తండ్రి కవిరాజు రామస్వామి చౌదరి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న రచయిత త్రిపురనేని గోపీచంద్. 1910 సెప్టెంబర్ 8న కష్ణాజిల్లా చౌటపల్లిలో జన్మించారు. సాహిత్య అకాడమి, న్యూ ఢిల్లీ వారు ‘భారతీయ సాహిత్య నిర్మాతలు’ శీర్షికతో సాహితీరంగంలోని ప్రముఖుల జీవిత విశేషాలు, సాహితీ ప్రయాణాలు ప్రధాన అంశాలుగా రచింపజేసి వెలుగులోకి తెస్తున్న పరంపరలో భాగంగా గోపీచంద్ జీవిత విశేషాలు, సాహిత్య కషి డా. అమ్మంగి వేణుగోపాల్ గారి రచనగా మోనోగ్రాఫ్ రావడం విశేషం.
అమ్మంగి గారు ఏ అంశాన్ని తీసుకున్నా దానికి విషయ పరిపుష్టి, పరిశీలనా దష్టితో సంపూర్ణ న్యాయం చేయగల సమర్థులు. గోపీచంద్ గారి సాహిత్య విశేషణాలలోకి ఎకాఎకిగా వెళ్లకుండా వారికి ముందు వున్న పూర్వపరాలు, ఆ రోజుల్లో నెలకొనివున్న రాజకీయ, ఆర్ధిక, సామాజిక, సాహిత్య స్థితిగతులను భూమిక విభాగంలో సవివరంగా తెలియజేయటం వల్ల యువతరానికి ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. సాహిత్యం విషయంలో గురజాడ , రాయప్రోలు, కృష్ణశాస్త్రి, శ్రీ శ్రీల రచనలు, ఉన్నవ లక్ష్మీనారాయణ, చలం, కొడవటిగంటి కుటుంబరావు, బుచ్చిబాబు , ఆళ్వారుస్వామి, దాశరథి రంగాచార్య, బండారు అచ్చమాంబ ఇంకా ఇతర రచయితలను ప్రస్తావించడం ఈ గ్రంథ రచనకు ఒక బలమైన ఆకర్షణ . ముల్క్ రాజ్ ఆనంద్, సజ్జాద్ జాహిర్, ప్రేమ్ చంద్ లాంటి ప్రసిద్ధ అభ్యుదయ రచయితలతో కలిసి పని చేశారు. సాహిత్య సజన ఉద్దేశ్యం పాఠకుడి ఆలోచనా పరిధిని విస్తతి పరచడమేగాక మనకు సంబంధం లేదనుకుంటున్న విషయాలతో అనుసంధానం చేసే సామర్ధ్యాన్ని కలిగి సమాజాన్ని అర్ధం చేసుకునే దిశగా నడిపించే కార్యాచరణం. అమ్మంగి గారి రచన ఆ దిశగా నడిపిస్తుంది.
గోపీచంద్ వంశ పూర్వీకులు కాకతీయ రాజుల ఆస్థానంలో ముఖ్య పదవుల్లో వున్నవారు. తండ్రి రామస్వామి గారి వ్యక్తిత్వం, సాహిత్య కృషి, సామాజిక, రాజకీయ చైతన్యం, అలాగే ద్రావిడ ఉద్యమ పిత పెరియార్ రామస్వామి నాయకర్ తో వున్న సారూప్యత లను ప్రస్తావించారు. ఏడు విభాగాలుగా వున్న మోనొగ్రాఫ్ లో నవలా విభాగంలో ఇతివత్తం, పాత్ర చిత్రణ, సన్నివేశాల, సంఘటనల వైశిష్ట్యతల గురించి సవివరంగా తెలిపారు. Rolph Fox నవలా ప్రక్రియలో పాత్రలకు కొన్ని హక్కులుంటాయి అంటాడు. సహజమైన పాత్రలను సష్టించడం బాధ్యతతో కూడిన పని. అందుకే The Novel and the people లో ‘ఈనాటి నవలల్లో అన్నీ వున్నాయి, మానవ పాత్ర తప్ప’ అని బాధ పడతాడు. ఈ వ్యాఖ్యానం మనకు మనిషిలోని మనిషి తత్త్వం కనుమరుగవుతున్న విషాద దశ్యాన్ని చూపెడుతుంది. Rolph Fox మానవుణ్ణి సమగ్రంగా వ్యక్తీకరించడానికి యత్నించిన మొట్టమొదటి కళారూపం నవలా ప్రక్రియ అని నిర్వచిస్తాడు
నవలల భూమికను వివరిస్తూ గోపీచంద్ నవలలోకి ప్రవేశిస్తారు అమ్మంగి గారు. పరివర్తన, అసమర్ధుని జీవయాత్ర,, మెరుపుల మరకలు, పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా నవలలను అనుశీలనలతో చర్చించడం విశేషం. నవలికలు పిల్ల తెమ్మెర, గడియపడని తలుపులు, శిథిలాలయం, గతించని గతం అలాగే అసంపూర్ణ నవలలు చీకటి గదులు, ప్రేమోపహతులు, యమపాశంల ప్రస్తావన కూడా ఉంటుంది. కథానిక, నాటకం, వ్యాసం విషయాలను విభాగాలుగా విడదీసి చర్చించడం వల్ల చదవడానికి, అవగాహనకు పాఠకులకు అనుకూలంగా ఉంటుంది. మొత్తం 91 కథలు రాసిన గోపీచంద్ మొదటి కథ ‘ఒలింపియస్’ 1933 అక్టోబర్ ఆంధ్రభూమి పత్రికలో అచ్చయింది. గోపీచంద్ రాసిన కథానికలను అమ్మంగి గారు స్థూలంగా నాలుగు భాగాలుగా విభజించారు. 1. రాజకీయ స్వభావం వున్న కథానికలు 2 . కుటుంబ సంబంధమైనవి, 3. మనో వైజ్ఞానిక దక్పథంతో రాసినవి, 4 ఇతర ధోరణులతో చిత్రించిన కథానికలు. గోపీచంద్ కు సినిమా రంగంపై మక్కువ . ఆయన సినిమారంగంలో పనిచేసిన కాలం (1939 – 1952) లో అభ్యుదయ భావాల చిత్ర దర్శకుడు రామబ్రహ్మం, గోపీచంద్ ను దగ్గర తీశారు. తరువాత సినీరంగం అంతగా కలిసిరాక నిరుత్సాహానికి గురయ్యారు. గోపీచంద్ నాటకాలను సంప్రదాయ పద్దతిలో గాక నాందీ ప్రస్తావనలు లేకుండా ప్రధాన పాత్రలతోనే నిర్వహించడం, చివరగా భరత వాక్యం కూడా నిర్వహించలేదనే విషయాన్ని రచయిత గుర్తు చేశారు. నాటికల్లో భౌతికవాద, ఆధ్యాత్మిక వాదాల మధ్య సమన్వయం చోటుచేసుకోవడం ఒక దశావిశేషం. అనేక విషయాల మీద వ్యాసాలు రాసిన గోపీచంద్ లేఖారూప వ్యాసాలు, తాత్విక వ్యాసాలు కూడా రాసారు. అనేక విషయాల మీద వ్యాసాలు రాసిన గోపీచంద్ లేఖారూప వ్యాసాలు, తాత్విక వ్యాసాలు కూడా రాసారు.
వ్యక్తిగత జీవితంలో జరిగిన తీవ్రమైన సంఘటనలు సాహిత్యంలో ప్రతిబింబిస్తాయి. గోపీచంద్ రచనల్లో వాటి ప్రభావాన్ని గమనించిన అమ్మంగి గారు తమ అనుశీలనలో ప్రస్తావించారు. చిన్నతనంలో తల్లిని కోల్పోవటం దాని ప్రభావం ఆయన బాల్యం పై పడింది. గోపీచంద్ నవలల్లో, కథల్లో అనాథలు ‘కోల్పోయినవారు’ అధికంగానే కనిపిస్తారంటారు అమ్మంగి. ‘పరివర్తనం’ నవలలో కథానాయకుడు రాజారావు భార్యను కోల్పోతాడు. ‘అసమర్థుని జీవయాత్ర’ లో నాయకుడు సీతారామారావు తండ్రిని కోల్పోతాడు. ‘పిల్లతెమ్మెర’ నవలికలో కథానాయిక శమంతకమణి అనాథ. ‘పీడిత హదయం ‘కథానికలో రాము తల్లి లేని వాడు. ఇలా చాలా రచనల్లో ప్రధాన పాత్రలు ‘కోల్పోయినవారు’గా దర్శనమిస్తారు. అందుకే గోపిచంద్ వ్యక్తిగతంగా కుటుంబ వ్యవస్థ సంక్షోభానికి గురికావడం ఇష్టపడడు. గోపీచంద్ మీద తండ్రి నాస్తిక, హేతువాద భావజాలాల ప్రభావమే కాదు సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆల్ఫ్రెడ్ ఆడ్లర్‌ల మనోవైజ్ఞానిక సిద్ధాంతాల ప్రభావం కూడా వుంది. అందుకు మనోవైజ్ఞానిక నవలగా గుర్తింపు పొందిన ‘అసమర్థుని జీవయాత్ర’ నిదర్శనం.
గోపీచంద్ నిజ జీవితం మీద, సాహిత్య వ్యక్తిత్వం మీద నిశిత దష్టితో చేసిన పరిశీలనాత్మక మోనోగ్రాఫ్ రచన అమ్మంగి గారిది. కవిగా, విమర్శకుడిగా ప్రసిద్ధి పొందిన అమ్మంగి వేణుగోపాల్‌గారు గోపీచంద్ సాహిత్యం, ఆయన వ్యక్తిత్వాన్ని అనేక పార్శ్వలుగా సూక్ష్మ పరిశీలనతో స్పర్శించారు. గోపీచంద్ ప్రతి రచనకు పునాదిగా వున్న నేపథ్యాన్ని, ప్రముఖుల సిద్ధాంతాలు, రచనల, వ్యక్తుల ప్రభావాలు ఆయన రచనలపై ఎలా పనిచేసాయి? బాల్యం, యవ్వనం గడిచిన తీరు రాజకీయ, సినిమా, సాహిత్యరంగాలలో ఆయన ప్రవేశం, సమకాలీనులతో ఆయనకున్న సత్సంబంధాలు, ఇవన్నీ కలిసికట్టుగా గోపీచంద్ వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దాయో ఈ గ్రంధంలో చూడవచ్చు. సరియైన సమయంలో సరియైన నిర్ణయం తీసుకున్న సాహిత్య అకాడమి, న్యూ ఢిల్లీ ఆధ్వర్యాన ‘భారతీయ సాహిత్య నిర్మాతలు’ శీర్షిక కింద త్రిపురనేని గోపీచంద్ జీవితం, సాహిత్య విశేషాలతో, అకాడమిక్ విలువలతో అమ్మంగి రాయటం తెలుగు పాఠకులకు అందివచ్చిన చక్కటి సదవకాశం. గోపీచంద్ గురించే కాదు అనేక విషయాల సమాహారం ఈ పుస్తకం .
1910లో జన్మించిన గోపీచంద్ అనేక రంగాలలో కృషి చేసి 1962, నవంబర్, 2న తుదిశ్వాస విడిచిన తనలో కలిగిన భావపరిణామాలకు సాహిత్య రూపం ఇచ్చిన అన్వేషి, మేధావి.
– డా . రూప్ కుమార్ డబ్బీకార్, 91778 57389
త్రిపురనేని గోపీచంద్ సాహిత్య వ్యక్తిత్వంపై అమ్మంగి అనుశీలన
- Advertisement -
- Advertisement -