Friday, December 26, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుహిల్ట్‌పై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి

హిల్ట్‌పై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి

- Advertisement -

సీపీఐ(ఎం) డిమాండ్‌
విలువైన భూములు పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేయొద్దని ప్రభుత్వానికి హితవు

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
హైదరాబాద్‌ ఇండిస్టియల్‌ ల్యాండ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ (హిల్ట్‌) పాలసీపై చర్చించేందుకు వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. లక్షల కోట్ల విలువైన భూములను పారిశ్రామికవేత్త లకు ధారాదత్తం చేయొద్దని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌ నగరంలోని 22 పారిశ్రామిక కేంద్రాల్లోని పరిశ్రమలన్నింటినీ నగరం బయటకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో 27ను విడుదల చేసిందని తెలిపారు. అందుకోసం 9,300 ఎకరాల భూమిని అతి తక్కువ
ధరకే పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టడం వల్ల లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. కన్వర్షన్‌ పేరుతో రియల్‌ ఎస్టేట్‌కు కట్టబెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం ఇంటి స్థలాలు, క్రీడా స్థలాలు, పాఠశాలలు, హాస్టల్స్‌ కోసం భూములు కేటాయించాలని కోరారు.

లక్షల కోట్ల విలువైన వేలాది ఎకరాల భూములకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, శాసనసభలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ‘కాలుష్యాన్ని సృష్టించే పరిశ్రమలను నగరం నుంచి తరలించాలే తప్ప, మిగతా పరిశ్రమలనన్నింటినీ ఎందుకు తరలిస్తున్నారు? పరిశ్రమలను తరలిస్తే కార్మికుల పరిస్థితి, వారి భద్రతకు తీసుకుంటున్న చర్యలేంటి? వారికి నివాసం, విద్యా, వైద్యం, ఉపాధి పరిస్థితులేంటి? పరిశ్రమలను తరలిస్తే, ఈ భూములను ఆ పారిశ్రామిక వేత్తలకే మార్కెట్‌ ధరకు కాకుండా, అతి తక్కువ ధరకే ఎందుకివ్వాలి? ప్రభుత్వం కేటాయించిన భూముల్లో మూతపడిన పరిశ్రమలు ఎన్ని? ఆ భూములను ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? నగరంలో విలువైన భూములను పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేయడమే.

ఇదొక హిల్ట్‌ స్కామ్‌లా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి’ అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి విధానాన్ని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసినా, అది బీజేపీ ప్రభుత్వం చేసినా, కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసినా ప్రజల ప్రయోజనాలకనుగుణంగా ఉండాలి తప్ప పారిశ్రామిక వేత్తలకో, రాజకీయ నాయకులకో భూములను అప్పగించేలా ఉండకూడదని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ‘ఈ సమస్యలన్నింటిపై నిర్దిష్టమైన వివరాలను ప్రజలముందుంచాలి. ప్రత్యామ్నా య మార్గాలను అన్వేషించాలి. విలువైన భూములను పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేసి, లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తే ఆందోళనకు పూనుకుంటాం’ అని ఆయన హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -