సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ ప్రజా, ఉద్యోగ, కార్మిక, కర్షక వ్యతిరేక బడ్జెట్ అని సీఐటీయూ విమర్శించింది. ఈ మేరకు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ బడ్జెట్‌లో ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి కేటాయింపులు లేవనీ, గడువు ముగిసి రెండేండ్లైనా పీఆర్సీ ప్రస్తావన లేదని విమర్శించారు. కార్మికశాఖకు రూ.998 కోట్లు మాత్రమే కేటాయించి అందులోనూ కార్మికుల సంక్షేమం కన్నా మౌలిక వసతుల అభివృద్ధికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారనీ, అంగన్‌వాడీ టీచర్లు, ఆయా పారితోషికాల పెంపుదల గురించి మాట మాత్రం చెప్పలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆశాలు, మధ్యాహ్న భోజనం, ఎన్‌హెచ్‌ఎం తదితర కేంద్ర పథకాల్లోని స్కీం వర్కర్లకు మొండి చెయ్యి చూపించారని విచారం వ్యక్తం చేశారు.
పారిశ్రామిక కార్మికుల జీతాలు పెంచడంలో నిర్లక్ష్యం చూపించారనీ, మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాల పెంపుదలను పెడచెవిన పెట్టారని విమర్శించారు. వివిధ శాఖల్లో పని చేస్తున్న 2.5 లక్షల మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, డైలీవేజ్ తదితర నాన్ పర్మినెంట్ ఉద్యోగుల ఉద్యోగ భద్రత, జీతభత్యాల పెంపుదల, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రస్తావనే చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఈహెచ్‌ఎస్, ప్రమాద బీమా, ఆరోగ్య బీమాపై ప్రస్తావించకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రమాదాల్లో మరణిస్తున్న, శాశ్వత అంగవైకల్యం పాలైన కార్మికులు, వారి కుటుంబాలకు బడ్జెట్ భరోసానివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయరంగం, రైతు సంక్షేమానికి ప్రాముఖ్యమివ్వకుండా, కార్మికుల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చకుండా వారిపై మరిన్ని భారాలు మోపే విధంగా బడ్జెట్ ఉందని వారు విమర్శించారు.
హామీలకు, ఆచరణకు పొంతన లేదు : ఎస్.ఎల్.పద్మ
కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు, ఆచరణకు పొంతన లేదని టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఎల్. పద్మ విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన కార్మిక వర్గానికి మొండి చేయి చూయించిందని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కనీస వేతనాల పెరుగుదలని చూయించ లేదని తెలిపారు. ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకాన్ని ప్రయివేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించే పనికి పూనుకుందని విమర్శించారు. కేజీబీవీల్లో వంట చేసే వారిని పట్టించుకోలేదన్నారు. ఈ బడ్జెట్ అంకెల గారడీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యోగ, కార్మిక, కర్షక వ్యతిరేక బడ్జెట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



