Monday, February 9, 2026
E-PAPER
Homeజాతీయందేశ సార్వభౌమత్వంపై దాడి

దేశ సార్వభౌమత్వంపై దాడి

- Advertisement -

అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఆర్థిక వ్యవస్థకు విఘాతం
రైతుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం :సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో

న్యూఢిల్లీ : అమెరికాతో భారత్‌ చేసుకున్న వాణిజ్య ఒప్పందం దేశ సార్వభౌమత్వంపై దాడి అని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో విమర్శించింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.ఈ ప్రకటన ప్రకారం…భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం వివరాలు నెమ్మదిగా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘తాత్కాలిక ఒప్పందం’ పేరుతో అమెరికాకు భారీ రాయితీలిచ్చింద నే విషయం స్పష్టమవుతోంది. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం, జాతీయ సార్వభౌమత్వానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తుందని సీపీఐ(ఎం) ఆందోళన వ్యక్తం చేసింది.

లక్షలాది మంది రైతుల జీవనోపాధిపై దెబ్బ
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అమెరికా నుంచి పండ్లు, పత్తి, చెట్టు గింజలు, సోయాబీన్‌ నూనె కొన్ని ఇతర ఆహార, వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపై ఎటువంటి సుంకాలూ విధించకూడదని భారత ప్రభుత్వం అంగీకరించింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఆపిల్‌ సాగుదారులు, పత్తి, సోయా రైతుల జీవనోపాధిని తీవ్రంగా దెబ్బతీస్తుంది. హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూకాశ్మీర్‌, ఇతర రాష్ట్రాల్లోని ఆపిల్‌ రైతులు న్యూజిలాండ్‌ వంటి దేశాలతో గతంలో కుదిరిన వాణిజ్య ఒప్పందాల కారణంగా ఇప్పటికే నష్టపోతున్నారు. అమెరికాతో ప్రస్తుత ఒప్పందం వారి జీవనోపాధిని మరింత నాశనం చేస్తుంది. పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, తీవ్రమవుతున్న వ్యవసాయ సంక్షోభంతో ఇప్పటికే సతమతమవుతున్న పత్తి రైతులు కూడా ఇలాంటి విధ్వంసాన్నే ఎదుర్కొంటారని సీపీఐ(ఎం) పేర్కొంది.

భారతీయ వ్యవసాయానికి మరింత నష్టం
ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాల అడ్డంకులను తొలగించడానికి భారత ప్రభుత్వం అంగీకరించిందని నివేదికలు సూచిస్తున్నాయి. దీని అర్థం భారతీయ రైతులకు మద్దతు, సబ్సిడీలను వెనక్కి తీసుకోవడం, తద్వారా భారీ సబ్సిడీలు పొందే అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల నుంచి పోటీని ఎదుర్కోవలసి వస్తుంది. ఇది భారతీయ వ్యవసాయాన్ని మరింత నష్టదాయకంగా మారుస్తుంది.

అమెరికాకు లొంగిపోయిన మోడీ ప్రభుత్వం
ఈ వాణిజ్య ఒప్పందం భారత దేశ సార్వభౌమత్వానికి ఒక దెబ్బ, ఎందుకంటే రష్యా నుంచి చమురు కొనుగోళ్లతో సహా దేశ విధానాలను, నిర్ణయాలను అమెరికా నిర్దేశిస్తోందని సీపీఐ(ఎం) ఆరోపించింది. ఈ ఒప్పందానికి సంబంధించిన ఆదేశాల కట్టుబాట్లపై పర్యవేక్షణా యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉత్తర్వులను జారీ చేశారు. వీటిని ఉల్లంఘిస్తే తిరిగి సుంకాలను వేస్తామని కూడా బెదిరించారు. అయితే బీజేపీ ప్రభుత్వం సిగ్గులేకుండా అమెరికాకు లొంగిపోయిందని సీపీఐ(ఎం) విమర్శించింది.

ఒప్పందం పూర్తి వివరాలు పార్లమెంటు ముందుంచాలి
భారతదేశ వ్యూహాత్మక ప్రయోజనాలకు హానికలిగించే, అమెరికాకు లాభపరిచే సరఫరాలపె ప్రభుత్వం మరింతగా ఆధారపడటం అత్యంత విచారకరమని ప్రకటనలో పేర్కొంది. ఈ ఒప్పందం పూర్తి వివరాలను తక్షణమే పార్లమెంటు ముందు ఉంచి, ప్రజలకు తెలియజేయాలని సీపీఐ(ఎం) డిమాండ్‌ చేసింది. కార్మికులు, రైతులు, ప్రజల ప్రయోజనాలకు హానికరమైన ఏ ఒప్పందంపై కూడా సంతకం చేయకుండా ప్రభుత్వాన్ని నిలువరించాల్సిన అవసరముందని ప్రకటనలో స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -