”తొలిరోజుల్లో నా రచనలు శ్రీశ్రీకి పంపేవాడిని. కుటుంబరావు గారితో అనుబంధం ఏర్పడ్డాక ఆయనకు పంపేవాడిని. పెదపూడి లో ఆయన అభ్యుదయ పాఠశాలలో పాఠాలు చెప్తున్నప్పుడు వారికో ఉత్తరం రాసి ఒక కథ పంపించాను. 1946 మే28వ తేదీ నాడు ఆయన నాకో ఉత్తరం రాస్తూ ”కథ అందింది. కోపంతో రాసిన ట్టుంది. కథగా చూస్తే అట్టే పాకంలేదు. ప్రజాశక్తికి పంపిస్తున్నాను.” అని రాశారు. నా రచనలు నేనే తర్వాత ప్రజాశక్తికి పంపేవాడిని.
సెలవుమీద ఇంటికి వచ్చినప్పుడు పనిగట్టుకుని బెజవాడలో ఆగి ప్రజాశక్తినగర్‌లో సెట్టి ఈశ్వరరావు ఇంట్లో బసచేసి, ప్రజాశక్తిలో పనిచేస్తున్న అనిసెట్టి సుబ్బారావు, విద్వాన్ విశ్వం మొదలైన వారిని కలుసుకొనేవాడిని:
కమ్యూనిస్టు వ్యతిరేకులతో వాగ్వివాదాలు పెట్టుకొనేవాడిని. ఎవరితో ఘర్షణ పడ్డానో జ్ఞాపకం లేదు గాని పసుమర్తి సుబ్బారావు గారికి ఉత్తరం రాస్తూ అందులో ఆ వ్యక్తెవరో ”కమ్యూనిజంలో ప్రతిమనిషీ విధిగా బానిస అవుతాడు అన్నాడు. పనిచెయ్యకపోతే తిండిలేదు.” అనే మహాసూత్రానికి అపార్థం ఇది.
…1930వ దశకంలో వామపక్షానికి ఎంతో మద్దతుగా రచనలు చేసిన పాశ్చాత్య కవుల వల్ల నేను నలభయ్యవ దశకంలో ప్రభావితమయిన వాణ్ణే. పి.డి.లూయిస్. స్టీఫెన్, స్పెండర్, డబ్ల్యు.హెచ్ ఆడెనె మొదలైన వాళ్ల విశ్వా సాలు, విశిష్ట శిల్పరీతులూ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ఒకప్పుడు కమ్యూనిజాన్ని అభిమానించి, సోవియట్ యూనియన్ విధానాలను సమర్థించిన పాశ్చాత్య రచయితలు 1940వ దశకంలో కమ్యూనిస్టు వ్యతిరేకత చాటే గ్రంథ రచయితలయ్యారు. జార్జి ఆర్వెల్, ఆర్థర్ కోయిస్టలర్లు అటువంటి వాళ్లు. ‘1984’, ‘డార్క్‌నెస్ ఎట్ నూన్’ ది గాడ్ దట్ ఫెయిల్డ్’ వంటి పుస్తకాలు, ‘ఎన్‌కౌంటర్’ వంటి పత్రికలు చదవసాగాను. వీటిని పరిశీలనగా పఠించగానే శాస్త్రీయ సామ్యవాద మౌలిక సూత్రాల మీద నా విశ్వాసం మరింత గట్టిపడింది
ఎమర్జన్సీ తరువాత నాకు సీపీఐ(ఎం) వారి పాలసీతో భావసామ్యత బలపడ్డాక ప్రజాశక్తిలో నా రచనలు ప్రచురించేవాడిని. ప్రజాశక్తి దినపత్రిక అయ్యాక 1981 ఆగస్టు 1వ తేదీ నుండి ఒక సంవత్సరం ప్రతివారం ఆ పత్రికకు ఒక కవిత విధిగా పంపించేవాడిని. పాలసీలకు చేరువైనప్పుడే వాటిని సమర్థిస్తూ ప్రజా ఉద్యమాలు తోడ్పడినప్పుడే అనుబంధాలు ఏర్పడుతాయి. వారు నన్ను స్వంతం చేసుకొనడానికి ప్రయత్నించవలసిన అవసరం లేదు. అలాగే ఏపార్టీ వారైనా నన్ను స్వంతం చేసుకొనడానికి ప్రయత్నిస్తే వాళ్లకు హక్కు భుక్తమయ్యేటంత స్థితిలో నేను కూడా ఉండనన్న విషయం గ్రహించటం అవసరం. నా అంతట నేను నా విశ్వాసాలు అత్యంత సన్నిహితంగా ఉన్న పార్టీకే నా సాహిత్య సాంస్కతిక సేవలు అర్పిస్తాను. అందుకే 1952 ఎన్నికల్లో పాటలు రాసినట్టే 1982లో కూడా పాటలు రాశాను ఇది గమనించండి.”
కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు
కార్మిక కర్షక మధ్య తరగతులకెంతో యిష్టులు
విశాలాంధ్రలో ప్రజారాజ్యమని
పిలుపిచ్చిన వాళ్లెవరో
పోరాటంలో తెలంగాణలో
భూములు పంచినదెవరో ||కమ్యూ||
నీకై నాకై అందరి కొరకై
నెత్తురు చిందేదెవరో
శ్రామిక రాజ్యస్థాపన కోసం
ప్రాణాలిచ్చేదెవరో ||కమ్యూ||
(ప్రజాశక్తి- 19.12.1982)
(ఆగస్టు 31 ఆరుద్ర శతజయంతి ముగింపు)
తెలకపల్లి రవి