Friday, February 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅమ్మిన భూమి వేరొకరికి రిజిస్ట్రేషన్‌ చేసే యత్నం

అమ్మిన భూమి వేరొకరికి రిజిస్ట్రేషన్‌ చేసే యత్నం

- Advertisement -

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బాధితుల ఆత్మహత్యాయత్నం

నవతెలంగాణ – ముస్తాబాద్‌
యాబై ఏండ్ల కింద కొన్న భూమిని పట్టా చేయకపోగా.. అమ్మిన వ్యక్తి ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించే ప్రయత్నం చేశాడు. దీంతో బాధితులు ఆందోళనకు గురై గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రెవెన్యూ సిబ్బంది గమనించి అడ్డుకున్నారు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. ముస్తాబాద్‌ మండలం సేవాలాల్‌ తండాకు చెందిన ధరంసోత్‌ రాజవ్వ శంకర్‌ దంపతులు సుమారు 50 ఏండ్ల కింద తొర్లమద్ది గ్రామానికి చెందిన సుజాత- శ్రీధర్‌రావు దగ్గర 73/1, 196/ఏ సర్వే నంబర్‌లో మూడెకరాల 16 గుంటల భూమిని కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ధరంసోత్‌ రాజవ్వ-శంకర్‌ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారి కుమార్తెకు వరకట్నం కింద అందులో నుంచే ఎకరం రాసిచ్చారు.

దాంతో కుమార్తె కుటుంబం ఆ పొలంలోనే ఇల్లు కట్టుకొని.. మిగతాది సాగు చేసుకుంటోంది. కాగా, భూమి విక్రయించిన యజమాని హైదరాబాద్‌లో స్థిర నివాసం ఉంటూ, రాజవ్వ-శంకర్‌కు రిజిస్ట్రేషన్‌ చేసే విషయములో తీవ్ర జాప్యం చేశారు. ఈ క్రమంలో ఆ భూమిని వేరే వారికి రిజిస్ట్రేషన్‌ చేయించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుసుకున్న రాజవ్వ, ఆమె కుమార్తె నిర్మల గ్రామస్తులను తీసుకుని గురువారం తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చారు. తహసీల్దార్‌ రామచంద్రంకు వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన తహసీల్దార్‌ భూమిని రిజిస్ట్రేషన్‌ చేయకుండా సైట్‌ను బ్లాక్‌ చేసి పెట్టారు. అయినప్పటికీ తమ భూమి తమకు వస్తుందో లేదోనని ఆందోళన చెందిన రాజవ్వ, కుమార్తె, అల్లుడు పెట్రోల్‌ చల్లుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. రెవెన్యూ సిబ్బంది అడ్డుకొని, వారికి విషయం అర్థమయ్యేటట్టుగా సముదాయించి, భూమి ఇక ముందు ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్‌ కాదని స్పష్టం చేయడంతో సమస్య సద్దుమణిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -