Sunday, October 12, 2025
E-PAPER
Homeఆటలుతీరంలో అమీతుమీ

తీరంలో అమీతుమీ

- Advertisement -

భారత్‌, ఆస్ట్రేలియా పోరు నేడు
గెలుపే లక్ష్యంగా హర్మన్‌ప్రీత్‌సేన
మ|| 3 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

ఐసీసీ 2025 మహిళల వన్డే ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలో మహా సమరానికి రంగం సిద్ధమైంది. టైటిల్‌ ఫేవరేట్లు భారత్‌, ఆస్ట్రేలియా విశాఖ తీరంలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. మూడు మ్యాచుల్లో రెండేసి విజయాలు సాధించిన భారత్‌, ఆస్ట్రేలియా నేడు మూడో విజయంపై కన్నేసి బరిలోకి దిగుతున్నాయి. భారత్‌, ఆసీస్‌ వరల్డ్‌కప్‌ మెగా పోరుకు విశాఖ స్టేడియంలో ఇప్పటికే 17 వేల టికెట్లు అమ్ముడయ్యాయి!.

నవతెలంగాణ-విశాఖపట్నం
బ్యాటింగ్‌ లైనప్‌ పతనం, స్వల్ప స్కోర్లు, నెమ్మదైన పిచ్‌లు, పేలవ ఫీల్డింగ్‌, వివాదాస్పద అంపైరింగ్‌ నిర్ణయాలకు తోడు ఏకపక్ష మ్యాచులతో కాస్త చప్పగా సాగుతున్న మహిళల ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌ రేసును రక్తికట్టించేందుకు భారత్‌, ఆస్ట్రేలియా సవాల్‌ సిద్ధమైంది. మహిళల క్రికెట్‌లో అగ్ర జట్లుగా కొనసాగుతున్న భారత్‌, ఆస్ట్రేలియాలు నేడు విశాఖపట్నం వేదికగా గ్రూప్‌ దశ మ్యాచ్‌లో తలపడనున్నాయి. గ్రూప్‌ దశ మ్యాచుల్లో భారత, ఆస్ట్రేలియా పోరు కోసం అభిమానులతో పాటు ఇతర జట్లు సైతం ఆసక్తిగా చూస్తున్నాయి!.

ఇద్దరిదీ ఒకే కథ!
ప్రపంచకప్‌లో అగ్రజట్లు భారత్‌, ఆస్ట్రేలియా కథ ఒకేలా ఉంది. మూడు మ్యాచుల్లో భారత టాప్‌ ఆర్డర్‌ విఫలమవగా.. లోయర్‌ ఆర్డర్‌ ఆదుకోవటంతో ఆతిథ్య జట్టు ఊపిరిపీల్చుకుంది. ఆస్ట్రేలియా బ్యాటర్లు సైతం రెండు మ్యాచుల్లో తడబడ్డారు. పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ల్లో 128/5, 76/7తో కంగారూ అమ్మాయిలు ఓ దశలో ఢలాీ పడ్డారు. కానీ లోతైన బ్యాటింగ్‌ లైనప్‌ ఆసీస్‌ పుంజుకునేందుకు దోహదం చేసింది. భారత జట్టులోనూ ఆల్‌రౌండర్ల మెరుపులతో మంచి స్కోర్లు నమోదయ్యాయి.

కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, స్మృతీ మంధాన, జెమీమా రొడ్రిగస్‌ భారత బ్యాటింగ్‌కు కీలకం. కానీ తొలి మూడు మ్యాచుల్లో ఈ ముగ్గురు విఫలమయ్యారు. హర్మన్‌ప్రీత్‌ వరుసగా 9, 19, 21 పరుగులే చేసింది. మెగా మ్యాచుల్లో రాణించే హర్మన్‌ప్రీత్‌ నేడు ఆస్ట్రేలియాపై తనదైన ఇన్నింగ్స్‌తో కదం తొక్కుతుందని జట్టు మేనేజ్‌మెంట్‌ ఆశాభావంతో ఉంది. మంధాన, జెమీమా సైతం మెరిస్తే భారత బ్యాటింగ్‌ కష్టాలు తీరినట్టే. ఆరో బౌలర్‌ లేకపోవటంతో దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో భంగపడిన భారత్‌.. నేటి మ్యాచ్‌కు సైతం ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగనుంది.

పిచ్‌, వాతావరణం
విశాఖపట్నం పిచ్‌ మధ్యాహ్నం వేళ పేస్‌కు, ఫ్లడ్‌లైట్ల వెలుతురులో స్పిన్‌కు అనుకూలిస్తోంది. భారత్‌, దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో ఇదే కనిపించింది. నేటి మ్యాచ్‌కు ఎటువంటి వర్షం సూచనలు లేవు. కానీ రెండో ఇన్నింగ్స్‌కు మంచు ప్రభావం ఉండనుంది. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకునే అవకాశం మెండుగా ఉంది.
తుది జట్లు (అంచనా) :
భారత్‌ : స్మృతీ మంధాన, ప్రతిక రావల్‌, హర్లీన్‌ డియోల్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), జెమీమా రొడ్రిగస్‌, దీప్తి శర్మ, రిచా ఘోష్‌ (వికెట్‌ కీపర్‌), ఆమన్జోత్‌ కౌర్‌, స్నేహ్‌రానా, క్రాంతి గౌడ్‌, శ్రీ చరణి.
ఆస్ట్రేలియా : అలీసా హీలే (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), లిచ్‌ఫీల్డ్‌, ఎలిసీ పెర్రీ, బెత్‌ మూనీ, అనాబెల్‌ సుథర్‌లాండ్‌, ఆష్లె గార్డ్‌నర్‌, తహ్లియ మెక్‌గ్రాత్‌, సోఫియా మోలినెక్స్‌, కిమ్‌ గార్త్‌, ఎలానా కింగ్‌, మెఘన్‌ స్కట్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -