జాక్టో చైర్మెన్ సదానందంగౌడ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి త్వరలో ఉద్యమాన్ని చేపడతామని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) చైర్మెన్ జి సదానందంగౌడ్ ప్రకటించారు. శనివారం హైదరాబాద్ కాచిగూడలోని ఎస్టీయూ భవన్‌లో జాక్టో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సదానందంగౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తయ్యిందని చెప్పారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు, మొదటి తారీఖున వేతనాలు మినహా మ్యానిఫెస్టో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడిన ఆర్నెల్లలోనే పీఆర్సీ సిఫారసులను అమలు చేస్తామంటూ ఇచ్చిన మాట తప్పడం సరైంది కాదన్నారు. ఉద్యోగులకు 51 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. బకాయి పడిన ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఉద్యోగులకు ఆరోగ్య కార్డులను జారీ చేసి సక్రమంగా అమలు చేయాలన్నారు.
సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. సమస్యల పరిష్కారానికి జాక్టో ఆధ్వర్యంలో పోరాటానికి సిద్ధం కావాలని ఉపాధ్యాయులకు ఆయన పిలుపునిచ్చారు. పెండింగ్ బిల్లుల మంజూరు కోసం నెలకు రూ.1,500 కోట్లు కేటాయించాలని చెప్పారు. ఉద్యోగ విరమణ పొందిన వారు బెనిఫిట్స్ కోసం ఏండ్ల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. మోడల్, గురుకుల, ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులకు ఆరోగ్యకార్డులను జారీ చేయాలని అన్నారు. మోడల్ స్కూల్ టీచర్లకు 010 పద్దు కింద ట్రెజరీల ద్వారా వేతనాలు చెల్లించాలని కోరారు. కేజీబీవీ, యూఆర్‌ఎస్ టీచర్లకు సమ్మె కాలపు వేతనాలు చెల్లించాలనీ, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాక్టో నాయకులు కె కృష్ణుడు పి రాజభాను చంద్ర ప్రకాష్, కె మల్లికార్జున్ రెడ్డి, పర్వతి సత్యనారాయణ, జుట్టు గజేందర్, జయబాబు, సయ్యద్ అస్గర్, జి నగేశ్‌యాదవ్, యు విఠల్, మోనుద్దీన్, మీర్ ముంతాజ్, గీతాంజలి, శర్మ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి త్వరలో ఉద్యమం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



