Sunday, October 12, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఅఖిలపక్షం ఏర్పాటు చేయాలి

అఖిలపక్షం ఏర్పాటు చేయాలి

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు విషయంలో హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన నిర్వహించి, శాసనసభలో ఏకగ్రీవంగా బిల్లును రూపొందించి కేంద్రానికి పంపించిందని గుర్తు చేశారు. ఆర్నెల్లైనా రాష్ట్రపతి నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదని విమర్శించారు. గతంలో కొన్ని తీర్పులలో సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం రాష్ట్రపతి అయినా సరే మూడు నెలల్లోగా తేల్చాలనీ, లేదా వెనక్కి పంపించాలని ఆదేశాలున్నాయని తెలిపారు. కానీ ఇది జరగలేదని పేర్కొన్నారు.

మూడు నెలలు పూర్తయినందున చట్టంగా తీసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పినందున 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసుకునే అవకాశముందని తెలిపారు. అలా సాధ్యం కాకపోతే, మొత్తం బీసీల రిజర్వేషన్ల మీద కేంద్ర ప్రభుత్వంతో పోరాడి బిల్లును అమలు చేసే విధంగా తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చే విధంగా పోరాటం సాగించాలని ఆయన పిలుపునిచ్చారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయబద్ధంగా చేయాల్సిన ప్రయత్నం చేస్తూనే, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి సాధించడం కోసం ఉద్యమాన్ని కొనసాగించాలని కోరారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని రూపొందించాలని సూచించారు. అఖిలపక్షం తీసుకున్న ఉద్యమానికి సీపీఐ(ఎం) పూర్తిగా మద్దతిస్తుందని తెలిపారు.

రాష్ట్రంలో బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలు, ఇద్దరు మంత్రులు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలున్నారని జాన్‌వెస్లీ పేర్కొన్నారు. వీళ్లందరూ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు అనుకూలంగా మాట్లాడుతూ, కేంద్రంలో మాత్రం వ్యతిరేకంగా ఉంటున్నారని విమర్శించారు. కేంద్రం మీద మీద ఒత్తిడి తెచ్చి అమలు చేయించాల్సిన బాధ్యత బీజేపీ నాయకులు, ఆ పార్టీ ఎంపీలు, మంత్రుల మీద ఉందని తెలిపారు. అమలు జరగకపోతే వారే బాధ్యత వహించి పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ మనువాద పార్టీ, రిజర్వేషన్లకు వ్యతిరేకమైన పార్టీ అని విమర్శించారు. బీజేపీ ఇదే వైఖరి కొనసాగిస్తే రాష్ట్రంలో జూబ్లిహిల్స్‌, స్థానిక సంస్థల ఎన్నికలే కాదు, ఏ ఎన్నికలు జరిగినా ఆ పార్టీకి ఓట్లు వేయకుండా సామాజిక తరగతులన్ని తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -