13 మంది మృతి…98 మందికి గాయాలు
నిజాండా : ఉత్తర అమెరికా దేశం మెక్సికోలోని ఓక్సాకా రాష్ట్రంలో ఇంటర్ ఓషియానిక్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. 98 మంది గాయపడ్డారు. ఓక్సాకా, వెరాక్రూజ్ రాష్ట్రాలను కలిపే ఇంటర్ ఓషియానిక్ రైలు నిజాండా పట్టణం సమీపంలోని ఒక మలుపు వద్ద పట్టాలు తప్పిందని అధికారులు తెలిపారు. సమాచారం అందగా హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. మెక్సికో నేవీ తెలిపిన వివరాల ప్రకారం ప్రమాద సమయంలో రైలులో 250 మంది ప్రయాణిస్తున్నారు. వారిలో 241 మంది సాధారణ ప్రయాణికులు, తొమ్మిది మంది రైల్వే సిబ్బంది ఉన్నారు. రైలు పట్టాలు తప్పడంతో బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇప్పటివరకు 13 మంది మరణించినట్టు అధికారులు ధ్రువీకరించారు. క్షతగాత్రుల సంఖ్య 98కి చేరింది. వీరిలో 36 మందికి ఆస్పత్రిలో అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. 139 మంది ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
హుటాహుటిన సహాయక చర్యలు
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అధికారులు స్పందించారు. సమాచారం అందుకున్న మెక్సికో నేవీ బృందాలు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. దాదాపు 360 మంది నావికాదళ సిబ్బంది రంగంలోకి దిగారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం 20 వాహనాలు, 4 అంబులెన్సులు, 3 ఎయిర్ అంబులెన్సులను మోహరించారు. పరిస్థితులను సమీక్షించడానికి ఒక టాక్టికల్ డ్రోన్‌ను కూడా వాడారు. బోగీల మధ్య ఇరుక్కున్న వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను దగ్గరలోని మతియాస్ రొమేరో, సెలినా క్రజ్, జుచిటాన్, ఇక్స్‌టెపెక్ ప్రాంతాల్లోని ఐఎంఎస్‌ఎస్ ఆస్పత్రులకు తరలించారు.
మెక్సికో ప్రెసిడెంట్ షీన్ బామ్ దిగ్భ్రాంతి
రైలు ప్రమాద ఘటనపై మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా షీన్ బామ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ”ఇదొక దురదృష్టకర సంఘటన. దుర్ఘటనలో 18 మంది చనిపోవడం బాధాకరం” అని పేర్కొన్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు నేవీ సెక్రెటరీని, అంతర్గత వ్యవహారాల శాఖ అధికారులను ఘటనా స్థలానికి పంపించారు. బాధిత కుటుంబాలను వ్యక్తిగతంగా పరామర్శించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. మెక్సికో అటార్నీ జనరల్ ఎర్నెస్టినా గోడోరు రామోస్ ఈ ఘటనపై స్పందించారు. రైలు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ప్రమాదం ఎలా జరిగింది? ఆ సమయంలో రైలు వేగం ఎంత? సాంకేతిక లోపం ఏమైనా తలెత్తిందా? ట్రాక్ వద్ద ఉన్న మలుపే ప్రమాదానికి కారణమా? అనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
ఇంటర్ ఓషియానిక్ రైలు విశిష్టత
ఈ రైలు మార్గానికి మెక్సికోలో చాలా ప్రాముఖ్యత ఉంది. దీనిని 2023లోనే మాజీ అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ ప్రారంభించారు. ఇది ప్రతిష్టాత్మకమైన ‘ఇంటర్ ఓషియానిక్ కారిడార్’ ప్రాజెక్టులో భాగం. పసిఫిక్ మహాసముద్రం వైపు ఉన్న సెలినా క్రూజ్ నౌకాశ్రయాన్ని, గల్ఫ్‌కోస్ట్ వైపు ఉన్న కోట్జాకోల్కోస్‌తో ఈ రైలు కలుపుతుంది. పనామా కాలువకు పోటీగా వాణిజ్య రవాణా మార్గాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో దీనిని నిర్మించారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన రైలు ప్రమాదానికి గురి కావడం చర్చనీయాంశమైంది.



