పల్లవి: బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో,
బంగారు బతుకమ్మ ఉయ్యాలో ! బతుకమ్మ బతుకమ్మ!
చరణం-!: నాటి ఇంటింట ఇంతులు పూబంతులు నేడేమాయే, ఉయ్యాలో ఉయ్యాల,
అమ్మా! బతుకమ్మా… నేడు మేము వంటింటి కుందేళ్ళెందుకైనమమ్మా, ఉయ్యాలో ఉయ్యాల,
బరువు భాధ్యతల మాటున ఉయ్యాలో ఉయ్యాల, మమ్మణచకమ్మా ఉయ్యాలో ఉయ్యాల,
ఊరూరా వేడుక చేసేదమమ్మా ఉయ్యాలో ఉయ్యాల, మమ్మణచకమ్మా ఉయ్యాలో ఉయ్యాల,
చెరువు, చెలకల నడుమ మయూరాలమై ఆడెదమమ్మా, ఉయ్యాలో ఉయ్యాల!! ||బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో||
చరణం -!: నేడు మనం థరణిలో సగం, ఆకసంలో సగం ఉయ్యాలో ఉయ్యాల,
అయినా యాతనలేమో మోపెడు, వేతనాలేమో కోతలు ఎందుకమ్మా? ఉయ్యాలో ఉయ్యాల,
రాజీలేని పోరున మమ్ము ”రౌతు”గ నిలుపమ్మా, రాజుల యుగం కాదని తెలుపమ్మా, ఉయ్యాలో ఉయ్యాల,
నిను రా! రమ్మని పిలిచినమమ్మా, నువ్వు మాకు రాదారినే చూపినవమ్మా, ఉయ్యాలో ఉయ్యాల,
నువ్వు మా రాణివై రావమ్మా, నిను రాజ హంసలపై ఊరేగించెదమమ్మా, ఉయ్యాలో ఉయ్యాల!! ||బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో||
చరణం -!: హేమం నిండిన చేమంతుల చేలల్లో చెలువుగ నిను కొలిచెదమమ్మా, ఉయ్యాలో ఉయ్యాల,
క్షౌమం ఎరుగని నేలల్లో రాసులు పోయంగా రాతనాలీయమ్మా, ఉయ్యాలో ఉయ్యాల,
పొరుపు లేని బిడ్డల అడ్డా, పోరు తెలంగాణ యని చెప్పమ్మా, ఉయ్యాలో ఉయ్యాల,
చేరువై చెలిమి చేసేదమమ్మా చందన సుగంధ పరిమళాలందుకోవమ్మా, ఉయ్యాలో ఉయ్యాల,
ఏటేటా ఎర్రజెండా బిడ్డలందరూ ఏకమై బతుకమ్మలాడెదమమ్మా, ఉయ్యాలో ఉయ్యాల ||బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో||
బోడపాటి కౌకూర్, 9381509814