ఆనాటి వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగింది భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం. ఆ పోరాటం పదిలక్షల ఎకరాల భూమిని పేదలకు పంచింది. మూడు వేల గ్రామాల్లో గ్రామ స్వరాజ్యాలను స్థాపించింది. ఈ పోరాటంలో నాలుగు వేల మందికి పైగా వీరులు అమరులయ్యారు. ఈ సాయుధ పోరులో సామాన్యులే బందూ కులు పట్టి పదమూడు వేల మంది ప్రత్యక్ష పోరాటం చేశారు. పదివేల మందికి పైగా కొన్నేండ్లపాటు జైళ్లలో నిర్భం దాలకు గురయ్యారు. నిజాం సైన్యం, రజాకార్, యూనియన్ సైన్యాల చేతిలో యాభై వేల మందికి పైగా అనేక అకృత్యాలు, అమానుషాలకు గురయ్యారు. తెలంగాణ సాయుధ పోరాటం అమోఘమైన విజయాలను, అనుభవాలను అందించింది. నేటికీ స్ఫూర్తిని, చైతన్యాన్ని రగిలిస్తూనే వున్నది.
భారతదేశంలో 662 సంస్థానాల్లో నైజాం (హైదరాబాదు) సంస్థానం అన్నిటికంటే పెద్దది. నిజాం రాజు ప్రజలను పీడించి, బ్రిటీష్ దొరలకు నజరానాలిచ్చేవారు. నిజాం వంశీయులు 224 ఏండ్లు పాలన సాగించారు. మొదటి నవాబు ఖమ్రుద్దిన్ కాగా చివరి నవాబు నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్.
ఈయన 1911 నుండి 1948 వరకు పాలించాడు. ప్రపంచంలోకెల్లా అత్యంత సంపన్నుడు నిజాం నవాబు. ప్రజలను పీల్చి పిప్పిచేసి ధనాన్ని మూటగట్టేవారు. నిజాం ఎస్టేట్‌లో దేశ్‌ముఖ్‌లు, దేశ్‌పాండేలు, జాగీర్ధార్లు, జమిందార్లు, అమీన్‌లు, భూస్వాములు, దొరలదే రాజ్యాం. నిజాం దోపిడీకి వీళ్లే మూలస్తంబాలు. వీళ్ల చేతిలో లక్షలాది ఎకరాల భూమి వుండేది. ప్రజలు కేవలం వెట్టి చేసే బానిసలుగా వుండేవారు. ప్రజలపై నిజాం నవాబు విపరీతమైన పన్నులు వేసేవారు. లెవీ గల్లా పేరుతో రైతులను పీడించి భూములను బలవంతంగా గుంజుకునే వారు. నైజాంలో ఐదు కోట్ల 30 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉండేది. ఇందులో మూడు కోట్ల ఎకరాలు ప్రభుత్వ భూమి. దీనిపై శిస్తు వుండదు. ఇది ఖల్సా లేదా దివానీ ప్రాంతంగా పిలువబడేది. కోటిన్నర ఎకరాలు జాగీర్దారీ వ్యవస్థ పేరుతో ఉండేది.
మొత్తం భూమిలో పదిశాతం నిజాం సొంత కమతం కింద ఉండేది. దీన్ని సర్ఫేఖాస్ అనేవారు. దీనిపై వచ్చే ఆదాయం నిజాం కుటుంబం, ఆయన పరివారానికి వాడేవాడు. ఇది కాకుండా ఆ రోజుల్లోనే 70 లక్షలు సంస్థానం ఖజానా నుండి నిజాం నవాబుకు చెల్లించేవారు. సర్ఫేఖాస్ ప్రాంతాల, గ్రామాల ప్రజలు నిజాంకు కట్టు బానిసలుగా వుండేవారు. వారి నియంతృత్వానికి, దోపిడీకి వ్యతిరేకంగా ప్రశ్నించే హక్కు ప్రజలకు ఏమాత్రం ఉండేది కాదు. ప్రశ్నిస్తే రాజదండన తప్పదు. సంస్థానంలో ప్రజలందరూ హీనంగా, దీనంగా, కట్టుబానిసలుగా జీవితాలు వెల్లదీసే పరిస్థితి వుండేది. ఇదీ నైజాం కాలం దోపిడీ విధానం కొనసాగిన తీరు.
తెలంగాణలో నైజాం కాలంలో 1942లోనే నిర్వహించిన సర్వే ప్రకారం 3665 మంది దేశ్‌ముఖ్‌లు, దేశ్ పాండేలు ఉండేవారు. వారి కింద మత్తేదార్, బంజర్ దార్, ఇజార్‌దార్లు ఉండేవారు. జనాగామ తాలూకాలో విసు నూర్ దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి ఒక్కడే 60 వేల ఎకరాల భూస్వామి. అయినా అతని భూ దాహం తీరలేదు. పేదల భూములను గుంజుకోవడం వదలలేదు. ఆయన కొడుకు బాబుదొర దేశ్‌ముఖ్ తల్లి జానకమ్మ తాను పోషించిన గూండాలచేత పేద ప్రజలను పీడించడంలో ఆరితేరిన వాళ్లు. విసునూర్ రామచంద్రారెడ్డి వద్ద బందగీ సోదరుడు అబ్బాస్ అలీ ఉండేవాడు. బందగీ భూమిని గుంజుకొమ్మని దొర అతనిని ప్రోత్సహించాడు. బందగీ ఎదురు తిరిగాడు.
అబ్బాస్ అలీ చేత కోర్టులో దావా వేయించాడు. మూడేండ్లు నడిచింది. బందగీ గెలిచాడు. దీన్ని అవమానంగా దొర భావించాడు. బందగీని తన గూండాలచేత హత్య చేయించాడు. అప్పటికీ బందగీ వయస్సు 22 ఏండ్లు మాత్రమే. ఎక్కడ హత్య చేయబడ్డాడో అక్కడే అతని సమాధిని నిర్మించారు. బందగీ భూ పోరాటం ఆధారంగానే సుంకర, వాసిరెడ్డి ‘మా భూమి’ నాటకాన్ని రాసారు. వందల ప్రజర్శనలిచ్చారు. తెలంగాణలో గ్రామ గ్రామాన మా భూమి నాటకం ప్రజలను చైతన్యం చేసింది. దొరలపై పోరాడే ధైర్యాన్నిచ్చింది. విసునూరు గడి నుండే సాయుధ పోరాటం మొదలవడానికి అగ్గి రాజుకుంది.
చిట్యాల ఐలమ్మ తిరుగుబాటుతో అది మొదలైంది. పాలకుర్తిలో ఐలమ్మ భూములను గుంజుకోవడానికి పొలంలో పండిన ధాన్యం గడికి తరలించటానికి విసునూరు దేశ్‌ముఖ్ గూండాలు చేసిన ప్రయత్నం ఫలించలేదు. భీమిరెడ్డి నర్సింహారెడ్డి అండతో ఆంధ్రమహాసభలో చేరిన ఐలమ్మ చైతన్యవంతంగా ప్రజలను ఏకంచేసి దొర గూండాలను తిప్పికొట్టింది. తెలంగాణలో ఐలమ్మ పోరాటం గ్రామ గ్రామానికి పాకింది. మట్టి మనుష్యులను మహా వీరులను చేసింది. జమిందారు, జాగీర్ధారులకు వ్యతిరేకంగా పోరాటాలు తీవ్రమయ్యాయి. 1946 జూలై 4న కడి వెండి గ్రామంలో ప్రజలు ఊరేగింపు జరిపారు. ఇది సహించలేని జానకమ్మ తన వద్ద వున్న 200 మంది గూండాలచే ఊరేగింపుపై దాడి చేయించింది. కాల్పులు జరిపించింది. కాల్పుల్లో ముందు భాగంలో ఉన్న దొడ్డి కొమురయ్య అమరుడయ్యాడు. కొమురయ్య బలిదానం ఉద్యమాన్ని ఉరకలెత్తించింది. దీన్ని సహించలేని నిజాం కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించాడు. గ్రామాల్లో సైనిక శిబిరాలను ఏర్పాటు చేయించాడు. ఇదే సాయుధ ప్రతిఘటనా పోరాటానికి దారితీసింది.
తెలంగాణ సాయుధ రైతాంగ తిరుగుబాటు తొలిదశలో గొప్ప విజయాలను సాధించింది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలు, తదితర ప్రాంతాలలో పోరాటాలు ఉధృత మయ్యాయి. 16 వేల చదరపు మైళ్ల వరకు పోరాటాలు విస్తరించాయి. 30 లక్షల జనాభా, మూడు వేల గ్రామాలలో రైతాంగ పోరాటాలు సాగాయి. పది లక్షల ఎకరాలు భూ పంపిణీ జరిగింది. దొరలు, భూస్వాములు గడీల నుండి పట్టణాలకు పారిపోయారు. వెట్టిచాకిరీ రద్దయింది. ఈ పోరాటం అసఫ్‌జాహి మధ్య యుగాల నాటి పాలనను పునాదులతో కుదిపి వేసింది. 1946 సెప్టెంబర్ 17న సాయుధ పోరాటానికి కమ్యూనిస్టు పార్టీ పిలుపునివ్వగా అది 1951వరకు కొనసాగింది. ఈ పోరాటం విజ యం సాధిస్తే దేశమంతటికీ వ్యాపిస్తుందని గ్రహించి నాటి నెహ్రూ ప్రభుత్వం బెంబేలెత్తింది. అందుకే 1948 సెప్టెం బర్ 13 నుండి భారత ప్రభుత్వం నిజాం సంస్థానంపై పెద్దఎత్తున ”ఆపరేషన్ పోలో” పేరుతో సైనిక చర్య చేపట్టింది. నాలుగు రోజుల్లోనే నిజాం నవాబు లొంగు బాటుతో హైదరాబాదు సంస్థానం భారత యూని యన్‌లో విలీనమైంది. దానితో అసబ్‌జాహిల 224 సంవత్సరాల పాలన ముగిసింది.
ప్రజలను అనేక రకాలుగా దోచుకున్న అదే నిజాం నవాబును రాజ్‌ప్రముఖ్‌గా 1956 వరకు కూర్చోబెట్టి పాలన సాగించారు. అనేక అకృత్యాలకు కారణమైన రజాకార్లకు నాయకత్వం వహించిన ఖాసింరజ్విని కేంద్ర ప్రభుత్వం చట్టరీత్యా శిక్షించకపోగా, ఆనాడు హోం మంత్రిగా వున్న సర్ధార్ వల్లాబారుపటేల్ సకల మర్యాదలతో పాకిస్థాన్‌కు పంపించారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కమ్యూనిస్టులను టార్గెట్ చేసి దాడులు చేయటం మొదలు పెట్టింది. యూనియన్ సైన్యాలతో భూస్వాములు గ్రామాలలోకి ప్రవేశించి పేద రైతుల నుండి పంచిన భూములను తిరిగి లాక్కోవడం, ప్రజలను దోచుకోవడం, కమ్యూనిస్టుల జాడలను చెప్పాలని మహిళలపై అకృత్యాలకు పాల్పడుతూ తీవ్రమైన నిర్భందాలకు గురిచేశారు. అయినా, ప్రజలు నాయకుల జాడలు చెప్పలేదు. కమ్యూనిస్టుల నాయకత్వంలో భారత సైన్యానికి వ్యతిరేకంగా మూడేండ్ల పాటు ప్రాణాలను కూడా లెక్కచేయ కుండా సాయుధ గెరిల్లా పోరు సాగించారు. ఆనాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లాబారు పటేల్ రెండు వారాల్లో కమ్యూనిస్టులను అణిచివేస్తామని ప్రకటించారు. బ్రిటీష్ పాలన నాటి ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ఫిబ్రవరి 1957న నెహ్రూ ప్రభుత్వం కమ్యూనిస్టు ఉద్యమకారులపై ప్రయోగించింది. అధికార మార్పిడి జరిగిన మూడేండ్లలోనే ప్రజలపై 1982 సార్లు కాల్పులు జరిపారు.
జైళ్లలోనే 82 మంది ఖైదీలను కాల్చిచంపారు. పోలీస్ యాక్షన్ పేరుతో తెలంగాణలో లక్షలాది మందిపై మిలటరీ నిర్భందాలు ప్రయోగించారు. ఆ విధంగా తెలంగాణ సాయుధ పోరును తీవ్రనిర్భంద కాండతో అణిచివేసే ప్రయత్నం చేశారు. మిలటరీ గవర్నర్ జయంత్‌నాథ్ ఛౌదరీ కూడా రెండు వారాల్లో సాయుధ పోరును ఇనుప బూట్ల కింద నలిపివేస్తామని హెచ్చరించాడు. కానీ, 1948 సెప్టెంబర్ 18 నుండి 1951 అక్టోబర్ 21 వరకు సాయుధ పోరాటం మిలటరీతో సాగింది. తెలంగాణ సాయుధ పోరాటం అణిచివేయడానికి భారత ప్రభుత్వం 1947-48లో కాశ్మీర్ సమస్యపై పాకిస్థాన్‌తో యుద్ధం చేయడానికి ఎంత డబ్బు ఖర్చుపెట్టిందో, అంత ధనం తెలంగాణ సాయుధ పోరాటాన్ని అణిచివేయడానికి ఉపయోగించిందని పుచ్చలపల్లి సుందరయ్య తన గ్రంథంలో పేర్కొన్నారు.
హిందువులు, ముస్లింలు, క్రైస్తవులనే తేడా లేకుండా, దోపిడీకి వ్యతిరేకంగా ఐక్యంగా పాల్గొన్న ఈ మహత్తర సాయుధ పోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తున్నది. ముస్లిం నవాబుకు వ్యతిరేకంగా హిందువులు జరిపిన తిరుగుబాటుగా చిత్రిస్తున్నది. బీజేపీ తమ స్వార్థరాజకీయ ప్రయోజనాల కోసం ఈ దుష్ప్రచారానికి ఒడిగడుతున్నది. ఇది ఎన్నో త్యాగాలు చేసిన పోరాట యోధులను, ఆ పోరాటాన్ని అవమానపర్చటమే. ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత అన్ని లౌకిక శక్తులపై వున్నది. ఆ నాటి పోరాట యోధుల ఆశయాలు నెరవేరాలంటే వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులు కలిసి సమరశీల ప్రజాపోరాటాలు సాగించాల్సి వుంది. అప్పుడు మాత్రమే పీడిత ప్రజలకు నిజమైన విముక్తి లభిస్తుంది. ఆనాటి అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగడమే నేటి కర్తవ్యం.
జూలకంటి రంగారెడ్డి
9490098349