Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeదర్వాజనన్ను ఎంతో ప్రభావితం చేసిన ‘అమ్మ’

నన్ను ఎంతో ప్రభావితం చేసిన ‘అమ్మ’

- Advertisement -

ప్రపంచ మానవాళి చరిత్రలో అతి గొప్ప సంఘటన 1917 అక్టోబర్‌ విప్లవం. భూతలంపై సమ సమాజం అనే కలను సాకారం చేసిన విప్లవం అది. కాగా అక్టోబర్‌ విప్లవాని కంటే దశాబ్ధం ముందే ప్రజల్ని, విప్లవకారుల్ని ప్రభావితం చేసిన గొప్ప రచన మాక్సిమ్‌ గోర్కి ‘అమ్మ’ నవల. మాక్సీమ్‌ గోర్కీ ‘అమ్మ’ని చదివిన వారు ఎవరయినా ఒకసారి తమ అమ్మకు ఆ నవల చదివి వినిపించాలనుకుంటారు. అంతటి ప్రభావవంతమైన నవల అది. గోర్కీ రష్యన్‌ భాషలో రచించిన అమ్మ నవల మొదట ఇంగ్లీషులోకి అనువాదమై 1906లో వెలువడింది. ఆ తర్వాతే 1907లో అంటే అక్టోబర్‌ విప్లవాని కంటే దశాబ్ద కాలం ముందే రష్యన్‌ భాషలో పుస్తకంగా వచ్చింది. వివిధ భాషల్లోకి అనువాదమై దేశదేశాలలో ప్రతి తరాన్ని ఉత్తేజితుల్ని చేసింది. ఈ నవలని క్రొవ్విడి లింగరాజు ఎంతో ఇష్టంగా, ప్రేమగా, శ్రద్ధగా తెలుగులోకి అనువాదం చేశారు. ‘మదర్‌’ పేరుతో ఉన్న ఈ నవలకు ఆయన ‘అమ్మ’ అనే పేరు పెట్టారు. అనంతరం ఎందరికో ఈ ‘అమ్మ’ విప్లవాల ఉగ్గుపాలు పోసి కార్యోన్ముఖులను చేసింది.
తెలుగు నాట ఎంతోమంది ‘అమ్మ’ నవల చదివి కమ్యూనిస్టులయ్యారు. సమాజంలో పీడితుల పక్షం వహించాలన్న ఆకాంక్షని, పట్టుదలని, ప్రేరణని అందించడంలో ‘అమ్మ’ నవల పాత్ర అమేయమైంది. ‘అమ్మ’ గొప్పతనం తెలుసుకోడం ద్వారా మానవీయ ప్రవర్తనని అలవరుచుకుంటారు.
ప్రపంచ సాహిత్యక్షేత్రంలో గొప్ప రచయితగా నిలిచిన మాక్సిం గోర్కి రష్యా విప్లవానికి తన రచనల ద్వారా తోడూనీడై నిలిచాడు. అతిపేద కుటుంబం. బాల్యంలోనే తండ్రిని కొల్పోయాడు. తల్లి వేరొకర్ని వివాహం చేసుకున్నది. తొమ్మిదో ఏటే బుక్కెడు బువ్వ కోసం పరితపించాడు. తన సహచరులతో పెనుగులాడాడు. ఆయన బాల్యమంతా బంధిఖానాల్లో మగ్గిపోయింది. పాత ఇనుప సామాన్లు, ఖాళీ సీసాలు, చిత్తుకాగితాల్ని ఏర్కొన్న ఒక స్లమ్‌ డాగ్‌ బిడ్డడు గోర్కి. అవాంతరాలన్నింటినీ ఎదుర్కొని కుటుంబానికి ఆసరాగా నిలిచాడు. తల్లే తొలి గురువైంది. ఆమె నేర్పిన అక్షరంతోనే గోర్కి లోకానికి దివిటై వెలుగు ప్రసరించాడు. 1901లో ‘సాంగ్‌ ఆఫ్‌ ద స్టార్మీ పెటైల్‌’ తుఫాను పిట్ట పాట ద్వారా సునామిలా దూసుకొచ్చాడు. ఆనాటి జార్‌ల పరిపాలనలో రష్యా సామ్రాజ్యంలో మెరిక లాంటి రచయితగా ఎదిగాడు. అనతి కాలంలోనే ప్రపంచ సాహిత్య క్షేత్రంలోనే గొప్ప రచయితగా నిలిచాడు. రష్యా సామ్రాజ్యం, దాని ఏలికలు, పాలకుల పునాదులను పెకిలించగల రచనలను చేశాడు. గోర్కి మేధాసంపత్తి నుంచి పురుడు పోసుకున్న ‘అమ్మ’ (1906) నవల ద్వారా అన్నార్తులు, పేదలు, కడుబీదలు, కార్మికుల పక్షాన గొంతుకై ప్రభవించాడు. రష్యా సామ్రాజ్యమంతా గోర్కి ఐదేళ్లపాటు కాలినడకన కలియదిరిగి ఆనాటి పీడిత ప్రజల కడగండ్లని కళ్లారా చూడటమే కాదు.. స్వయంగా అనుభవించాడు. అదే ఆయనను పీడితులు, శ్రామికుల పక్షమై నిలబెట్టింది. వారి తరపున అక్షరమై గర్జించాడు. అది రష్యన్‌ విప్లవానికి బీజం పడిన రోజులు కావడం, అమ్మ నవల అదే సమయంలో రావడం, ఉద్యమకారులకు, అనేకులకు ప్రేరణనిచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని ఉత్తేజితులను చేసింది. అతని రచనల్లోని సూటిదనం, నిక్కచ్చితత్వం, వాస్తవికత యధార్థతను సంతరించుకొని నేటికి ఎందరికో స్ఫూర్తినిస్తున్నదంటే అతిశయోక్తి కాదు. వంద ఏళ్లయినా వన్నె తగ్గని రచన అది. నేటికీ సజీవమై మన సాహిత్యంలోనూ గుభాళిస్తున్నది.
పోరాటస్ఫూర్తిని ప్రోది చేయడమే కాదు, మనుషుల మధ్య మనిషిగా బతకడంలోని ఉదాత్తతని చెప్పే నవల ఇది. పుస్తకరూపంలో వచ్చి 120 ఏండ్లు దాటినా దాని ప్రాశస్త్యం చెక్కుచెదరలేదు. ఈ నవలను 80 ఏండ్ల కిందటనే బెర్టోల్‌ బ్రెక్ట్‌ నాటకంగా మలిచారు. ఈ నవల ఆధారంగా నాటకాలు రూపొందాయి. సినిమాలు వచ్చాయి. అమ్మ నవల గొప్పదనం రచనా సంవిధానంలోనూ, పాత్రల్ని రూపు గట్టించడంలోనూ ఉంది. అలాగే పాత్రల చైతన్యస్థాయి క్రమానుగతంగా పురివిప్పిన వైనాన్ని చిత్రించడంలో ఉంది. నవలలో పావెల్‌ ప్రధాన పాత్ర అయినప్పటికీ, అతని తల్లి ముఖ్యభూమికని పోషిస్తుంది. అందువల్లనే ఈ నవలకు ‘అమ్మ’ అన్న శీర్షిక పెట్టడం సముచితంగా ఉంది. విప్లవాల గురించి, పోరాటాల గురించి నవలలు, కథలు రాసే వారు నేర్చుకోవాల్సిన అంశాలు ఈ నవలలో అనేకం ఉన్నాయి. ఏ రాజకీయ చైతన్యం లేని పావెల్‌ తల్లి విప్లవ పోరాటంలో సంలీనమై ముందుకు సాగడం ఆకస్మికంగా జరగలేదు. ఆమె చైతన్యం పతాకస్థాయికి చేరుకోడానికి అవసరమైన సన్నివేశాలు, సంఘటనలు, వాటి మధ్యన సమన్వయంతో ఈ నవల పరిపూర్ణతని సాధించుకుంది. తద్వారా దశాబ్దాలు గడిచినా తరం నుంచి తరం ఈ నవలనించి స్ఫూర్తి పొందుతున్నది.
నేను విద్యార్థి ఉద్యమంలోకి వచ్చిన కొత్తలో చదివిన నవల ఇది. చిన్నతనంలోనే అమ్మకు దూరం కావడం వలన అనుకుంటా ‘అమ్మ’ అన్న పేరే నన్ను ఆకర్షించింది. అలా నా చేతిలోకి తీసుకున్న ఈ పుస్తకం ఆసాంతం చదివేశాను. ఈ నవల నన్ను కూడా చాలా ప్రభావితం చేసింది. ఆ మధ్య త్యాగరాయ గాన సభలో అమ్మ నాటకం ప్రదర్శన జరిగింది. దానిని చూడటం గొప్ప అనుభూతిని ఇచ్చింది. తొలిసారి నవల చదివినప్పుడు ఎంత ఉత్తేజం పొందానో, ఆ నాటకం చూసినప్పుడు అంతే ఉత్తేజం పొందాను.
– అనంతోజు మోహన్‌ కృష్ణ

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img