– వ్యవసాయంపై వాతావరణ మార్పుల ఎఫెక్ట్
– ఉపాధి కోసం పట్టణాలకు పురుషులు
– పొలం సాగు.. కుటుంబ బాధ్యతలో మహిళలు
– తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైనం
వ్యవసాయాధారిత దేశమైన భారత్‌లో ఇప్పటికీ రైతులు తీవ్ర ఇబ్బందులనే ఎదుర్కొంటున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉన్న ఈ రంగం ఇటు ప్రభుత్వాల ఉదాసీన వైఖరి, అటు వాతావరణ అనూహ్య మార్పుల కారణంగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నది. కరోనా వంటి మహమ్మారి కాలంలో అనేక రంగాలు కుదేలైనా వ్యవసాయ రంగమే కొంత వరకు ఆదుకున్నది. ఇంతటి కీలకమైన రంగంలో మహిళలూ భాగస్వాములవుతున్నా.. వారి శ్రమను ఎవరూ గుర్తించటం లేదు. ప్రభుత్వాలు వారిని పట్టించుకుంటున్న పరిస్థితులూ కనబడటం లేవు. ముఖ్యంగా వాతావరణ మార్పులతో వ్యవసాయం తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటుంది. ఆ సమయంలో మహిళా రైతులపైనే అదనపు భారం పడుతున్నది. తీవ్రమైన ఉష్ణ పరిస్థితులు కావచ్చు, భారీ వర్షాలు కావచ్చు.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వ్యవసాయాన్ని మహిళలు నెట్టుకొస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే దీనిని మహిళా సాధికారతగా చెప్పలేమనీ, ఇది వారి భుజాలపై అదనపు భారం మోయడం వంటిదని విశ్లేషకులు చెప్తున్నారు.
న్యూఢిల్లీ: వాతావరణ మార్పుల కారణంగా పంటలు విఫలమవుతున్నప్పుడు.. పురుషులు ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్తుంటారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యతలతో గ్రామాల్లోనే ఉంటున్న మహిళలు పొలాలను సాగు చేస్తున్నారు. అదే సమయంలో ఇంట్లో ఆహారం, పిల్లలు, పెద్దలను చూసుకోవడం, ఇతర అవసరాలు వంటివి వారి భుజాలపై పడుతున్నవి. ఇది బాధతో కూడిన బాధ్యతల బదిలీగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. కొన్ని పరిశోధనల ప్రకారం.. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు మహిళలు వ్యవసాయంలో పని చేసే అవకాశాలు తొమ్మిది శాతం ఎక్కువవుతున్నాయి. మహిళల ఆధ్వర్యంలోని రైతు కుటుంబాలు ప్రతి ఏడాదీ రూ.3 లక్షల కోట్లు నష్టపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగిన ప్రతి రోజూ మహిళల పొలాల్లో పంట విలువ పురుషుల కంటే మూడు శాతం ఎక్కువగా పడిపోతున్నది. అయితే మహిళలకు భూమి హక్కులు తక్కువ (కేవలం 11 శాతం)గా ఉండటం, రుణాలు లేదా క్రెడిట్‌కు తక్కువ అవకాశాలు (యాక్సెస్), సాంకేతిక శిక్షణ, వాతావరణ సమాచారం అందుబాటులో లేని అంశాలు ఇందుకు కారణాలవుతు న్నాయని విశ్లేషకులు చెప్తున్నారు.
మహిళలకు ఆరోగ్య సమస్యలు
మహిళలు వేడి వాతావరణంలో ఎక్కువగా శ్రమ చేయడంతో అనే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకు.. మహారాష్ట్రలో రుక్మిణి కాంబ్లే అనే ఒక మహిళ ప్రతి రోజు రెండు నొప్పి మాత్రలు వేసుకుంటూ పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతీ పది రోజులకు ఒకసారి ఆమె మూర్చ పడుతుంది. అయితే ఆమె కుటుంబం మొత్తం ఆమెపైనే ఆధారపడి ఉన్న కారణంగా పని చేయక తప్పని అనివార్య పరిస్థితులు రుక్మిణి కాంబ్లేకు ఏర్పడ్డాయి. ఇది ఒక్క రుక్మిణి కాంబ్లే సమస్య మాత్రమే కాదు.. దేశంలోని లక్షలాది మంది మహిళల వాస్తవ పరిస్థితికి ఇది అద్దం పడుతున్నదని విశ్లేషకులు చెప్తున్నారు. భారత్‌లోని గ్రామీణ వ్యవసాయంలో మహిళలు 80 శాతం వరకు ఉన్నారన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.
8 రాజకీయ నిర్లక్ష్యం
అయితే ఇలాంటి పరిస్థితి యాధృచ్చికం కాదనీ, ఇది ఒక నిర్మాణాత్మక నిర్లక్ష్యమని మేధావులు, సామాజిక కార్యకర్తలు చెప్తున్నారు. భారత వ్యవసాయం ఏండ్లుగా సంక్షోభంలో ఉన్నదని గుర్తు చేస్తున్నారు. మహిళల కష్టం, వారి శ్రమ రైతులుగా గుర్తించబడలేదని అంటున్నారు. మోడీ సర్కార్ పునరుత్పత్తి శక్తి విధానాలు ప్రధానంగా పురుషుల ఆధిపత్యంలో ఉన్నాయనీ, మహిళా రైతుల బాధను గుర్తించడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపిస్తున్నారు. మహిళలకు న్యాయం, రక్షణ దక్కేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాన హక్కులతో కూడిన వాతావరణ విధానాన్ని తీసుకురావాలని మేధావులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటగా మహిళలను రైతులుగా గుర్తించాలనీ, వారికి భూమి హక్కులు, రుణ సదుపాయాలు, ప్రభుత్వ పథకాలు అందించాలని అంటున్నారు. మహిళల అవసరాలే కేంద్రంగా ప్రభుత్వాలు పథకాలను తీసుకువచ్చి, అందులో వారి భాగస్వామ్యాన్ని పెంచాలని వివరిస్తున్నారు.
లింగ సమానత్వాన్ని పట్టించుకోని కేంద్ర పథకాలు
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సౌరశక్తి రంగంలో చాలా పురోగతిని సాధించినట్టు చెప్పుకుంటుంది. కానీ సౌర శిక్షణలో పాల్గొన్న యువతలో మహిళలు ఆరు శాతమే కావడం గమనార్హం. ఇక రైతులకు
సౌర పంపులను ఇవ్వడానికి పీఎం కుసుమ్ పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది. అయితే మహిళలకు భూమి పత్రాలు, రుణ సదుపాయాలు లేని కారణంగా ఈ ప్రయోజనాలు వారికి అందడం లేదు. భారత్‌లో సౌరశక్తిపై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. మహిళా రైతుల గురించి పట్టించుకోవడం లేదు. వారికి ఎలాంటి రక్షణ కూడా లేదని మేధావులు చెప్తున్నారు.
ఆమెపై అదనపు భారం
- Advertisement -
- Advertisement -



