ప్రజలను మోసం చేస్తున్న మునుగోడు ఎమ్మెల్యే..
డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, జిల్లా సహాయక కార్యదర్శి
నవతెలంగాణ- మునుగోడు
మొదటగా శంకుస్థాపన కల్వకుంట్ల గ్రామంలోనే ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఏర్పాటు చేయాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, జిల్లా సహాయక కార్యదర్శి కట్ట లింగస్వామి డిమాండ్ చేశారు. ఆదివారం మునుగోడు మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్మాణం చేపట్టేందుకు భూమి పూజ చేస్తున్న విషయం తెలుసుకున్న డివైఎఫ్ఐ నాయకులు కల్వకుంట్ల గ్రామంలో నల్ల జెండాతో నిరసన తెలిపారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి ప్రజలు ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని గెలిపిస్తే, ప్రజలను మోసం చేస్తూ ఎమ్మెల్యే కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.
గత సంవత్సరం క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణాన్ని కల్వకుంట్ల గ్రామంలో శంకుస్థాపన చేశారు కానీ , పాఠశాల నిర్మాణానికి ఆ గ్రామ పరిధిలో ప్రభుత్వ భూమి అణువుగా ఉందని రెవెన్యూ అధికారులు సమాచారం ఇవ్వగా వెంటనే అక్కడ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ గ్రామానికి చెందిన దళిత రైతులు కొంత భూమిని సాగు చేస్తున్న కూడా పాఠశాల నిర్మాణానికి ఆ భూమి అవసరమని రాత్రికి రాత్రే పత్తి పంటను నాశనం చేసి సరైనటువంటి పరిహారాన్ని కూడా ఇవ్వకుండా ఆ భూమిని రైతుల వద్ద నుంచి లాక్కొని శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఇప్పుడు మర్చిపోయి సోయి తప్పి పాఠశాలను వేరే చోటుకు మారుస్తున్నారని విమర్శించారు.
స్థానిక ఎమ్మెల్యే గారు శంకుస్థాపనలతోటి, సమీక్షల పేరుతోటి కాలయాపన చేస్తున్నారు తప్ప అభివృద్ధి మీద కొంచెం కూడా సోయి లేదని ఎద్దేవా చేశారు. కల్వకుంట్లలో శంకుస్థాపన చేసిన పాఠశాలను ఇప్పుడు మునుగోడు మండల కేంద్రానికి తరలించడం ఆ గ్రామ ప్రజల పట్ల సవతి తల్లి ప్రేమను చూపించడమే అని విమర్శించారు. మారుమూల గ్రామాలను అభివృద్ధి చేయాల్సిన రాజకీయ నాయకులు వారి అవసరాల కోసం అభివృద్ధి పేరుతోటి శంకుస్థాపనలు చేసుకుంటూ కాలయాపనలు చేస్తున్నారని విమర్శించారు . ఎమ్మెల్యే పాఠశాల విషయమే కాకుండా గతంలో కల్వకుంట్ల గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా గ్రామ ప్రజలను మోసం చేశారని వారు గుర్తు చేశారు.
ఈ గ్రామ పరిధిలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్మిస్తే మారుమూల గ్రామాలు అభివృద్ధి చెందడమే కాకుండా అన్ని మండలాలకు అణువుగా ఉంటుందని అన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు తన వ్యక్తిగత పోకడను మార్చుకొని కల్వకుంట్ల గ్రామంలోనే ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎక్కడకక్కడ నిరసన కార్యక్రమాలు చేస్తూ ఎమ్మెల్యే గారిని అడ్డుకుంటామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు కుక్కల మహేష్, కట్ట ఆంజనేయులు, మండల ఉపాధ్యక్షులు కట్ట వెంకన్న, గ్రామ సహాయక కార్యదర్శి కట్ట లింగస్వామి, బొందు శివ, ప్రజా సంఘాల నాయకులు పగిళ్ల మధు తదితరులు పాల్గొన్నారు.



