అలుముకుంటున్న యుద్ధ మేఘాలు వేలమంది అమెరికా సైనికుల మకాం
వాషింగ్టన్ : మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు దట్టంగా అలుముకుంటున్నాయి. ఇరాన్‌పై అమెరికా దళాలు ఏ క్షణాన అయినా దాడి చేయవచ్చు. అమెరికా నౌకాదళానికి చెందిన యుద్ధ విమాన వాహక నౌక యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్ మధ్య ప్రాచ్య జలాలలో ప్రవేశించింది. దీంతో ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధభేరి మోగించబోతున్నారన్న ఊహాగానాలు విన్పిస్తు న్నాయి. అణ్వాయుధాలతో కూడిన యుద్ధ విమానాలను నింపుకొని యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్ (సీవీఎన్-72) ఈ నెల 19న మలక్కా జలసంధిని దాటింది. దానికి రక్షణగా డీడీజీ-121, డీడీజీ-111, డీడీజీ-112 అనే మూడు క్షిపణి విధ్వంసక యుద్ధ నౌకలు ముందుకు కదులుతున్నాయి. ప్రాంతీయ భద్రత, సుస్థిరత కోసం యుద్ధ విమాన వాహక నౌకను ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో మోహరించామని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఆ ప్రాంతంలో ఇప్పటికే వేలాది మంది అమెరికా సైనికులు మకాం వేశారు. గత అక్టోబరులో యూఎస్‌ఎస్ గెరాల్డ్ ఆర్.ఫోర్డ్ అనే యుద్ధ విమాన వాహక నౌకను అమెరికా మధ్యప్రాచ్య జలాలకు తరలించింది. ఆ తర్వాత ఇప్పుడు యుఎస్‌ఎస్ అబ్రహం లింకన్ అక్కడికి చేరుకుంటోంది. మరోవైపు పెంటగాన్ కూడా కొన్ని ఫైటర్ జెట్లను, సైనిక కార్గో విమానాలను అక్కడికి పంపింది. దీంతో ఇరాన్ సమీపంలో అమెరికా సైనిక మోహరింపు పెరిగిపోతోంది. ఇరాన్‌పై ఒత్తిడి పెంచాలని ట్రంప్ ఆదేశిస్తే ఇవన్నీ రంగంలోకి దిగుతాయి. అటు ఇరాన్ కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తనపై దాడి చేస్తే తగిన సమాధానమిస్తానని హెచ్చరించింది.
ఒప్పందానికి ఇరాన్ సుముఖం : ట్రంప్
రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ట్రంప్ ఓ ప్రకటన చేస్తూ తమతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్ సుముఖంగా ఉన్నదని చెప్పారు. ‘వారు ఒప్పందాన్ని కోరుకుంటున్నారు. నాకు ఆ విషయం తెలుసు. అనేక సందర్భాలలో వారు తమ అభీష్టాన్ని తెలియజేశారు. వారు మాతో చర్చలు జరపాలని అనుకుంటున్నారు’ అని ఆక్సియాస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ తెలిపారు. ఇదిలావుండగా ఇరాన్‌పై సైనిక చర్యకు తన గగనతలాన్ని, భూభా గాన్ని ఉపయోగించు కునేందుకు అనుమతించ బోనని యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్ స్పష్టం చేసింది. యూఏఈలోని అల్ దఫ్రా వైమానిక స్థావరంలో వేలాది అమెరికా దళాలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
ఇరాన్ జలాల్లో అమెరికా వార్ షిప్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



