Monday, February 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅమెరికాకు బానిసగా దేశాన్ని మార్చే యత్నం

అమెరికాకు బానిసగా దేశాన్ని మార్చే యత్నం

- Advertisement -

– 12 ఏండ్ల మోడీ పాలనలో వేగంగా రూపాయి పతనం
– అబద్ధాల ప్రచారాలతో ప్రజలను ప్రభావితం చేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌
– హిందూత్వ, అస్థిత్వ రాజకీయాలతో బీజేపీ పబ్బం
– ప్రజలను చైతన్య పర్చడంలో మీడియా పాత్ర పెరగాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవి కుమార్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మన దేశాన్ని అమెరికాకు బానిసగా మార్చే ప్రయత్నాన్ని మోడీ సర్కారు చేస్తున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవి కుమార్‌ విమర్శించారు. మనోహ్మన్‌ సింగ్‌ ప్రభుత్వ హయాంలో డాలర్‌తో రూపాయి విలువ రూ.63కి పడిపోతే గగ్గోలు పెట్టిన బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ శ్రేణులు నేడు 93 రూపాయలకు పడిపోయినా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దేశ ఆర్థిక పరిస్థితినీ, కార్పొరేట్‌ అనుకూల విధానాలను ప్రశ్నిస్తే సహించలేని స్థితిలో బీజేపీ పాలకులు ఉన్నారని విమర్శించారు. ప్రశ్నించే వారిపై దేశోద్రోహులనే ముద్ర వేయడాన్ని ఆక్షేపించారు. అబద్ధపు ప్రచారాలను విస్తృతంగా చర్చకుపెట్టి అదే నిజం అనేలా చేయడం, ఆధ్యాత్మిక భావనలో ప్రజలు మునిగి ఉండేలా చేయడంలో ఆర్‌ఎస్‌ఎస్‌ విజయవంతం అవుతున్నదన్నారు. హిందూత్వ ముసుగేసుకుని, అస్థిత్వ రాజకీయాలను అడ్డం పెట్టుకుని బీజేపీ రాజకీయ పబ్బం గడుపుతున్నదని విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హిట్లర్‌, ముస్సోలిని మాదిరిగానే మోడీ సర్కారు కూడా జాతి పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నదని విమర్శించారు. ట్రంప్‌ ఒత్తిడి, బెదిరింపులతో మోడీ సర్కారు ఇరాన్‌, రష్యా, తదితర దేశాలతో ఆయిల్‌ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసుకోవడాన్ని తప్పుబట్టారు. పదే పదే టారిఫ్‌లను మోపుతూ, భారతీయులను దొంగల్లా చిత్రీకరించి ఇండియాకు పంపుతుంటే ట్రంప్‌నకు మోడీ ఎందుకు సాగిలపడుతున్నారని నిలదీశారు. మోడీ హయాంలో మన దేశ విదేశాంగ విధానం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. బీహార్‌, యూపీ, తదితర రాష్ట్రాల్లో కుల రాజకీయాలను పెంచి పోషిస్తూ బీజేపీ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నదని ఎండగట్టారు. కమ్యూనిస్టుల పోరాటాల ఫలితంగా పేదల కోసం వచ్చిన ప్రతి చట్టాన్నీ మోడీ సర్కారు రద్దు చేసుకుంటూ పోతున్న తీరును ఎండగట్టారు. జీఎస్టీ పేరుతో రాష్ట్రాల ఆర్థిక వనరులను కేంద్రం లాక్కున్నదనీ, ఇప్పుడు నిధుల కేటాయింపులు సరిగా చేయకుండా ఫెడరల్‌ వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నదని విమర్శించారు. మోడీ సర్కారు పూర్తిగా మహిళా, గిరిజన, దళిత వ్యతిరేక ప్రభుత్వమని పలు ఉదహరణలను విడమర్చి చెప్పారు. సాంస్కృతిక రంగంపై ఆర్‌ఎస్‌ఎస్‌ దాడి పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివాసీ గిరిజనులు హిందువులే కదా వారి భూములను లాక్కొని అడవుల నుంచి ఎందుకు వెళ్లగొడుతున్నారు? నూటికి 80 శాతం మంది రైతులు హిందూవులే కదా వారు అడుగుతున్న కనీస మద్దతు ధరల చట్టం ఎందుకు చేయడం లేదు? నూటికి 80 శాతం ప్రజలు హిందూవులే కదా…కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లిపోయిన విద్యా, వైద్య రంగాలను ఎందుకు ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని సేవలందించట్లేదు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. కేవలం హిందూత్వ ముసుగేసుకుని దేశ సంపదను కార్పొరేట్లకు మోడీ సర్కారు దోచిపెడుతున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను విడమర్చి చెప్పడంలో జర్నలిస్టుల పాత్ర పెరగాలనీ, అందులోనూ నవతెలంగాణ పత్రిక కీలక భూమిక వహించాలని ఆకాంక్షించారు. సోషల్‌ మీడియా విస్తృతి పెరుగుతున్న తరుణంలో జర్నలిస్టులు నిత్యం అప్‌డేట్‌ కావాలనీ, ప్రజలకు అవసరమైన సమాచారాన్ని సమగ్రంగా ఇవ్వాలని సూచించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎమ్‌డీ అబ్బాస్‌ మాట్లాడుతూ..బీజేపీ ప్రభుత్వం దేశాన్ని మధ్య యుగాలకాలానికి తీసుకెళ్తున్నదని విమర్శించారు. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ చైతన్యం కావాలన్నారు. ప్రజాస్వామ్యం, లౌకికత్వం, సమానత్వం, రాజ్యాంగం పరిరక్షణ కోసం జరిగే పోరాటాలు మరింత పెరగాలని ఆకాంక్షించారు. నవతెలంగాణ సీజీఎం పి.ప్రభాకర్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నవతెలంగాణ ఎడిటర్‌ రాంపల్లి రమేశ్‌, బుకహేౌస్‌ ఎడిటర్‌ కె.ఆనందాచారి, జనరల్‌ మేనేజర్లు రఘు, వెంకటేశ్‌, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్‌, బాబూరావు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -