పోటాపోటీగా సంక్షేమ పథకాలు.. ప్రకటిస్తున్న బీహార్ పార్టీలు
నగదు బదిలీలతో తమ వైపు తిప్పుకునేందుకు మోడీ, నితీశ్ ప్రయత్నాలు
పాట్నా : బీహార్‌లో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. విజయం కోసం అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా మహిళల ఓట్లపై కన్నేసిన ప్రధాన పక్షాలు వారిపై వరాల జల్లులు కురిపిస్తున్నాయి. వారి కోసం సంక్షేమ పథకాలు ప్రకటిస్తూ ఆకట్టుకునే పనిలో పడ్డాయి. కీలకమైన మహిళల ఓట్లను రాబట్టుకోవడానికి వారికే ఎక్కువ సంఖ్యలో పార్టీ టిక్కెట్లు ఇచ్చేందుకు కూడా సిద్ధపడుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శుక్రవారం ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ పథకం కింద 25 లక్షల మంది మహిళల బ్యాంక్ ఖాతాల్లో పది వేల రూపాయల చొప్పున నగదును జమ చేశారు. గత నెల 26వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ఇదే పథకం కింద వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 75 లక్షల మంది మహిళల బ్యాంక్ ఖాతాల్లో పది వేల రూపాయల చొప్పున జమ చేశారు. బీహార్‌లో జేడీయూ, బీజేపీ అధికార భాగస్వాములుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఎస్‌హెచ్‌జీలను ఉపయోగించుకొని…
బీహార్‌లో 10.75 లక్షల స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జీలు) ఉన్నాయి. ఈ బృందాల్లోని సభ్యులను ‘జీవిక దీదీలు’ అని కూడా పిలుస్తారు. అధికార జేడీయూ వీరిని తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోంది. వీరి ద్వారా మహిళా ఓట్లను రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇది ప్రతిపక్షాల ఆరోపణ కాదు. పేరు చెప్పడానికి ఇష్టపడని అధికార జేడీయూ సీనియర్ నేత, నితీశ్ క్యాబినెట్ మంత్రి ఒకరు ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. కాగా ప్రతిపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే ‘మై బహిన్ సమ్మాన్ యోజన’ పథకాన్ని ప్రకటించాయి. ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు నెలకు రెండున్నర వేల రూపాయల సాయాన్ని అందజేస్తామని తెలిపాయి. ఇదిలావుండగా గతంలో రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిం చిన ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ కూడా మహిళల ఓట్లపై దృష్టి సారించింది. రాబోయే శాసనసభ ఎన్నికలలో 40 మంది మహిళలకు (మొత్తం స్థానాలు 243) పార్టీ టిక్కెట్లు ఇస్తామని ప్రకటించింది. ఈ నెల 9న అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ విడుదల చేస్తుంది.
ఏమిటీ పథకం?
ఈ పథకం కింద ప్రతి కుటుంబంలోని ఓ మహిళ తనకు ఇష్టం వచ్చిన వ్యాపారాన్ని ప్రారంభించు కోవచ్చు. ఇప్పటి వరకూ కోటి మంది మహిళల బ్యాంక్ ఖాతాల్లో పది వేల కోట్ల రూపాయలు జమ అయ్యాయి. 2025 జనవరి నాటికి బీహార్ ఓటర్లలో 48 శాతం మంది మహిళలే. వీరిలో కోటి మంది ఈ పథకం కింద పేర్లు నమోదు చేసుకున్నారు. 18-60 సంవత్సరాల వయసు కలిగిన మహిళలు ఈ పథకం ద్వారా లబ్ది పొందేందుకు అర్హులు. అర్హులైన మిగిలిన మహిళలకు ఈ నెల 8న ఆర్థిక సాయం బదిలీ చేయడం జరుగుతుందని నితీష్ కుమార్ తెలిపారు.
మహిళా ఓటర్లే అధికం
అధికార ఎన్డీఏలోని భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జేడీయూ మహిళలే లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్ష మహాగట్‌బంధన్ (మహా కూటమి) భాగస్వామ్య పక్షాలైన జేడీయూ, కాంగ్రెస్ పార్టీలు కూడా మహిళా ఓటర్లను ఆకర్షించే పనిలో పడుతున్నాయి. ముఖ్యంగా కులం పేరు వెల్లడించని లేదా ఏ కులానికీ చెందని తటస్థ మహిళా ఓటర్ల సంఖ్య బీహార్‌లో గణనీయంగా ఉంది. అభ్యర్థుల జయాపజయాలను వీరే నిర్ణయిస్తారు. 2020 శాసనసభ ఎన్నికల్లో 62 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేయగా 26 మంది విజయం సాధించారు. గత సంవత్సరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 59.45 శాతం మంది మహిళలు ఓటేయగా 53 శాతం మంది పురుషులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ మహిళలే ఎక్కువగా ఓట్లు వేశారు.
సభలో ప్రాతినిధ్యం
గత శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 13 మంది మహిళలకు పార్టీ టిక్కెట్లు ఇవ్వగా తొమ్మిది మంది గెలుపొందారు. జేడీయూ 22 మంది మహిళల్ని బరిలో దింపితే ఆరుగురు మాత్రమే శాసనసభలో ప్రవేశించారు. ప్రతిపక్ష ఆర్జేడీ 16 మందిని పోటీకి దింపగా ఏడుగురు, కాంగ్రెస్ ఏడుగురికి టిక్కెట్లు ఇవ్వగా నలుగురు విజయం సాధించారు. బీహార్ ఎన్నికల్లో చిన్న చిన్న పార్టీలు కూడా మహిళలకు పార్టీ టిక్కెట్లు కేటాయిస్తున్నాయి. గడచిన ఎన్నికల్లో పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నందున అన్ని రాజకీయ పార్టీలు వారిని ఆకట్టు కోవడానికి పలు సంక్షేమ పథకాలు ప్రకటి స్తున్నాయని రాజకీయ విశ్లేషకుడు ఎన్‌కే చౌదరి చెప్పారు.
రేపో మాపో షెడ్యూల్
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కొందరు అధికారులతో కలిసి శుక్రవారం పాట్నా చేరుకున్నారు. ఎన్నికల ఏర్పాట్లపై ఆయన స్థానిక అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. తిరిగి ఢిల్లీ చేరుకున్న తర్వాత ఆయన ఎన్నికల తేదీలు ప్రకటించే అవకాశం ఉంది.