన్నారు.
ఆర్‌ఎస్‌పీ ఎంపీ ఎన్‌కె ప్రేమచంద్రన్ మాట్లాడుతూ సర్ వల్ల మైనారిటీలు, జనాభాలోని బలహీన వర్గాలకు సామూహిక హక్కులు లేకుండా పోతున్నాయని తెలిపారు. జేఎంఎం ఎంపీ విజరు కుమార్ హన్స్‌డాక్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో జరిగిన లోపాలపై అనేక పార్టీలు సమాచారా న్ని సేకరించి ఎన్నికల సంఘాన్ని సంప్రదించాయని, కానీ ఎటువంటి చర్య తీసుకోలేదని అన్నారు. ఇది ఒకటి లేదా ఇద్దరు వ్యక్తుల విషయం కాదు, మొత్తం నియోజకవర్గాల దని తెలిపారు. కానీ ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ మియాన్ అల్తాఫ్ అహ్మద్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలోని ప్రతి భాగం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవడానికి ప్రతి అడుగు వేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
సెంట్రల్ ప్యానల్ చీఫ్‌ల ఎంపిక.. మోడీతో విభేదించిన రాహుల్
కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ), కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) వంటి కీలకమైన సెంట్రల్ ప్యానళ్ల చీఫ్‌ల ఎంపికలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీతో విభేదించారు. పారదర్శక సంస్థలకు నియామకాలను ఖరారు చేయడానికి బుధవారం ప్రధాని మోడీ, కేంద్ర హౌంమంత్రి అమిత్ షాతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత హౌదాలో రాహుల్ పాల్గొన్నారు. 88 నిమిషాలసేపు సీఎంఓలో జరిగిన ఈ సమావేశం అనంతరం అత్యున్నత పదవులకు ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లతో విభేదిస్తున్నట్టు పేర్కొంటూ.. లిఖితపూర్వక అసమ్మతి నోట్‌ను అందజేశారు. అయితే సెంట్రల్ ప్యానళ్ల చీఫ్‌ల ఎంపికలో షార్ట్‌లిస్ట్ చేసిన అధికారులకు సంబంధించిన వివరాలు వెల్లడించలేదు.
అమిత్ షా x రాహుల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



