Sunday, September 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకాళేశ్వరం మొత్తం ప్రాజెక్టుపై విచారణ జరిపించాలి

కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టుపై విచారణ జరిపించాలి

- Advertisement -

– సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి ఫోబియా :చిట్‌చాట్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుఎన్‌.రాంచందర్‌రావు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కాళేశ్వరంలో కొన్ని బ్యారేజీలపైనే కాకుండా మొత్తం ప్రాజెక్టుపైనా విచారణ జరిపించాలనీ, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులపైనా విచారణ చేయించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.రాంచందర్‌రావు డిమాండ్‌ చేశారు. రాహుల్‌గాంధీ హైడ్రోజన్‌ బాంబు తుస్సు బాంబు అయిందని విమర్శించారు. శ్యామ్‌పిట్రోడా లాంటి వాళ్ల సలహాలు, మార్గదర్శనం తీసుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు. శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ప్రతి విషయాన్ని కూడా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై నెట్టడం సీఎం రేవంత్‌రెడ్డికి అలవాటుగా మారిందని విమర్శించారు. రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి ఫోబియా పట్టుకున్నదన్నారు. కాంగ్రెస్‌ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కిషన్‌రెడ్డి అడ్డంకిగా మారాడని చూపెట్టడమేంటని ప్రశ్నించారు. సీఎంగా రేవంత్‌రెడ్డి ఇప్పటికే 50 సార్లకుపైగా ఢిల్లీ పర్యటనలు చేశారనీ, ఈ విషయంలో ఆఫ్‌ సెంచరీ వేడుకలు చేసుకోవాలని దెప్పిపొడిచారు. ఈ తరహా పాలన క్షేమకరం కాదన్నారు. రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్‌ వ్యవస్థ గాడి తప్పిందని ఆరోపించారు. బ్యూరోక్రాట్ల నియామకంలో రేవంత్‌ సర్కార్‌ ఫెయిల్‌ అయిందని విమర్శించారు. విద్యావ్యవస్థ గాడిలో పెట్టాలని విన్నవించారు. ఉద్యోగులకు జీతాలిచ్చేందుకే పైసలు లేవుగానీ ఓయూకెళ్లి వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తామనటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. అంతర్జాతీయ సమస్యలు వచ్చినప్పుడు పార్టీలకతీతంగా ఒక్కటి అవ్వాల్సింది పోయి కేంద్రపై విమర్శలు చేయడం తగదని కాంగ్రెస్‌ నేతలకు సూచించారు. వ్యక్తులు చనిపోయినా ఓటు తొలగించడం అంత సులువు కాదనీ, దానికి ఒక ప్రొసీజర్‌ ఉంటుందని చెప్పారు. రాహుల్‌ ఇప్పుడు ఓట్‌ చోరీ అంటున్నారనీ, ఎలా ఓట్‌ చోరీ అయిందో చెప్పట్లేదని అన్నారు. గత ఎన్నికల్లో తెలంగాణలో బోగస్‌ ఓట్లు నమోదయ్యాయనీ, దాని వెనుక కాంగ్రెస్‌, ఎంఐఎం ఉన్నాయని విమర్శించారు. రాజ్‌ నాథ్‌ సింగ్‌ లైనప్‌ విషయంలో ఈటలకు, పార్టీకి మధ్య ఎలాంటి విభేదాలు పొడచూపలేదని స్పష్టం చేశారు. తెలంగాణలో పొలిటికల్‌ గ్యాప్‌ ఉందనీ, దాన్ని అందిపుచ్చుకుని ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. మావోయిస్టుల వెనుక విదేశీయుల హస్తం ఉందని ఆరోపించారు. అందుకే వారిని లొంగిపోవాలని డెడ్‌లైన్‌ విధించామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు పెట్టొద్దని కాంగ్రెస్‌ సర్కారు భావిస్తున్నదనీ, వాటిని నిర్వహించకుంటే కేంద్రం నుంచి నిధులు రావని చెప్పారు. జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఇద్దరు ముగ్గురు ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -