Thursday, July 10, 2025
E-PAPER
Homeఎడిట్ పేజికాలుష్యంతో 'అమ్మ' పోరాటం

కాలుష్యంతో ‘అమ్మ’ పోరాటం

- Advertisement -

అంతర్జాతీయ ఆధిపత్యం కోసం మానవ వినాశకర బాంబులతో యుద్ధాలకు పాల్పడుతున్నారు.ఈ విపరీత ధోరణితో మానవుడు సృష్టించలేని సహజ సంపదలను ధ్వంసం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిల్లో మారుతున్న వాతావరణ పరిస్థితులు గర్భిణులపై తీవ్ర దుష్ప్రభావాలు చూపే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. గత ఐదేళ్లలో భూ ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయిలో పెరుగుదల చోటుచేసుకుంటున్నట్లు ”క్లైమెట్‌ సెంట్రల్‌” తాజా అధ్యయనంలో వెల్లడైంది. దీనివల్ల మాతాశిశు ఆరోగ్యానికి సమస్యలు ఎదురవుతాయని సంస్థ స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా 90శాతం దేశాల్లోని 63 శాతం నగరాల్లో పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయి.
భారత్‌లోనూ ఈవాతావరణం ఉందని ”క్లైమెట్‌ సెంట్రల్‌” తన అధ్యయన పత్రంలో హెచ్చరించింది. గత ఐదేళ్లలో అధిక ఉష్ణోగ్రతల నమోదు అనూహ్యంగా పెరుగుతుంది. ఏప్రిల్‌, మే నెలలో 37-45 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయి. కొన్నిసార్లు 49 డిగ్రీల వరకు కూడా నమోదవుతాయి. సగటున 30 రోజులు ఈ తరహా ఎండలుంటాయి. తాజా అధ్యయనంలో 37 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతలు ఎండా కాలంలోనే కాకుండా ఇతర సీజన్‌లోనూ ఉన్నట్టు వెల్లడైంది. 2020-24 వరకు ఐదేళ్లపాటు 247 దేశాల్లో, 940 నగరాల్లో ఈ సంస్థ రోజు వారి ఉష్ణోగ్రతలను విశ్లేషించింది. 2020కి ఐదేండ్ల ముందు వాతావరణంలో మార్పులు, ఉష్ణోగ్రతల నమోదు, గర్భిణుల ఆరోగ్యం, ముందస్తు జననాలు తదితర అంశాలను కూడా పరిశీలించింది. వాతావరణంలోని మార్పుల వల్ల గర్భిణులకు ముప్పు దాదాపు రెట్టింపయినట్టు పరిశోధనలో గుర్తించింది. ఇలా క్రమంగా భూ వాతావరణం వేడెక్కడం, ఏడాది పొడవునా ఉక్కపోత వాతావరణం ఉంటుంది. మరోవైపు అకాల వర్షాలు, చలికాలంలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి.వాతావరణంలో ఇంతలా మార్పులకు ప్రధాన కారణం పొల్యూషన్‌,పెస్టిసైడ్స్‌, ప్లాస్టిక్స్‌-పీపీపీగా నిర్ధారించింది. వాహనాలు, పరిశ్రమల ద్వారా వెలువడుతున్న హానికర ఉద్గారాలు భూతాపాన్ని పెంచేస్తున్నాయి.భూమి,వాయు, జల కాలుష్యాలు, అడ్డగోలుగా అడవుల నరికేయడంలాంటి మానవ చర్యల వల్ల అనేక దుష్ప్రభావాలు ఎదురవుతున్నాయి. 78 దేశాల్లో 2020 నుంచి 2024 సంవత్సరాల్లో గర్భిణులకు ముప్పును పెంచే ఉష్ణోగ్రతలు నమోదయ్యే రోజుల సంఖ్య దాదాపు 30 అదనంగా పెరగడం ఆందోళన కలిగించే అంశం. బొగ్గు, చమురు, గ్యాస్‌ తదితర శిలాజ ఇంధనాలను అధికంగా వినియోగించడం ద్వారా ఏర్పడిన వాతావరణ కాలుష్యం. గర్భిణులపై ప్రమాదకర ప్రభావాన్ని చూపుతోంది. మన దేశంలోనూ అధిక ఉష్ణోగ్రతల ప్రభావం వారిపై తీవ్రంగానే ఉంది. పనాజీ(గోవా)లో 39 రోజులు, తిరువనంతపురంలో 36, సిక్కింలో 32, ముంబాయి లో 26 చెన్నరు, బెంగళూరు, పూణే నగరాల్లో అదనంగా ఏడు రోజులు గర్భిణులు అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా గత పదేండ్లలోనే చోటు చేసుకున్నాయి.
ముప్పును తగ్గించడం ఎలా అంటే, అడవులను ఇష్టానుసారంగా నరికివేయకుండా, సంరక్షణ చర్యలు చేపట్టాలి. గ్రామాలు, పట్టణాల్లోనూ చిన్నపాటి వనాలను పెంచాలి. కార్భన ఉద్గారాలను తగ్గించాలి.గాలి, నీటి కాలుష్యం అరికట్టాలి. కాలుష్య రహిత పరిశ్రమలను, వాహనాలను ప్రోత్సహించాలి.ఇంతగా పొల్యూషన్‌ పెరుగుతున్న పరిస్థితిలో గర్భిణీ దశ నుంచి ప్రసవం వరకూ..సాధారణం కంటే ఒక్క డిగ్రీ ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైన ఆ ప్రభావం మనపై కచ్చితంగా పడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా గర్భిణులపై అధిక ఉష్ణోగ్రతల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా దుష్ప్రభావం ఉంటుంది. గర్భిణిగా ఉన్నప్పుడే కాదు, ప్రసవం తర్వాత కూడా డిహైడ్రేషన్‌, కండ రాలు పట్టేయడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ ప్రభావం కడుపులో పెరుగుతున్న శిశువుపై కూడా ఉంటుంది. ముందస్తు జననాలకు కారణం అవుతుంది. వాయు కాలుష్యంలోని కార్బన్‌ డైయాక్సైడ్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌, నైట్రోజన్‌ ఆక్సైడ్‌,సల్ఫర్‌ డయాక్సైడ్‌ తదితర ప్రమాదకరమైన వాయువులే కాకుండా పది మైక్రో మీటర్‌ కంటే తక్కువ పరిమాణం ఉన్న ధూళికణాలు వంటివి కూడా గర్భిణులకు సమస్యలు కలగజేస్తాయి.అధిక రక్తపోటు, మధుమేహం ఆసుపత్రుల్లో చేరాల్సి రావడం, తొలి మూడు నెలల్లోనే గర్భస్రావం, తల్లికి తీవ్ర అనారోగ్యం, తల్లి మరణం మృత శిశువు లేదా ముందస్తు జననం తక్కువ బరువుతో, అవయవ లోపాలతో పుట్టడం వంటి సమస్యలు ఎదురవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మానవజాతి సృష్టికర్తలైన గర్భిణుల ఆరోగ్యం బాగుంటేనే భావితరం ఆరోగ్యవంతంగా ఉంటుంది. కేంద్ర, రాష్ట్రాల పాలకులు సమస్యల మూ లాల్లోకి వెళ్లి పరిష్కారం కోసం తక్షణం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఆరోగ్య భారతం నిర్మితమవుతుంది.

మేకిరి దామోదర్‌
9573666650

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -