తెలుగు సాహిత్యంలో దళిత- బహుజన కవుల మీద సమాజశాస్త్ర దృష్టితో వచ్చిన పరిశోధన గ్రంథాల సంఖ్య పరిమితమే. ఈ నేపథ్యంలో, విప్లవకుమార్ తన పరిశోధన రచన ‘అవుట్‌లుక్’ ‘A Treatise on Belli Yadaiah’s Poetry Socio Perspective’ లో ప్రముఖ కవి బెల్లి యాదయ్య జీవితం, కవిత్వం, సామాజిక దక్పథం, శిల్ప వైవిధ్యం, రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర వంటి అంశాలను సమాజశాస్త్ర దృష్టితో విశ్లేషించారు. పరిశోధనలో కనిపించే గంభీరత, సామాజిక కోణం, విమర్శనాత్మక పరిశీలన – ఇవి పరిశోధకుడిలో ఉన్న సృజనాత్మక-విజ్ఞానాత్మక సమన్వయాన్ని ప్రతిబింబిస్తాయి.
బెల్లి యాదయ్య(1968) పుట్టిన కాలం తెలంగాణ సామాజిక మార్పుల దశ. విప్లవకుమార్ ఆ చారిత్రక నేపథ్యాన్ని విశ్లేషించి, ‘ప్రతి కవి తన కాలానికే ప్రతినిధి’ అనే ఆర్నాల్డ్ సిద్ధాంతాన్ని ఇక్కడ సమన్వయించారు. యాదయ్య దళిత, బహుజన, గిరిజన వర్గాల సామాజిక న్యాయ ఆకాంక్ష, ప్రపంచీకరణ వ్యతిరేక భావనలు వంటి తన కాలంలోని ముఖ్యమైన అంశాలను బలంగా వ్యక్తం చేశాయి. అందుకే, బెల్లి యాదయ్యను కేవలం కవిగా కాకుండా, తన కాలాన్ని, సమాజపు కష్టాలను, ఆశయాలను తన కలం ద్వారా నమోదు చేసిన యుగ ప్రతినిధిగా పరిశోధకుడు భావించారు. ఒకవైపు, ‘కవి దృక్పథం అతని కవిత్వంలో ఎట్లా ప్రతిబింబిస్తుందో తెలుసుకోవాలంటే కవి జీవనరేఖలను పరిశీలించాల్సి ఉంటుంది’ (పుట- 1) అనే వాక్యం ద్వారా పరిశోధకుడు తన చారిత్రక దృష్టిని స్పష్టం చేశారు.
ఇందులో భాగంగానే యాదయ్య కుటుంబం, బాల్యం, వెట్టిచాకిరి అనుభవాలు, ఆర్థిక దౌర్భాగ్యం, సాంస్కృతిక వాతావరణం వంటి అంశాలు ఆయన కవిత్వంలో మానవ సమానత్వ ఆకాంక్షగా ఎలా రూపాంతరం చెందాయో వివరించారు. మరోవైపు, కవి జీవితాన్ని కేవలం వ్యక్తిగత చరిత్రగా కాకుండా, అది రూపుదిద్దుకున్న ‘సామాజిక చరిత్ర’గా చూస్తూనే, ఆ జీవితం నుండి వెలువడిన కవిత్వాన్ని వ్యక్తిగత అనుభూతుల నుండి విడదీసి, ఒక ‘ప్రజా చేతన ప్రమాణంగా’ విశ్లేషించారు. ‘కవిత్వం కవిలో కాదు, సమాజంలో ఉత్పత్తి అయ్యే చైతన్యం’ అనే వ్యాఖ్య, పరిశోధకుడు వ్యక్తిని దాటి, రచన సామాజిక ఉత్పత్తిని విశ్లేషించారనడానికి నిదర్శనం.
యాదయ్య కవిత్వాన్ని కేవలం సాహిత్య వస్తువుగా కాకుండా సామాజిక చరిత్రగా పరిగణించారు విప్లవ్. యాదయ్య కవిత్వం వర్గ-వ్యతిరేక సాహిత్యం, దళిత చైతన్య సాహిత్యం, ప్రాంతీయ స్పృహ/ చైతన్య సాహిత్యం అనే మూడు ముఖాలను కలిగి ఉందని విమర్శనాత్మక కోణాన్ని ఆవిష్కరించారు. ఇది అభ్యుదయ సాహిత్య తత్త్వానికి సరిపడే దృక్కోణం. యాదయ్య కవిత్వాన్ని విశ్లేషించడానికి ఫార్మలిజం (రూపనిర్మాణవాదం) పద్ధతిని కూడా ఉపయోగించారు విప్లవ్. కవిత్వంలోని భాష, సంభాషణాత్మకత వంటి ‘శిల్ప గుణాలను’ విశ్లేషించారు. వీరి విశ్లేషణ ప్రకారం, యాదయ్య కవిత్వం ఆత్మాశ్రయంగా కాకుండా, పాఠకుడితో, సమాజంతో నేరుగా మాట్లాడే ‘సంభాషణాత్మక’ గుణాన్ని బలంగా కలిగి ఉంది.
ఉదాహరణకు, ‘కవులారా!’ అని నేరుగా సంబోధిస్తూ, సిరిసిల్ల విషాదాన్ని చూసి రొటీన్ కవిత్వం రాయవద్దని, ఆ ‘కన్నీటి వాడకట్టుకి’ వెళ్లి, ‘కడుపుకోతకి గురైన తల్లుల ఒళ్ళోవాల్చి/ కాసేపు శిశువులై పుట్టి పెరగండి’ అని విజ్ఞప్తి చేస్తారు. ఇది సాటి కవులతో జరిపే ఒక తీవ్రమైన సంభాషణలా సాగుతుంది. అలాగే మరొక చోట ‘మిత్రులారా! ఎన్నికలొస్తున్నాయి’ అని నేరుగా సంభాషణ ప్రారంభించి, ‘ఏం చేద్దామో చెప్పండి’ అని ప్రజలనే నిలదీస్తారు. ముఖ్యంగా, నల్లగొండ జిల్లా, నకిరేకల్ ప్రాంతీయ పదాలను అత్యంత సహజంగా, శిల్పానికి భంగం కలగకుండా ఉపయోగించిన తీరును విశ్లేషించారు. గొల్ల కురుమల వత్తి జీవితానికి సంబంధించిన ‘గొంగడి’, ‘దుడ్డుకర్ర’, ‘సద్దన్నం మూట’, ‘తిత్తి’ వంటి పదాలుబీ ‘తెల్లారగట్ట’ (తెల్లవారుజామున), ‘గిలకొట్టే’ (చిలకడం), ‘మా పోరలు’ (మా అబ్బాయిలు) వంటి స్థానిక పదాల వాడకం ఇందుకు ఉదాహరణ.
పరిశోధనలో స్వతంత్ర వ్యాఖ్యానం (original interpretation) ప్రధాన బలంగా కనిపిస్తుంది. యాదయ్య కవిత్వంపై ఇంతకు ముందు ఉన్న విమర్శల్లో కనిపించని కోణాలను ప్రతిపాదించారు. ప్రకతి కవిత్వాన్ని పర్యావరణ చైతన్యంతో అనుసంధానం చేశారు. ప్రపంచీకరణ వ్యతిరేక కవిత్వంలో మార్క్సిస్టు పద్ధతిలో ‘ఉత్పత్తి సంబంధాల వికతి’ అనే కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు. బహుజన దక్పథాన్ని ‘అస్తిత్వ కవిత్వం’గా విస్తరించారు. ఈ నిర్వచనాలు పరిశోధనలో ఆయన స్వతంత్ర విజ్ఞానాన్ని ప్రతిబింబిస్తాయి. ‘ధ్వంసం అవుతున్న మానవ విలువలను కాపాడడమే యాదయ్య కవిత్వం ప్రయోజనం’ అనే వ్యాఖ్యలోని ‘మానవ విలువలు’ అనే పదం మార్క్సిస్టు మానవతా తత్త్వాన్ని సూచిస్తుంది. ఇది విప్లవ్‌లోని వ్యాఖ్యాన విమర్శ స్థాయిని తెలుపుతుంది.
వీరి పరిశోధన కేవలం అకడమిక్ పరిమితుల్లో నిలవదు, దీనికి సామాజిక సందేశం ఉంది. యాదయ్య కవిత్వాన్ని వేదికగా తీసుకుని అణగారిన వర్గాల స్వరాలను శాస్త్రీయంగా న్యాయబద్ధం చేస్తారు. ‘రచయిత ఉనికి కంటే సమాజ అవసరం ముఖ్యం’ అనే పరిశోధకుడి వ్యాఖ్య, సమాజ- కేంద్ర వాదాన్ని నిర్ధారిస్తుంది. బెల్లి యాదయ్య తన కవిత్వం ద్వారా ఒక విధమైన ‘సాహిత్య మానవజాతి శాస్త్రం’ (Literary Ethnography)ని రికార్డు చేశారు. ఎథ్నోగ్రఫీ అంటే ఒక నిర్దిష్ట ప్రజల సమూహ సంస్కతి, ఆచారాలు, సామాజిక నిర్మాణం, జీవన విధానాన్ని క్రమబద్ధంగా అధ్యయనం చేసి, వివరించడం. బెల్లి యాదయ్య తన కవిత్వంలో అట్టడుగు, సబాల్టర్న్ కులాలు, వత్తి సమూహాల జీవన విధానాన్ని, వారి భాషను, వారి సామాజిక వాస్తవికతను నిశితంగా నమోదు చేస్తూ, సరిగ్గా ఇదే పనిచేశారు. బెల్లి యాదయ్య కవిత్వం ప్రధాన స్రవంతి సాహిత్యం పట్టించుకోని అనేక వృత్తి సమూహాల జీవితాలను, తరచుగా తెలుగు సాహిత్యంలో రికార్డు చేసింది. ఎథ్నోగ్రఫీలో ఒక సమూహం ఉపయోగించే వస్తువులు (material culture), భాష (linguistics) నమోదు చేయడం చాలా ముఖ్యం.
యాదయ్య ఈ రెండు అంశాలను తన కవిత్వంలో భద్రపరిచారు. కమ్మరుల పనిముట్లు అయిన ‘కత్తి, కొడవలి, లిక్కి, గొడ్డలి, నాగలి, దంతె, గొర్రు, గుంటుక, పారా, గడ్డపార’ వంటి వాటిని కవిత్వంలో జాబితా చేయడం వారి భౌతిక సంస్కతికి సాక్ష్యంగా నిలుస్తుంది. అలాగే ఆయా సమూహాలు ఉపయోగించే నిర్దిష్ట ప్రాంతీయ, వత్తి పదాలను ఆయన భద్రపరిచారు. గొల్ల, కురుమ పదాలు: ‘బొద్దంచుధోతి’, ‘తోలుపట్టెడ’, ‘గొంగడి’, ‘మంద’, ‘పొది’, ‘శాల్తీలు’, ‘ఉన్ని కండెలు’, ‘గొర్రెపోకడ’. వ్యవసాయిక పదాలు: ‘తడి దుక్కి’, ‘బోడు బీడు’, ‘కొడవళ్ళు’, ‘గడ్డ పలుగులూ’, ‘నాగలి’, ‘కల్లం’, ‘రాశి’, ‘దుక్కిటెడ్లు’, ‘గుంటుకమొద్దు’ మొదలైనవి చాలా ఉన్నాయి.
బెల్లి యాదయ్య కవిత్వానికి గుండెకాయ దళిత, బహుజన, గిరిజన దృక్పథం. ఇది ‘జ్ఞానం’ (Knowledge) అంటే ఏమిటో పునర్నిర్వచిస్తుంది. ఆయన ఆధిపత్య వర్గాల ‘పుస్తక జ్ఞానం’ కంటే, బహుజనుల ‘వృత్తి/అనుభవ జ్ఞానం’ గొప్పదని వాదిస్తూ, జ్ఞాన వ్యవస్థను తలకిందులు చేస్తారు. గొర్రెలను లెక్కించడం (గణితం), వాటికి వైద్యం చేయడం, మందను సురక్షితంగా నడిపించడం వంటి వృత్తి నైపుణ్యాలే నిజమైన జ్ఞానం అని ఆయన ప్రకటిస్తారు. ఇది కేవలం ఆత్మగౌరవ ప్రకటన కాదు, ఇది కుల వత్తినే ‘జ్ఞాన కేంద్రంగా’ స్థాపించే ఒక బలమైన జ్ఞానమీమాంస సవాలు. ఈ అంశాల ఆధారంగా పరిశోధకుడు విప్లవకుమార్ విశ్లేషణ చేశాడు.
విప్లవకుమార్ పరిశోధనలో అకడమిక్ క్రమశిక్షణ, తాత్త్విక లోతు, సామాజిక చైతన్యం, భాషా శిల్పం సమన్వయమై ఉన్నాయి. ఇది సాహిత్య విమర్శలో సాంఘిక చైతన్యానికి శాస్త్రీయ రూపాన్ని ఇచ్చింది. యాదయ్య కవిత్వం మీద వారు చేసిన విశ్లేషణ, తెలుగు విమర్శా రంగంలో దళిత-బహుజన సాహిత్యాన్ని ప్రధాన ప్రవాహంలోకి తీసుకురావడానికి దోహదపడుతుంది. ఈ పరిశోధనా గ్రంథం భవిష్యత్ పరిశోధకులకు అనేక విధాలుగా ఒక నమూనాగా (Model) ఉపయోగపడుతుంది. తెలంగాణ దళిత కవిత్వంపై కొత్త కోణాల్లో పరిశోధన చేయడానికి, యాదయ్య వంటి కవుల కవిత్వాన్ని అంతర్జాతీయ సాహిత్య సిద్ధాంతాలతో అనుసంధానం చేయడానికి, తులనాత్మక దళిత అధ్యయనాల (Comparative Dalit Studies) దిశలో పరిశోధనలను విస్తరించడానికి ఈ రచన ఉపయోగపడుతుంది.
(నవంబర్ 30 న మహాత్మా గాంధీ యూనివర్సిటీ, నల్లగొండలో అవుట్ లుక్ పుస్తకావిష్కరణ సందర్భంగా)
ప్రొ|| గంపా వెంకటరామయ్య, 9958607789



