Magazines

సెంట్రల్‌ అమెరికా పార్లమెంటుకు నికరాగువా గుడ్‌బై

05 అక్టోబర్, 2026

Nicaragua bids goodb
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 1 నిమిషాల చదవడం

మనాగువా : కీలక ప్రాంతీయ సంస్థ అయిన సెంట్రల్‌ అమెరికా పార్లమెంట్‌ నుంచి వైదొలుగుతున్నట్లు నికరాగువా ప్రభుత్వం ప్రకటించింది. దేశాధ్యక్షుడు డేనియల్‌ ఒర్టెగా, సహ అధ్యక్షురాలైన ఆయన భార్య రొసారియో మురిల్లో తమ అధికారాన్ని సుస్థిరం చేసుకుంటున్న తరుణంలో ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన వెలువడింది. సెంట్రల్‌ అమెరికాలో మానవ హక్కులను, ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు ఆరు దేశాలతో కూడిన సెంట్రల్‌ అమెరికా పార్లమెంటును ఏర్పాటు చేశారు. ఇందులో గ్వాటెమాల, హోండురస్‌, పనామా, డొమినికన్‌ రిపబ్లిక్‌, ఎల్‌ సాల్వెడార్‌, నికరాగువా సభ్య దేశాలు. పౌర హక్కులను పునరుద్ధరించాలని, రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని నికరాగువాను కోరుతూ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ అమెరికా స్టేట్స్‌ (ఓఏసీ) తీర్మానం ఆమోదించిన కొద్దిసేపటికే విదేశాంగ శాఖ నుంచి ఈ ప్రకటన వెలువడింది. దేశ సార్వభౌమాధికారాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు చేపట్టిన చర్యలలో ఇది భాగమేనని నికరాగువా ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని చెప్పింది. నికరాగువా ఇప్పటికే అనేక ప్రాంతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి వైదొలిగింది. ఇలాంటి సంస్థలు బయటి వారి జోక్యానికి దోహదపడుతున్నాయని ఒర్టెగా-మురిల్లో ప్రభుత్వం ఆరోపించింది. ఒర్టెగా హయాంలో దేశంలో మానవ హక్కుల రికార్డు దారుణంగా ఉన్నదంటూ వచ్చిన విమర్శల కారణంగా నికరాగువా 2023లో ఓఏసీ నుంచి, గత సంవత్సరం ఐరాస మానవ హక్కుల మండలి నుంచి వైదొలిగింది. విమర్శకులను, అసమ్మతివాదులను లక్ష్యంగా చేసుకోవడానికి జైలు శిక్షలు, హింస, బహిష్కరణలు వంటి చర్యలకు ఒర్టెగా పూనుకుంటున్నారని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపణలు వచ్చాయి.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్