Thursday, January 15, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయందాడి చేస్తే ప్రతీకారమే

దాడి చేస్తే ప్రతీకారమే

- Advertisement -

ట్రంప్‌నకు ఇరాన్‌ హెచ్చరిక వెనక్కి తగ్గిన అమెరికా
వైమానిక బేస్‌లనుంచి సిబ్బంది ఉపసంహరణ
దుబాయ్/దోహా:
తమ దేశంపై అమెరికా దాడి చేస్తే ప్రతీకారం తప్పదని ఇరాన్‌ హెచ్చరించింది. దీనితో వాషింగ్టన్‌ ఓ అడుగు వెనక్కి వేసింది. అమెరికా మధ్యప్రాచ్యంలోని వైమానిక స్థావరాల నుంచి కొంతమంది సిబ్బందిని ఉపసంహరించుకుంది. ఈ విష యాన్ని బుధవారం అమెరికా అధికారవర్గాలు ధ్రువీకరించాయి. ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఎదుర్కొం టున్న దేశీయ అశాంతిని అణచివేయడానికి ఇరాన్‌ నాయకత్వం ప్రయత్నిస్తున్నది. అయితే ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారుల తరపున జోక్యం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పదేపదే బెదిరింపు ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమెరికాకు గట్టి సమాధానం ఇచ్చేందుకు టెహ్రాన్‌ సిద్ధమైంది. ఈ నేపధ్యంలోనే ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరిగిన ప్రాంతాల్లోని కీలక స్థావరాల నుంచి అమెరికా కొంతమంది సిబ్బందిని ఉపసంహరించుకోవడం గమనా ర్హం. ఇరాన్‌ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా సైనిక జోక్యం జరిగే అవకాశం ఉందని యూరోపియన్‌ అధికారులు తెలిపారు. రాబోయే 24 గంటల్లో దీనిపై ట్రంప్‌ నిర్ణయం తీసుకుంటారని ఓ ఇజ్రాయిల్‌ అధికారి తెలిపారు. అయితే దాని పరిధి, సమయాన్ని స్పష్టంగా చెప్పలేదు.

ఖతార్‌లో యూఎస్‌ ఎయిర్‌బేస్‌
ఖతార్‌లోని అతిపెద్ద యూఎస్‌ స్థావరం అయిన అల్‌ ఉదీద్‌ వైమానిక స్థావరం నుంచి ఉపసంహరణలు జరుగుతున్నాయని ఖతార్‌ దేశం కూడా తెలిపింది. గతేడాది ఇరాన్‌ క్షిపణి దాడికి కొన్ని గంటల ముందు జరిగినట్టుగా పెద్ద సంఖ్యలో సైనికులను సాకర్‌ స్టేడియం, షాపింగ్‌ మాల్‌కు బస్సుల్లో తరలించినట్లు తక్షణ సంకేతాలు లేనప్పటికీ, కొంతమంది సిబ్బందిని స్థావరం నుంచి బయటకు వెళ్లమని చెప్పినట్టు ముగ్గురు దౌత్యవేత్తలు తెలిపారు. ఇరాన్‌లో రెండు వారాల క్రితం ఆ దేశ ఆర్థిక పరిస్థితులకు వ్యతిరేకంగా ప్రదర్శనలుగా ప్రారంభమయ్యాయి. ఈ అశాంతిని ఇటీవలి రోజుల్లో వేగంగా తీవ్రతరం చేసి, ఇరాన్‌లో మతాధికారుల పాలనను స్థాపించిన 1979 ఇస్లామిక్‌ విప్లవం తర్వాత అత్యంత హింసాత్మకమైనదంటూ ఆదేశంపై పాశ్చాత్య దేశాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ నిరసనల్లో 2,600 మందికి పైగా మరణించారని ఒక హక్కుల సంస్థ పేర్కొన్నట్టు వార్తల్ని విస్తృతం చేశారు. అయితే ఇరాన్‌ ఇంతటి విధ్వంసాన్ని ఎప్పుడూ ఎదుర్కోలేదని ఆ దేశ సాయుధ దళాల చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ అబ్దుల్‌రహీం మౌసావి బుధవారం తెలిపారు. పాశ్యాత్య దేశాల ప్రచారాన్ని విదేశీ శత్రువులని పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్‌లోని అంతర్గత వ్యవహారాలపై ఫ్రెంచ్‌ విదేశాంగ మంత్రి జీన్‌-నోయెల్‌ బారోట్‌ మాట్లాడుతూ ఇరాన్‌ సమకాలీన చరిత్రలో ఇదో అత్యంత హింసాత్మక అణచివేత అని కామెంట్స్‌ చేశారు. దీనిని కూడా ఇరాన్‌ అధికారులు సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు. తమ దేశంలో అశాంతిని సాయుధ ఉగ్రవాదుల పేరుతో అమెరికా, ఇజ్రాయిల్‌ రెచ్చగొడుతున్నాయని చెప్పారు. మరోవైపు యూఎస్‌ ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుంటే, సౌదీ అరేబియా, యూఏఈ నుంచి టర్కీ వరకు ప్రాంతీయ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడి చేస్తామని టెహ్రాన్‌ స్పష్టంగా తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరఖ్చి అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్‌కాఫ్‌ మధ్య ప్రత్యక్ష సంబంధాలను నిలిపివేశారు. ఖతార్‌లోని అల్‌ ఉదీద్‌లో సెంట్రల్‌ కమాండ్‌ ఫార్వర్డ్‌ హెడ్‌క్వార్టర్స్‌, బహ్రెయిన్‌లోని యూఎస్‌ నేవీకి చెందిన ఐదవ ఫ్లీట్‌ ప్రధాన కార్యాలయంతో సహా ఈ ప్రాంతం అంతా యూఎస్‌ బలగాల స్థావరాలు ఉన్నాయి. ఇరాన్‌ ప్రభుత్వం పతనం అంచున ఉన్నట్టు కనిపించడం లేదంటూ ఓ పాశ్చాత్య అధికారి చెప్తూ, అక్కడి మరణహోమం తీవ్రంగా ఉందంటూ ఆరోపణలు చేశారు. గతేడాది జూన్‌లో ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ ద్వారా అమెరికా నేరుగా బాంబుదాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే దీన్ని ఇరాన్‌ సమర్థవంతంగా తిప్పికొట్టి, అమెరికాకు వెన్నులో వణుకు పుట్టించింది. దీనితో అప్పుడు తాత్కాలికంగా వెనక్కి తగ్గిన అమెరికా, ఇప్పుడు ఆ దేశంలో అంతర్యుద్ధం ద్వారా రాజకీయ అస్థిరత సృష్టించాలని ప్రయత్నిస్తోంది.

ఇరాన్‌కు ప్రయాణాలు వద్దు భారత విదేశాంగ శాఖ సూచన
ఇరాన్‌లో దేశవ్యాప్తంగా అశాంతి, నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడికి ప్రయాణాలు చేయవద్దని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ బుధవారం ఒక సలహా ప్రకటన జారీ చేసింది. ‘ఇరాన్‌లో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాల దృష్ట్యా, తదుపరి నోటీసు వచ్చేవరకు భారత పౌరులు ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇరాన్‌కు ప్రయాణించవద్దని మరోసారి గట్టిగా సూచించడమైనది’ అని విదేశాంగశాఖ తన ప్రకటనలో పేర్కొంది. ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా అక్కడ నివసిస్తున్న ప్రవాస భారతీయుల కోసం ఒక అడ్వైజరీని జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 5న జారీ చేసిన అడ్వైజరీకి కొనసాగింపుగా, ఇరాన్‌లో అనుక్షణం మారుతున్న పరిస్థితుల దష్ట్యా భారత విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు తక్షణమే తమకు అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా ఇరాన్‌ను విడిచి వెళ్లాలని ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ఇరాన్‌లో ఉన్న ప్రవాస భారతీయులు, భారత సంతతి వ్యక్తులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, నిరసనలు లేదా ప్రదర్శనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది. ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపుల్లో ఉండాలని, స్థానిక వార్తలను గమనిస్తూ ఉండాలని తెలిపింది. పాస్‌పోర్ట్‌లు, ఐడీ కార్డులతో సహా అన్ని ప్రయాణ, ఇమ్మిగ్రేషన్‌ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. ఈ విషయంలో ఎలాంటి సహాయం కావాలన్నా భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపింది. అత్యవసర పరిస్థితిలో మొబైల్‌ నెంబర్లు: 0989128109115; 0989128109109; 089128109102; 089932179359. ఇమెయిల్‌: cons.tehran@
mea.gov.in సంప్రదించాలని పేర్కొంది.

తొలి ఏడాదిలోనే ట్రంప్‌ 573 వైమానిక దాడులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండో పదవీకాలం మొదటి సంవత్సరంలోనే గత అధ్యక్షుడు జో బైడెన్‌ నాలుగు సంవత్సరాల పదవీకాలంలో నిర్వహించిన విదేశీ వైమానిక దాడుల కంటే అధికంగా నిర్వహించారు. 2025 జనవరి 20 నుండి ఈ నెల 5 మధ్య అమెరికా 573 వైమానిక, డ్రోన్‌ దాడులను నిర్వహించింది, భాగస్వామ దేశాలతో కలిపి 658 దాడులు నిర్వహించిందని కాన్‌ ప్లిట్‌ వాచ్‌ డాగ్‌ అనే అమెరికా సంస్థ తన తాజా సర్వే రిపోర్ట్‌లో వెల్లడించింది. బైడెన్‌ నాలుగు సంవత్సరాల కాలంలో 494 దాడులతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఆర్మ్డ్‌ కాన్ఫ్లిక్ట్‌ లొకేషన్‌ అండ్‌ ఈవెంట్‌ డేటా ప్రాజెక్ట్‌ ‘ఏసీఎల్‌ఈడీ) డేటా ఆధారంగా ఈ రిపోర్టు తయారు చేసారు. అధికారికంగా ప్రకటించిన లెక్కల ప్రకారమే గత 12 నెలల్లో తొమ్మిది దేశాలలో జరిగిన విదేశీ సైనిక కార్యక్రమాల్లో కనీసంగా 1,093 మంది మరణించారని అంచనా వేశారు. బైడెన్‌ మొత్తం నాలుగు సంవత్సరాల పదవీకాలంలో 1,518 మంది మరణించారు. జూన్‌లో ఇరాన్‌ అణు కేంద్రాలపై అమెరికా దాడుల్లో మరణించిన వారి సంఖ్య ఇప్పటి వరకు తెలియలేదు. గత జనవరి, డిసెంబర్‌ మధ్య యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులపై 80 శాతానికి పైగా దాడులు జరిగాయని, వీటిలో 530 మందికి పైగా మరణించారని ఏసీఎల్‌ఈడీ తెలిపింది. ప్రస్తుతం వెనిజులాతో పాటు మరికొన్ని దేశాలపై ట్రంపు దాడులకు సిద్ధపడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -