– ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఆపాలి : పౌరహక్కుల సంఘం డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఛత్తీస్‌గడ్‌లోని నారాయణపూర్ జిల్లా అబూజ్‌మడ్ ఇలాకా మూస్పర్షి అడవుల్లో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌పై విచారణ జరపాలని పౌరహక్కుల సంఘం తెలంగాణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు మాట్లాడుతూ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కడారి సత్యనారాయణరెడ్డి (కోసా దాద), కథా రామచంద్రారెడ్డి (రాజు దాద), వికల్ప్‌లు గతనెల 22న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించినట్టుగా ఛత్తీస్‌గడ్ ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. మరుసటి రోజు మావోయిస్టు పార్టీ విడుదల చేసిన ప్రకటనలో కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణలను పోలీసులు అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్టుగా ప్రకటించిందని అన్నారు. ఆ ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులకు వేరే బాధ్యతలను పార్టీ అప్పగించిందనీ, అందులో భాగంగానే పది నెలల క్రితమే వారు రారుపూర్ శివారులో ఉన్నారని వివరించారు. వారిని నిరాయుధులుగా గతనెల 11 నుంచి 20 మధ్య అరెస్టు చేశారని చెప్పారు. రహస్య సమాచారం కోసం చిత్రహింసలు పెట్టి 22న అబూజ్‌మడ్ ఇలాకా మూస్పర్షి అడవుల్లో ఎన్‌కౌంటర్ పేరుతో కిరాతకంగా ఛత్తీస్‌గడ్ ప్రభుత్వం కాల్చి చంపిందని విమర్శించారు. ఆపరేషన్ కగార్‌ను ప్రారంభించి 21 నెలలు అవుతున్నదనీ, ఇప్పటి వరకు 80 ఎన్‌కౌంటర్లలో 700 మందిని హత్య చేసిందని చెప్పారు. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలతోపాటు జాతీయ వామపక్ష పార్టీలన్నీ మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలనీ, ప్రజాస్వామిక వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని కోరాయన్నారు. కేంద్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదని అన్నారు. లక్షల కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పగించడం కోసమే మావోయిస్టులపై దాడులకు పాల్పడుతున్నదని విమర్శించారు. ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. 400 సాయుధ క్యాంపులను ఎత్తేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరపాలని సూచించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే పోస్టుమార్టం నిర్వహించారని విమర్శించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో రీపోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం నేతలు బల్లా రవీంద్రనాథ్, జె లింగన్న, మాలతి తదితరులు పాల్గొన్నారు.
ఛత్తీస్‌గడ్‌లో బూటకపు ఎన్‌కౌంటర్‌పై విచారణ జరపాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES