తన జీవితకాలంలో గడిచిన రోజులని తలచుకునే సందర్భాలు మనిషి జీవితంలో ఉన్నాయంటే అతనిలో మనిషితనం, తన మూలాల పట్ల ప్రేమ, తాను నడిచి వచ్చిన దారుల పట్ల బాధ్యత మిగిలి ఉన్నాయని అర్ధం. మానవత్వాన్ని నిలుపుకుని మనసులోని మెత్తదనాన్ని కాపాడుకుని జీవించే మనిషే ‘ఓ మారు వెనక్కు వెళ్లిరావాలి’ అని కోరుకుంటాడు. గతకాలపు జ్ఞాపకాలను పోగేసుకున్న మానవులే వెనక్కు తిరిగి చూస్తారు. డా. కె. దివాకరాచారి గారి ఈ కవితాసంపుటిలో మనల్ని ఆకట్టుకునేది ఈ మనిషితనమే. విలువలతో జీవనబాటను అధిరోహించిన మానవత్వ పరిమళాలను ఆస్వాదించే అవకాశాన్ని పాఠకులకు కలిగిస్తుంది ఈ పుస్తకం.
తన జీవితాన్ని విమర్శించుకుంటూ ‘పోరాటమే ఊపిరిగా మనిషిగా బ్రతుకుతూ మానవత్వాన్ని స్వాగతించే పాత కొత్త కాలపు వారధిని నేనే’ అని ఆయన గర్వంగా చెప్పుకోవడం చూస్తే తన గతాన్ని నేటీని రాబోయే రేపుని ఆయన సమన్వయం చేసుకుంటున్న తీరు వీరి జీవిత మాధుర్యపు రహస్యాన్ని బహిర్గతం చేస్తుంది. బాల్యంలో తనకు ఆనందాన్ని పంచి ప్రతి చిన్న విషయాన్ని మధురంగా ఆయన గుర్తు చేసుకుంటూ ‘అమ్మనీడ లాంటి మల్లెపందిరి ఇప్పటికీ గుప్పుమంటూ గుర్తుకొస్తూనే ఉన్నాయి’ అని చెప్తుంటే ‘నడిచి వచ్చిన దారి కలిసి సాగిన ప్రయాణం ఎందరి హదయాలలో ప్రేమ జ్యోతుల ప్రకాశాన్ని అద్దిందో’ అని తలచుకుంటుంటే తన మూలాలను మర్చిపోనీ ఓ పరిపూర్ణ మానవుడు కనిపిస్తాడు.
ఎన్నో విషయాలపై ఆయన మనసు చేసే ఆలోచనలను కవితలుగా మలచుకున్నారు ఈ కవి. ‘అనురాగ కలయికలకు తావులేక ముందస్తు అనుమతుల మర్యాదలతో మనుషులెలా ఎదలను తడమగలరు’ అంటూ నేటి బంధాలను ప్రశ్నిస్తూనే ‘అమ్మతనపు అనుభూతి జన్మనిచ్చిన మాతభూమిలోనే సదా వెల్లివిరుస్తుందనేది నిజం కదా’ అని మాతదేశాన్ని తలచుకోవడం, కరోనా కాలంలో రాసిన కవితలో ‘అహాలు ఇహాలు శాశ్వతం కావని మనిషికి తోడైన మనిషిగా బ్రతకటమే నేటి కనువిప్పైన నగసత్యంగా అందరం కలిసి ఎలుగెత్తి చాటాలి” అని నినదించడం, ‘మనిషి సోషల్ ఆనిమల్ కాదిప్పుడు సోషల్ మీడియా బాధితుడు’ అని సున్నితంగా విమర్శించారు. ‘అన్నదాతలు పండించిన పంటను నోటికందిన అన్నం ముద్దను మట్టి పాల్జేసే రాక్షస వానల్ని చూస్తే ఎక్కడలేని భయం” అని ఆయన చెప్పుకుంటుంటే రైతన్న పట్ల ఆయన చూపే ప్రేమ మనసును తాకుతుంది.
నేటి దేశ, ప్రపంచ, రాజకీయ స్థితి గతులపై తన ఆలోచనకు కవిత్వ రూపాన్ని ఇస్తూ, ప్రజలను పావులుగా మరల్చుకుంటున్న రాజకీయ వ్యవస్థను, సామాజిక పరిస్థితులను ఈయన ప్రశ్నించడానికి వెనుకాడలేదు. ‘ప్రజల బాగు పక్కన పెట్టి కార్పొరేట్ ఊడిగం చేసే వ్యవస్థ’ను తన పద్దతిలో నిలదీశారు. గాజా స్థితిగతులపై రాసిన కవితలో ‘ఎడారి ఇసుకలో జీర్ణ గాజా నడుమ నిటారుగా తలెత్తి మొలకెత్తుతున్న ఆలివ్ మొలకలుగా రేపటి వెలుగుల ప్రస్థానపు దివ్వెలుగా భాసించక మానరు’ అంటూ ఆశా కిరణాలను వెదజల్లారు.
‘మనకు మనిషే కులమని, మంచి మనసే మతమని, నిజమెరిగి నిజాయితీగా ఇప్పుడైనా చెబుదామా మనం ఏమిట్లమోనని’ అని ప్రశ్నించే ఈ కవిని ప్రేమించకుండా ఉండగలమా? ‘ఒకరాజు చనిపోతే ‘రాజు పైశాచికత’ మరో రాజుగా అవతరిస్తుందనేది వాస్తవం అంతం కావాల్సింది ‘రాజులు’ కాదు రాజులను పుట్టిస్తున్న రాజరికపు వ్యవస్థ అని ఎలుగెత్తి చాటిన కవిలోని ఆ స్పష్టత ఆయనకు చేరువయిన ఎందరికో మార్గనిర్దేశం చేయగలదు.
హైదరాబాద్‌లో పెరిగిన కవి ఉర్దూ, హిందీ భాషల పట్ల పెంచుకున్న ప్రేమ వీరి కవితలలో వ్యక్తమవుతుంది. ‘దునియా మే సచ్చే దోస్త్ మిల్నా బడీ ముష్కిల్ హై, జిందగీ ప్యార్ కా గీత్ హై, వో సుబహ్ కభీతో ఆయేగీ’ అంటూ సాహిర్ ని, ‘రుక్ జానా నహీ తూ కహీ హార్కే’ అంటూ మర్జూహ్ పలుకుల్ని తన కవితలలో భాగం చేయడం వెనుక నిల్చింది హైదరాబాద్ సంస్కృతే.
తనకు స్పూర్తినిచ్చిన ప్రపంచ నాయకులకు కవి తన కవితలలో నివాళి అర్పించారు. ‘చే’పై కవి ‘జాషువా’పై తనకున్న ప్రేమను ప్రకటించుకున్నారు. ఆరిఫ్ పటేల్ హిందీ కవిత ప్రేరణతో ‘అన్నీ నేనైన నీ బ్రతుకులో కనీసం నా పేరిట ఉన్నదేదో చెప్పగలవా?’ అంటూ ప్రశ్నించడం, జర్మన్ పాస్టర్ మాటిన్ నీమోల్లర్ మాటల ప్రేరణతో ‘వాళ్ళ మాటకు పాటకు వంత పాడలేదని, వాళ్ళ జెండా నీడన నిల్చిలేదని, వాళ్ళ రంగును ఒంటికి అద్దుకోనందుకు దేశ ద్రోహులమంటూ నిర్భంధించ రానున్నారు’ అంటూ నేటి దేశ రాజకీయ స్థితిని పోల్చుకున్నారు.
కామ్రెడ్ ఆర్కెని గుర్తుచేసుకుంటూ ‘పెరిగిన సుఖజీవనాన్ని కాదని, జనం అందమైన జీవితం కోసం అజ్ఞాతాన అడుగులు తడబడక జీవితాన్ని ధారపోసిన ధీరుడివి నీవు’ అని రాసుకున్నారు కామ్రెడ్ శివసాగర్ పదవ వర్ధంతి సందర్భంగా ‘ముదిమిలో ఆయుధం భుజం మారినా, ఆచరణలో అడుగులు తడబడినా తలవంచని నీ అక్షరాల గువ్వలు ఉరికొయ్యలపై స్వేచ్ఛా గానాలు ఆలపిస్తూ ప్రచండ జనసంగీతాన్ని పల్లె పల్లెలో ప్రతి గుండెలో నీ పాట నీ మాట మ్రోగుతూనే ఉన్నాయి” అని ఆర్తితో స్మరించుకున్నారు.
‘జవాబులు దొరకని అమాయక ప్రశ్నల బాణాలతో దిమ్మతిరిగేలా ఎదిగామని భ్రమించిన మాకు ఇంకెంత ఎదగాలో నేర్పారు’ అంటూ ఈయన రాసిన ‘పిట్టలు వాలిన చెట్టు’ కవిత కవి ఇస్మాయిల్ ‘చిలకలు వాలిన చెట్టు’ను గుర్తుకు తెస్తుంది. లతా మంగేష్కర్ స్మతిలో ‘నీ పాట సుప్రభాతమై ప్రతి ఇంటా ఎద ఎదలో మ్రోగుతున్నంత కాలం నీవు మా మధ్య సజీవంగా ఉంటావన్నది నిజం దీది’ అంటూ రాసుకున్నారు. తన జీవన నేపద్యం, తన ఆలోచనలు తనను ప్రభావితం చేసిన మేధావుల స్పూర్తిని కవితల రూపంలో ప్రస్తావించిన దివాకరాచారి గారి ఈ కవితా సంపుటి వ్యక్తిగతం కాదు సామాజికం. సమాజం మలచిన వ్యక్తిగా తన జీవితాన్ని సామాజిక సష్టిగా కవి దివాకరాచారి ఆవిష్కరించుకున్న తీరు అత్యద్భుతం.
– పి.జ్యోతి,
98853 84740
వ్యక్తిగత జీవితాన్ని సామాజికంగా ఆవిష్కరించే ప్రయత్నం ‘ఓమారు వెనక్కి వెళ్లిరావాలి’
- Advertisement -
- Advertisement -