ఆచార్య ఎన్. గోపి అరుణమ్మ దంపతులది 54 సంవత్సరాల ప్రేమబంధం . ఒకరికి ఒకరు తోడుగా కష్టసుఖాలు పంచుకున్నారు. కలలను పండించుకున్నారు. జీవితాన్ని తీర్చిదిద్దుకున్నారు. 2025 సంవత్సరం ‘సెప్టెంబర్ 26’ అన్ని ఎప్పటిలాగే ఉన్నాయి. కానీ ఆ సాయంత్రం ”కప్పలా దూకింది మృత్యువు” గోపి నుండి ఆరుణని విడదీసి తీసుకెళ్లింది. ‘ఇంటి దీపం ఆరిపోయింది/ కంటి చూపు చీకటయింది’ సహచరిని కోల్పోయిన ఒంటరి కవి దుఃఖ సముద్రమైనాడు. పదే పదే ఆమెను తలుచుకుంటూ, పిలుచుకుంటూ, సుదీర్ఘ జీవితానుభవాలను, జ్ఞాపకాలను హృదయావేదనగా రగిలిపోతూ రాసిన 20 కవితల కవితా సంపుటి ‘సతీస్మృతి’.
”ప్రియతమా!/ ఈ పాతాళంలో నేనుండలేను/ నన్ను పైకి చేదుకో/ దయార్ద్ర హృదయంతో/ ఈ భౌతిక స్మృతుల నుంచి ఆదుకో!” అంటూ విలపిస్తున్న ఈ మాటలు మనసులను కలిచివేస్తాయి. ఎక్కడికి వెళ్లినా పక్కనే ఉండే ఆమె మరణం ‘ఓ జ్వలన జ్ఞాపకమయ్యింది’. ‘ఇప్పుడు పట్టుకోడానికి/ నీ చెయ్యి దొరకదు/ చీకటి రాత్రులు ఎంతకీ తరగవు’ అంటూ తల్లడిల్లిపోతున్నారు. ఆత్మీయులను కోల్పోయిన వారి బాధ అందరిదీ ఒకటే! తలుచుకొని తలుచుకొని కుమిలిపోతూ ఉంటారు. ఉప్పొంగే దుఃఖంతో గోపి కవి తన బాధను కొంతలో కొంతైనా అక్షరాలలో ఒదిగించి, తనను తాను సాంత్వన పరుచుకునే ప్రయత్నం చేశారు.స్మృతి కవిత్వం రాసిన కవులను గుర్తు చేసుకొని, (పేజి. 28) ‘అనుభవానికి వస్తే తప్ప/ ఏది అర్థంకాదు’ అంటున్నారు. ఎంతటి దుఃఖం అయినా, పిడకలలే వచ్చినా, ఎన్ని భయాలు వెంటాడినా, నైరాశ్యం వైరాగ్యం మనసును ఆవరించినా, జీవితాన్ని వెల్లదీయక తప్పదు. బతికినంత కాలం భౌతిక స్మృతులు విడిచిపోవు. జీవమున్నంతవరకు చేయవలసిన పనులు ఉంటాయి.అయితే ఎప్పటికీ అంతర్గతంగా ఆత్మీయులను కోల్పోయిన దుఃఖమూ ఉంటుంది.
ఎవరైనా తమకు ముది మది తప్పుతుందనీ విచారపడుతుంటారు. కానీ తట్టుకోలేని తీవ్రమైన దుఃఖంతో గోపిగారు ‘డిమెన్షియా’ను ఆహ్వానిస్తున్నారు. ఆమె ఇష్టపడి కట్టుకున్న ఇంటిలో ఏ మూలకు వెళ్లిన ఆమె ఆనవాళ్లు. ‘తట్టుకోవడం కష్టం!/ నాకిప్పుడు/ ముదిమది తప్పితే బాగుండును’ అంటున్నారు. ‘నీటికీ కన్నీటికీ /భేదం చెరిగిపోతే బాగుండును/ నేను ఒకే ఎరుకలోకి/ జారిపోతే బాగుండును’ ఆమెలేని ఆమె జ్ఞాపకాలన్నీ వెంటాడుతుంటే నిబ్బరంగా ఉండడం కష్టమే మరి. భార్యవియోగంతో జీవించడం దుర్భరమైనది. ఇది విముక్తి లేని దుఃఖం./ ‘హంస ఎగిరిపోయింది/ చిత్రహింస మిగిలిపోయింది’. ఒక పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ మూర్తి ఉంటుందన్నమాట మనం తరచుగా వింటుంటాం కదా!
‘బాకీ’ కవితలో- ‘పేదవాడిని/ ప్రేమించి పెళ్లి చేసుకున్నావు/ నా కెరీర్ కోసం/ నీ కెరీర్‌ను వాయిదా వేశావు/ నా ఒక్కడి అభ్యున్నతి/ మనిద్దరి జీవన గతి’ అంటూ ‘నీకు జీవితాన్నే/ అప్పు పడ్డాను/ బాకీ తీరుస్తాననేమో/ చెప్పకుండా వెళ్ళిపోయావు’ అని ఆమె సహకారాన్ని ఒకప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అవ్యాజమైన ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. అరుణ ఆయనకు ప్రేరణ. అతని కవితలకామె ప్రథమ శ్రోత. కాఫీ టైంలో కళ్ళు మూసుకుని కవితలు వినేది. ఇద్దరు కూడా భావుకతను గుండెల నిండా వొంపుకున్న కవులు. కవిత్వమే మనల్ని కలిపింది నిలిపింది అని గుర్తు చేసుకుంటున్నారు. ‘దాంపత్యం/ ఎంత సుందరమైంది!/ సార్ధక రమ్యమైంది!!/ తెల్ల కాగితం మీద/ కావ్యం పుట్టినట్టు’ సుదీర్ఘకాలం అన్యోన్యంగా జీవితాన్ని పంచుకున్న సహచరి వియోగంతో హృదయమే శూన్యమైన కవి. దాంపత్య జీవితాన్ని గురించి కవితాత్మకంగా పలవరిస్తున్నాడు.
చిరునవ్వు కవితలో ‘వెయ్యి క్యాండిల్స్/ ఒక్కసారి ఆరిపోయినట్టు/ నీ చిరునవ్వు/ అంధకారంగా పరిణమించింది’ తన ఇంటిని జీవితాన్ని కాంతిమయం చేసిన/ ఆమె పిలిచినా పలకని దూరాలకు వెళ్లిపోయింది. ‘అర్ధాంతరంగా ఆగిన పద్యంలా/ అగాధమైన లోయ ఎదురయ్యింది’ ఈ పరిస్థితుల్లో ఎవరు మాత్రం ఏమని ఓదార్చగలరు. చుట్టూ ఎంత మంది ఉన్నా, కొంతసేపు కొంత దుఖాన్ని పంచుకోగలరు. ‘ఆరోగ్యం జాగ్రత్త!’ అని చెప్పగలరు అంతే కదా! ‘ఎవరైనా/ ఎప్పుడైనా పోయేదే/ అంటారు మిత్రులు’. కానీ ఇది ఎవరు కూడా పూరించలేని వెలితి. పోగొట్టలేని ఒంటరితనం. అందుకే కవి ‘చూసేవారికి విసుగే/ దుఃఖం కూడా అలవాటవుతుంది/ ఎదుటివారు క్షమించాలి నన్ను/ ఎంతకని ఓదారుస్తారు/ దీనికి అంతెప్పుడో!’ అంటున్నారు. లోకాన్ని చదివిన అపారమైన జీవితానుభవం వారిది.
‘అమ్మ-ఆమె’ కవితలో’ ఒకప్పుడు/ అమ్మలేని వాన్నయ్యాను/ ఇప్పుడు రెండోసారి/ అమ్మను కోల్పోయాను’. అంటున్నారు. ఒక వయసు దాటిన తర్వాత బాధ్యతలన్నీ తీరిన వృద్ధాప్యంలో, నిర్మలమైన దాంపత్యంలో భార్య తల్లిలా అనిపించడం సహజం. ఒకరి పట్ల ఒకరు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహిస్తారు. ఒకరి క్షేమాన్ని ఒకరు గాఢంగా కాంక్షిస్తారు. కొంత మనసుకు తీరిక దొరికే సమయం కూడా ఇదే కదా! అంతులేని ఆత్మీయతతో ఒకరి కోసం ఒకరం అన్నట్లు అద్వైతమై జీవిస్తుంటారు. ఈ సంపుటిలోని చివరి కవిత ‘ఆత్మ శాంతి’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆమె మనసేమిటో ఆయనకు బాగా తెలుసు. అందుకే అంటున్నారు ‘మన అబ్బాయి/ నన్ను కాపాడుకుంటున్నాడు/ మన మనుమల లేత కళ్లు/ నన్ను కోలుకోమంటున్నాయి’
ఈ మాటలు విన్న ప్రేమమూర్తి అరుణ ఏ లోకాన ఉన్నారో గానీ తప్పకుండా ఆమె ఆత్మ శాంతించే ఉంటుంది. అనుబంధాల విలువలు తెలిసిన కవి ‘ఒంట్లో మిగిలి వున్న/ ఈ కాస్త శక్తిని వారికోసం/ వెచ్చించాలనుకుంటున్నాను’ అంటూ తనకు తానే మార్గ నిర్దేశనం చేసుకుంటున్నారు. ‘వృద్ధోపనిషత్’ కవితా సంపుటి ద్వారా వద్ధులలో ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపిన గోపి ఈ కవితా పంక్తుల ద్వారా తాను ఏమి చేయాలనుకుంటున్నాడో తెలపడమే కాదు, మూడో తరాన్ని దృష్టిలో పెట్టుకోవలసిన అవసరాన్ని కూడా తెలుపుతున్నారు. ఉప్పొంగే దుఃఖము నుండి కొంత తేరుకొని ఈ విధంగా స్మృతి కవిత్వానికి ముగింపును పలకడం సంతోషదాయకం.
గుండెను పిండివేసే ఈ ఎలిజీ కవితలు చదువుతున్నప్పుడు మనసు కదిలిపోయి ద్రవిస్తుంది. ఈ ప్రపంచాన్ని కట్టి పడేసేది అనుబంధాలు ఆత్మీయతలు మాత్రమే. ఈ సంపుటిలోని కవితలు విషాదాన్ని వినిపిస్తున్నప్పటికీ, ఎన్నో మానవీయ విలువలను తెలుపుతున్నాయి. ఒక తాత్విక సందేశాన్ని వైరాగ్య భావాన్ని కలిగిస్తున్నాయి. మహాకవి తన సహచరి కోసం కలవరిస్తూ రాసిన ప్రేమగీతాలు ప్రాణ గీతాలు ఆర్త గీతాలు ఇవి. ఆదర్శ దాంపత్యాన్ని తెలుపే పరస్పర గౌరవం,ప్రేమ, సహకారం, విశ్వాసం, నమ్మకం, సహనం, త్యాగం వంటి గుణాలు ఉండాలని సందేశిస్తున్నాయి కూడా.
- గడ్డం సులోచన, 7702891559



