2014 నుంచి ఇప్పటివరకు గనుల కేటాయింపులపై శ్వేతపత్రం విడుదల చేయండి : ఇష్టాగోష్టిలో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సింగరేణిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు దోచుకున్న దోపిడీపై విచారణ జరపాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు సింగరేణిలో గనుల కేటాయింపు, అనంతరం జరిగిన దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకర్లతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రాష్ట్రంలో జరిగిన దోపిడీపై మాట్లాడుతుంటే, గుజరాత్‌ను ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. సింగరేణి కార్మికుల పోరాటాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకుంటే, ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఎక్కువ గనుల దోపిడీ ఇప్పుడు కొనసాగుతోందని ఆరోపించారు.కేసీఆర్ పాలనలో సింగరేణిని దోచుకుంది ఆయన కుటుంబమేనన్నారు. ఆ సంస్థలో దోచుకున్న సొమ్ముతోనే బీఆర్‌ఎస్ పార్టీ నడిపించారని ఆరోపించారు. గతంలో కేసీఆర్ కుటుంబమే దోచుకుంటే, కాంగ్రెస్ పాలనలో మంత్రులు, దళారులు దోచుకుంటున్నారని విమర్శించారు.
అందుకే ఒకరి అవినీతిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అవినీతిపై బీఆర్‌ఎస్ లేఖ రాస్తే, బీఆర్‌ఎస్ అవినీతిపై కూడా విచారణ జరుపుదామా? అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెబుతున్నారని గుర్తు చేశారు. రూ.42వేల కోట్ల సింగరేణి సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం దోచుకుని సింగరేణిని అప్పుల పాల్జేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు సింగరేణిని లాభాల్లోకి తెస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక ఆ సొమ్మంతా దారి మళ్లించడం పరిపాటైందని తెలిపారు. సింగరేణి విషయంలో రెండు పార్టీల తీరును చూసి ప్రజలు, కార్మికులు అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. తమ భాగోతం బయటపెడితే, మీ భాగోతం తాము బయటపెడతామంటూ మాట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
కేటీఆర్, హరీశ్‌రావు తో సహా అందరినీ సాక్షులుగా పిలిస్తే, అసలు ఫోన్ ట్యాపింగ్ దోషులెవరని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ దొంగలను సాక్షులుగా పిలవడమేంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా సిట్‌కు స్వేచ్ఛ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఒత్తిడికి లొంగితే సిట్ అధికారులకు ఉన్న విశ్వసనీయత దెబ్బతింటుందని తెలిపారు. కేటీఆర్‌లో ఇంకా అహంకారం తగ్గలేదని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ చేయలేదని చెబుతున్న కేసీఆర్, కేటీఆర్ తన సవాల్‌కు సిద్ధమా? అని ప్రశ్నించారు. మావోయిస్టుల జాబితాలో హీరోయిన్లు, వ్యాపారులతోపాటు బీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేల ఫోన్ నెంబర్లను చేర్చింది నిజం కాదా? అన్నారు. ఆఖరికి కేసీఆర్ బిడ్డ, అల్లుడి ఫోన్లను కూడా ఆ జాబితాలో చేర్చి ఫోన్ ట్యాపింగ్ చేయించలేదా? అని నిలదీశారు.
సింగరేణిలో దోపిడీపై విచారణ జరపాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



